ఆంధ్ర వాఙ్మయ చరిత్రము - I
పూర్వముండిన కవిత్వము ప్రధానముగా దేశిమార్గమునకు చెందినది. భాషాచ్ఛందో విషయముల నది దేశిపద్ధతి నవలం
బించి సంస్కృత లక్షణమునకు విరుద్ధమై యుండుటచే పండితాదరమును బడయక ప్రాకృత జనైక రంజకమై
యొప్పారెను. అట్లుగాక సలక్షణమైన భాషలో దేశీ మార్గములు రెండింటికి చెందిన పద్యములతో నుదాత్త వస్తుకమైన మహాకావ్యమును రచించి నన్నయ పండిత పామరులందరికిని ప్రీతి నాపాదింపజాలెను. ఇంతవరకు లభ్యములైనవానిలో నట్టిరచనతో కూడిన ప్రథమ కావ్య మాతని భారతమే. అందుచేతనే దాని కాంధ్రమున నాదికావ్య మను ప్రసిద్ధి కలిగినది.
ఆ యారంభ దినములలో నన్నయ ఆంధ్రభాష కొనరించిన సేవ యింతింతనరానిది. ఆతడు జనవ్యవహారము నందలి పదజాలము నంతను పరిశీలించి, సంస్కరించి, సంస్కృతపదములను తెలుగున వాడు పద్ధతిని నిర్ణయించి, ధారాళమైన నడక గల కొన్ని సంస్కృత వృత్తములను గ్రహించి, తననాటికే ఉత్తమ కావ్యములతో నొప్పారు చుండిన కన్నడవాఙ్మయమునుండి ప్రశస్తలక్షణములు సేకరించి తెనుగున నుత్తమమైన కావ్యరచనా మార్గము తీర్చిదిద్దెను. ఇది అనన్యసామాన్యమైన అతని ప్రతిభా మహత్త్వమునకు తార్కాణము.
నన్నయ ఆంధ్రభారతమునం దాది సభాపర్వములను, అరణ్యపర్వమునందు మూ డాశ్వసములపయి 142 పద్యములను మాత్రమే రచించెను. అతడు వ్యాసుని సంస్కృత భారతమునందలి కథ ననుసరించినమాట నిజమేయైనను అందు తన కనవసరములని తోచిన భాగములను తగ్గించి, అవసరములని తోచినపట్ల పెంచి, ఔచిత్య దృష్టితో కొన్ని మార్పు లొనరించి, తన కృతిని సర్వవిధముల నొక స్వతంత్ర కావ్యమా అనునట్లు సాగించెను. అతని కవిత్వము ప్రసన్న కథా కలితార్ధ యుక్తికిని, అక్షర రమ్యతకును, నానారుచిరార్థసూక్తి సంపదకును నెలవై వీనులవిందు చేకూర్చుచుండును. ఉదంకోపాఖ్యానము, శకుంతలోపాఖ్యానము, నలోపాఖ్యానము, సౌగంధికాహరణము, రురుప్రమద్వరల కథ మున్నగు వృత్తాంతముల రచించుటలో నాతడు చూపిన నేర్పు అప్రతిమానమైనది. ఆతని కవిత్వము సంస్కృతపద బహుళ మయ్యును క్లిష్టాన్వయములు లేక ధారాశుద్ధికిని ధ్వని గాంభీర్యమునకును నిధానమై చదువరుల కానందము కూర్చు చుండును. ఆంధ్రమున గురుపద్య విద్యకువలెనే గద్యవిద్యకును నన్నయయే ఆద్యుడని చెప్పవచ్చును. అతని వచనము సులలిత పదఘటితమై అతిధారాళమై ఒప్పారు చుండును. అతడు చంపకోత్పలమాలాది వృత్తములనే కాక తరువోజ, మధ్యాక్కర మున్నగు దేశిపద్యములను గూడ వ్రాసియుండెను. ఆంధ్రమున కావ్యములను వ్రాసిన తరువాతి కవులెల్లరు నాతని గురుప్రాయునిగా భావించి కొనియాడియుండిరి.
రాజరాజు మరణించినపిమ్మట కొన్ని రాజకీయ మత సాంఘిక కారణములచే ఆంధ్రభారతరచన కొనసాగుట కంతరాయ మేర్పడెను. రాజరాజు కుమారుడైన కులోత్తుంగచోడుడు తండ్రి తరువాత వేంగీ సామ్రాజ్యమును పాలింపక మాతామహు రాజ్యమయిన చోళరాజ్యమున కధిపతి అయ్యెను. అది తమిళ భాషాప్రచారముగల దేశమగుటచే నాత డచ్చటనుండి ఆంధ్రభాషను పోషించుట కవకాశము లేకపోయెను. క్రీ. శ. 12 వ శతాబ్ది ఆరంభమున కన్నడదేశమున బసవేశ్వరు డవతరించి, వీరశైవ మతమును స్థాపించెను. ఈ క్రొత్తమతము వర్ణాశ్రమ వ్యవస్థనుగాని, వేదప్రామాణ్యమునుగాని ఆంగీకరింపక భక్తి ప్రధానమై యుండెను. దీని ప్రభావము కన్నడ దేశము నుండి క్రమముగా దక్షిణమునం దంతటను ప్రాకెను. ఇట్లొక వంక వీరశైవము వ్యాప్తిచెందుచుండ, ఆంధ్రదేశమున దానికి ప్రతియోగముగా రామానుజ స్థాపితమయిన వైష్ణవముకూడ పెంపొంద నారంభించెను. భక్తిప్రధానములైన ఈ మతముల నవలంబించి తత్ప్రచారమునకై యత్నించు చుండిన కవులు వైదిక మత ప్రధానమైన భారతమును కొనసాగింప పూనిన వారు కాకపోయిరి.
నన్నయ తరువాత చెప్పదగిన తెలుగుకవి నన్నెచోడుడు. ఈతడు నన్నయకు పూర్వుడని కొందరును,సమకాలికు డని కొందరును. తిక్కన తరువాతివాడని కొందరును, నన్నయ తిక్కనల నడిమి కాలము వాడని కొందరును చెప్పుచున్నారు. ఇం దేది సత్యమో నిశ్చయముగా చెప్పుటకు తగిన ఆధారములు లేవు. కాని చివరి వాదమే కొంచెము యుక్తియుక్తముగా కనబడు చున్నది.