పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/657

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర వాజ్మయ చరిత్రము - II


లను గూర్చియు, గుణదోషములను గూర్చియు వివరింప బడినది. ప్రతాపరుద్ర యశోభూషణమున నున్న నాటక ప్రకరణ మిందు లేదు. అందు లక్ష్యములన్నియు ప్రతాపరుద్ర వర్ణన పూర్వకములైయుండ ఇందు అళియరామరాయల మేనల్లుడును, ఓబయరాజు కుమారుడు నగు నరస భూపాలుని వర్ణించునట్టివిగా నున్నవి.

భట్టుమూర్తి రచనలలో శ్రేష్ఠమైనదియు ఆంధ్ర వాఙ్మయమునకు అలంకారమని చెప్పతగినదియు వసు చరిత్రము. ఇది రామరాయల తమ్ముడును, తాళికోట యుద్ధమైన పిమ్మట, విజయనగర రాజ్యము నేలినవాడును అగు తిరుమలరాయలకు అంకితము చేయబడినది. వసు మహారాజు శుక్తిమతీ కోలాహలుల పుత్రిక యైన గిరికను వలచి ఫెండ్లియాడిన వృత్తాంతము ఇందలివస్తువు. భట్టు మూర్తి, కథను మహాభారతమునుండి గ్రహించి, ఎడ నెడ వర్ణనములను చేర్చి ఈ మహాప్రబంధమును నిర్మించెను. ఇందు కథారామణీయకమంతగా కానరాదు కాని, కవితా పాండిత్య ప్రకర్షయందును, భావోన్నతియందును, రస పోషణమునందును, శ్లేషధ్వని కల్పనలందును ఇది అద్వితీయముగా నుండును. ప్రబంధ లక్షణములన్నియు ఇందు కానవచ్చును. ద్వితీయాశ్వాసమున శుక్తిమతీకోలాహలుల వృత్తాంతము వర్ణించుపట్ల భట్టుమూర్తి చూపిన కవితా చమత్కారమును, నాయికా నాయకత్వా రోపణమును అద్భుతములుగా నుండును. తృతీయాశ్వాసము నందలి విరహాది వర్ణనలు అనన్యసామాన్యములు. లతికాసంవృత గాత్రుడైన వసురాజు కపటముని వేషధారియగు తన నర్మసఖుని సూచన ననుసరించి బయల్పడుపట్టున దృశ్య కావ్యలక్షణములు గోచరించును. ఇందలి ప్రకృతివర్ణనలు సహజముందరములై యుండును. భట్టుమూర్తి శైలి ప్రౌఢమయ్యు మృదుమధురమై సంగీతమున కనువుగా గోచరించును. లలవాజనాపాం గేత్యాది సీసపద్యముల నడక అత్యంత హృద్యముగా నుండును, వసుచరిత్ర సంస్కృతమునకు కూడ అనువదింపబడుటయే దీని ఔత్కృష్ట్యమునకు తార్యాణము. ఆంధ్రప్రబంధ వాఙ్మయ తారహారమున కిది నాయకమణి యని చెప్పవచ్చును. తరువాతి కవు లెందరో దీని ననుకరించి యుండుటచే వారి రచనలకు పిల్ల వసుచరిత్ర అను పేరు కలిగినది.

హరిశ్చంద్ర నలోపాఖ్యానమను ద్వ్యర్థికావ్య మీతని తుది రచన. ఇందు నల హరిశ్చంద్ర మహారాజుల కథలు చక్కగా జోడింపబడినవి. రామాయణ భారతకథలకువలె ఈ రెండు కథలకు సన్ని వేశసామ్య మంతగాలేకపోయినను భట్టుమూర్తి తన అపూర్వ పాండిత్య ప్రతిభావి శేషములచే అద్భుతమైన శ్లేష కూర్చి వాని నేక సూత్రమున సంధింప జాలెను. ఇతని శ్లేష సంఘటన వైఖరిని పాండితీ వైభవమును చూచి అచ్చెరువు పొందనివా రుండరు. శ్లేష కావ్యమయ్యు ఇందలి వర్ణనలు సహజసుందరములును, రసవంతములు నై యొప్పారును. ఈ కావ్య ప్రారంభమున భట్టుమూర్తి భక్తిభావము లెస్సగా వ్యక్తము చేయబడినది.

అష్టదిగ్గజములలోని వాడుగా ప్రసిద్ధినందియు రాయల కాలమున ఉండేనా లేదా అను సందేహము కలిగించు వారిలో తెనాలిరామకృష్ణు డొకడు. ఈతని చాటువులును, హాస్యోక్తులును ఆంధ్ర దేశమున చాల ప్రచారము పొందినవి. ఇతడు రచించిన గ్రంథములు రెండు. ఉద్భటారాధ్య చరిత్రము, పాండురంగ మాహాత్మ్యము. ఉద్భటారాధ్య చరిత్రము శైవప్రబంధము, దీనిని రచించిన రామలింగ కవి రామకృష్ణునికంటె భిన్నుడని కొందరందురు. కాని ఇతడే మొదట రామలింగ డయ్యు తరువాత వైష్ణవమును స్వీకరించి రామకృష్ణు డయ్యెనని తోచుచున్నది. అప్పుడు కూడ శై వమన్న ఆతనికి వైముఖ్యము లేదు.

పాండురంగ మాహాత్మ్యము భీమనదీతీరమునందలి పుండరీక క్షేత్రము యొక్క మహత్త్వమును వర్ణించు క్షేత్ర మాహాత్మ్యము. ఇందలి కథ స్కాందపురాణము నుండి గ్రహింపబడినది. క్షేత్రము, తీర్థము, దైవము,అను మూడును ఉదాత్తములై యుండు ప్రదేశ మేది యను ప్రశ్నకు ఉత్తరముగా ఇందలికథ చెప్పబడినది. ఇందలి ద్వితీయా శ్వాసము నందలి పుండరీకుడను పరమ భక్తాగ్రేసరుని వృత్తాంత మతిరమణీయముగా నుండును. పాండు రంగ క్షేత్ర మాహాత్మ్యమును సూచించు నితరకథ లెన్నియో ఇందుగలవు. వానిలో నిగమశర్మకథయు, సుశీల కథయు ముఖ్యములైనవి. వీటియందును, అయుతనియుతుల కథయందును రామకృష్ణుడు చూపిన కథా కథనపద్ధతి మిక్కిలి రమ్యముగా నుండును. పాండురంగ