పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/664

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర వాఙ్మయ చరిత్రము - II


మధుర నాయకరాజ్యము: రాక్షస రంగడి యుద్దా నంతరమును, తంజావూరు నాయక రాజ్యమంతకు పదునైదేండ్లకు పూర్వమును, స్థాపింపబడినట్లు ఇటీవలి పరిశోధనముల వలన తెలియుచున్నది. మొట్టమొదట ఆంధ్ర వాఙ్మయము దక్షిణదేశమున ప్రవేశించుట కి నాయక రాజులే కారణభూతు అని పలువురు తలంతురు. కాని అంతకుముందే ఆ వాఙ్మయ మచ్చట అడుగుపెట్టె వనుటకు నిదర్శనములున్నవి. అచ్యుతదేవరాయలు (క్రీ.శ. 1529-42) ఆంధ్ర భాషాభిమానియై ప్రతి సంవత్సరము శ్రీ వేంకటేశ్వరస్వామికి సత్కావ్య ప్రబంధ పుష్పమును సమర్పించెడివాడట. అతని అడుగుజాడల ననుసరించి మంత్రి, నాయక సామంతాదులు కూడ కవులను పోషించి వారిచే రసవంతములైన కావ్యములు రచింపజేసి భాషా సేవ కావింప మొదలిడిరి. అట్టివారిలో రామనాథపుర మండలమునందలి శివపురి ప్రాంతమును రాయల పక్షమున పాలించుచుండిన గోళ్ళవంశపు నాయకులు ముఖ్యులు. వారు గోళ్ళ బసవేంద్రుని కుమారులు. వారిలో చినరామప్ప అనునతడు తన అన్న యగు పెద రామప్ప పేర పచ్చకప్పురపు తిరువేంగళ కవిచే తమ ఇలవేల్పైన చొక్కనాథుని చరిత్రమును ద్విపద కావ్యముగా చెప్పించెను. ఈ కారణముచే ఆంధ్ర సరస్వతిని తొలుదొల్త దక్షిణమున కాకర్షించిన గౌరవ మీ గోళ్ల నాయకులకే చెందవలసి ఉన్నది. కాని ఆమె నచ్చట స్థిరముగా ప్రతిష్ఠించి వివిధ కావ్యపుష్పహారములచే నారాధించిన వారు మధుర తంజావూరు నాయకులే యనుటకు సందేహింప నవసరములేదు.

దక్షిణాంధ్రయుగమున వాఙ్మయ వాహిని వివిధ వేణికలతో ప్రవహించినది. అందు పద్యములు, గేయములు, వచనములు, యక్షగానములు ముఖ్యములైనవి. అప్పటి పద్యకావ్యములు ప్రబంధములే. గేయరచన అప్పుడు విరివిగా సాగుటకు యక్షగానములలో అవి ప్రధానస్థాన మాక్రమించుటయే కారణము. సంకీర్తనలు, అధ్యాత్మ కీర్తనలు, ఏలలు, దరువులు, పదములు అందు ప్రధానములైనవి. కొరవంజి, దేశి, చౌవదము, జక్కిణి, జోగి, చిందు మున్నగు నాట్య భేదములకు అనుగుణముగా ప్రత్యేకములైన గేయములను పాడుచుండెడివారు. క్షేత్రయ, విజయరాఘవుడు, రంగాజమ్మ, సీనయ్య మున్నగువారు పదరచనయందును, త్యాగరాజు సంకీర్తన రచనయందును వాసికెక్కిరి.

వచనైక రచనలు 15 వ శతాబ్దికి ముందుకూడ రెండు వెలసినమాట సత్యమేయైనను అవి కొల్లలుగా రచింపబడుట దక్షిణాంధ్రయుగముననే. ఇప్పటి వచనరచనలు రెండు తెరగులు వాడుక భాషలో వ్రాయబడినవి, గ్రాంధికములు. రాయవాచకమువంటి చారిత్రక వచనములలో వాడుకభాష వాడబడినది. గ్రాంథిక రచనలు పెక్కు పురాణములకును ప్రబంధములకును వచనీకరణములు. ఇది అప్పటివారికి ప్రాచీన గ్రంథములపై గల అభిమానమును తేటతెల్ల మొనరించు చున్నది.

యక్షగాన మొక నాటక విశేషము. విజయ రాఘవుడు మున్నగువారు తమ యక్షగానములను నాటకములనియే వ్యవహరించిరి. ఇవి క్రీ. శ. 12వ శతాబ్దినుండియు ప్రచారమున నున్నను అప్పకవి కి పూర్వపు లాక్షణికు లెవ్వరును వానిని పేర్కొని యుండ లేదు. ద్రావిడ భాషలందలి దృశ్యరచనలు కొరవంజు లనబడుననియు, కొరవలు అను ఆటవిక జాతి వారు ముందు వానిని ప్రదర్శించెడి వారనియు, పిమ్మట జక్కులు లేక యక్షులు అనువారు వానివి చేబట్టుటచే వానికి యక్షగానము లను పేరువచ్చెననియు, కీ. శే. ప్రభాకర శాస్త్రులుగారు తెల్పియున్నారు. కొరవంజిని అనగా ఎరుకతను మొదట యక్షగానములలో ప్రవేశ పెట్టిన వారు తంజావూరివారే అగుటచే కొరవలమూలమున యక్షగానము లుత్పన్నము లయ్యె ననుట యుక్తము కాదనియు, అవి మతప్రచారము నిమిత్తమై ప్రభవించి తొలుత కొయ్యబొమ్మల మూలమునను తోలుబొమ్మల మూలమునను ప్రదర్శింపబడి తరువాత మనుజులే ప్రదర్శించిన మూగవాటకములై పిమ్మట గద్యపద్య గేయములతోకూడి యక్షగానము లయ్యె ననియు, బౌద్ధ యుగమునుండియు ఆంధ్ర దేశమున జక్కులులేక యక్షులు అను ఒక తెగవారు నివసించుచుండి రనియు, వారికిని యక్షగానముల యుత్స తికిని సంబంధముండుననియు ఇట్టివి సంస్కృతమునకూడ నుండె ననుట కాధారము