పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/658

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర వాజ్మయ చరిత్రము - II


మాహాత్మ్యము కడుంగడు ప్రౌఢమైన ప్రబంధము. దీర్ఘ సంస్కృత సమాసములతోడను, అపరిచిత పద ప్రయోగముతోడను కూడి ఇందలి శైలి పఠితకు కొంత క్లేశము కలిగించును. ఇట్లని రామకృష్ణు డచ్చట చ్చట ముచ్చటగొల్పు తెలుగురచన సాగింపకపోలేదు. ఈ కావ్యమున పెక్కు సామెతలును జాతీయములును సందర్భోచితముగా పొదుగబడినవి. గంభీర భావప్రకటన మందును, రసపాత్ర పోషణమునందును రామకృష్ణుడు మిక్కిలి నేర్పరి.

అష్టదిగ్గజ కవులలోని వాడు కాకపోయినను రాయల వారి కాలమున నుండిన మహాకవులలో సంకుసాల నృసింహకవి యొకడు. ఇతడు కవికర్ణ రసాయన మను నామాంతరముగల మాంధాతృ చరిత్రమును రచించి శ్రీరంగేశ్వరునికి అంకితము చేసెను. ఇతడు భట్ట పరాశరుని శిష్యుడు. ఈ పరాశరుడు క్రీ. శ. 1536 వ. సంవత్సరములో నుండెననుటకు శాసనసాక్షము కలదు. అందుచే నృసింహకవి క్రీ. శ. 16వ శతాబ్ది పూర్వార్థమున నుండెనని చెప్పుటకు అవకాశము కలుగుచున్నది.

కవికర్ణ రసాయనము ఆరాశ్వాసముల శృంగార ప్రబంధము, ఇందు మాంధాతృచక్రవర్తి చరిత్రమును,అతడు విమలాంగిని వివాహమాడిన వృత్తాంతమును చక్కగా వర్ణింపబడినవి. తన కావ్యమునందలి శృంగార రసవర్ణనమును విన్న మాత్రమున యతి విటుడు కాకపోడనియు, అందలి వై రాగ్యవర్ణ నాకర్ణనమాత్రమున విటుడు యతి కాకపో డనియు ఆతడు చెప్పుకొని యుండెను. ఇందు కొంత అతిశయోక్తి యున్నను ఈకవి ప్రతిభాశాలి యనుటకు సందేహములేదు. ఈతని వర్ణనలు గంభీర భావశోఖితములై మిక్కిలి మనోహరములుగా నుండును. ఇతడు కావ్యారంభమున రాజులను నరకృతిని నిరసించి యుండెను. ఈతనిశైలి సంస్కృత సమాస భూయిష్ఠ మయ్యును ధారాళమై మిక్కిలి రసవంతముగా నుండును.

తెలుగున కవిత్వమువ్రాసి పేరుగన్న పనితారత్నములలో ఆతుకూరి మొల్ల మున్నెన్న దగి యున్నది. ఈమె కాలమును సరిగా నిర్ణయించుటకు ఆధారములు లేవు. కాని పూర్వక విస్తుతిలో ఈమె శ్రీనాథుని తరువాత నుండిన కవీంద్రుల నెవ్వరిని పేర్కొనియుండమిచే, ప్రబంధకవుల కాలముననే యుండె నని యూహింప వీలగు చున్నది. ఈమె తాను గోపవరపు శ్రీకంఠమల్లేశుని దయచే కవితా కౌశలము నేర్చితినని చెప్పుకొనియున్నది. ఈమె మిక్కిలి వినియముకలది. తనకు నిఘంటువులు, వ్యాకరణాలం కారాది శాస్త్రములు తెలియవనియు, శ్రీరామచంద్రుని ప్రేరణముచే తా నిహపర సాధనమునకై రామాయణమును రచించితిననియు, సవినయముగ తెల్పియున్నది. తెలుగు కవిత్వము దుర్బోధములైన సంస్కృత సమాసములతో కూడియుండక తేట తెలుగు మాటలతో ధ్వని ప్రధానమై యుండవలె ననియు, తేనె సోకినంతనే నోరు తీయనగురీతిని విన్న తోడనే యర్థమెల్ల తోచునట్లుండవ లెననియు, అట్లుగాక గూఢశబ్దములతో కూర్చిన కావ్యము మూగ చెవిటి వారి ముచ్చటవలె నుండుననియు, ఈమె కవిత్వమును గూర్చి తన అభిప్రాయమును వెల్లడించెను. ఈమె తన రామాయణమును శ్రీరామునికే అంకితము కావించెను.

మొల్ల తనకంత విద్యాసంపన్నతలేదని చెప్పుకొని యున్నను ఈమె కావ్యమున పాండిత్యలోప మెచ్చటను కానిపించదు. ఈమె వర్ణనలన్నియు ప్రబంధోచితములై మిక్కిలి ప్రౌఢముగా నుండును. అందును సాకేత నగర వర్ణనము శ్లేష శబ్దాలంకార పూరితమై ఈమె పాండితీ విశేషమును పలువిధముల సూచించుచున్నది. అయోధ్యా కాండము మొదట ఈమె కావించిన ప్రకృతివర్ణనము మిక్కిలి రమణీయముగా మన్నది. ఈమె సుందర, యుద్ధ కాండములను కొంచెము విస్తృతముగ వ్రాసినను మిగిలిన కాండములను చాల సంగ్రహించి వైచినది. ఈమె రామాయణమున కథ మిక్కిలి వేగముగా సాగిపోయినది. సీతాప హరణానంతరము రాముడు పొందిన దుఃఖము నీమె కరుణరస నిర్భరముగా వర్ణించినది. అట్లే సుందరకాండమున హనుమంతునితో సీత తన వృత్తాంతమును చెప్పుకొన్న ఘట్టముకూడ మిక్కిలి జాలిగొల్పునదై మొల్ల స్త్రీ హృదయమును వెల్లడి చేయుచున్నది. ఔచిత్యపోషణమున నీమె అందెవేసిన చేయి. ఈమె శైలి మృదుమధుర పద గుంఫితమును, భావబంధురమునై సర్వజన రంజకముగా నుండును.