ఆంధ్ర లక్షణ గ్రంథములు
పూర్వకవి ప్రయోగములను చక్కగా నెరిగినవాడు. పదునెనిమిదవ శతాబ్ది ఆరంభముననున్న ఇతడు కూచిమంచి తిమ్మకవికి సమకాలికుడుగా తలపబడుచున్నాడు.
మండ లక్ష్మీనరసింహాచారి (1670 ప్రాంతము) కృతమయిన “ఆంధ్ర కౌముది" ఇంకొకటి కలదు. ఇది ఆంధ్రభాషకు సంస్కృతసూత్రములలో వ్రాయబడిన వ్యాకరణము. ఉదాహరణములు తెలుగునం దున్నవి.
సర్వలక్షణసార సంగ్రహము : కూచిమంచి తిమ్మకవి ఈ గ్రంథమును రచించెను. ఇతడు క్రీ. శ. 1700-1757 ప్రాంతమున జీవించియుండెను. పీఠికాపుర సంస్థానమునకు చెందిన కందరాడ అతని గ్రామము. సర్వలక్షణసార సంగ్రహమునందు తత్సమ, శుద్ధాంధ్ర వర్ణ, సంధి, విభక్తి, సమాస, క్రియావిశేషణ ప్రకరణము లనెడి విభాగములతో వ్యాకరణాంశములును, ప్రాస, విశ్రమ. ప్రకరణ నామ ధేయములతో ఛందో విషయములును, శబ్ద ప్రకరణము అను పేరుతో శబ్దముల రూపభేదములును ;రేఫ ద్వయ నిర్ణయ మను పేరుతో రేఫ, ఱ కారముల భేదమును తెలుపబడినవి. ప్రతి విభాగమునందును ప్రాచీనకవి ప్రయోగములు పుష్కలముగా నీయబడినవి. బమ్మెర పోతరాజు రేఫ, ఱ కార భేదమును పాటింప లేదని అప్పకవి మున్నగువారు చేసిన విమర్శనము సమంజసము కాదని ఇతడుచెప్పెను. తిమ్మకవి బహుగ్రంథ కర్త. "కవి సార్వభౌమ" బిరుదాంకితుడు.
బాలవ్యాకరణము : పరవస్తు చిన్నయసూరి (క్రీ. శ. 1806.1862) ఈ గ్రంథమును రచించెను. తెలుగు వ్యాకరణ సూత్రములలో ఇంత జిగిగల రచన మరియొక దాని యందు లేదు. బాలవ్యాకరణ రచనకు నన్నయభట్టీ యాది గ్రంథము లాధారములు. ఇందు సంజ్ఞ, సంధి, తత్సమ, అచ్ఛిక, కారక, సమాస, తత్ధిత, క్రియా, కృదంత, ప్రకీర్ణక పరిచ్ఛేదములు గలవు. సూరిగారు ప్రాచీన వ్యాకరణములనేకాని అర్వాచీన కవి ప్రయోగములను పాటింపమి కొన్ని ప్రయోగములు బాల వ్యాకరణముననుసరించి అసాధువు లగుచున్నవి. కాని వ్యాఖ్యాతలు బహుళాంశములను చేర్చుటచేత సవ్యాఖ్యానమగు బాల వ్యాకరణము తెలుగు విద్యార్థులకు అత్యంతోప కారముగ ఉన్నదనుట నిస్సంశయము. బాల వ్యాకరణమునకు ప్రథమమున “గుప్తార్థ ప్రకాశిక" అను పేరితో వ్యాఖ్యానమును కల్లూరి వేంకట రామశాస్త్రిగారు రచించిరి. పిమ్మట దూసి రామమూర్తి శాస్త్రిగారు 'గ్రాంథికాంధ్ర కల్పకము', లేక 'బాల వ్యాకరణ సారస్యసర్వస్వ పేటిక' అను వ్యాఖ్యను రచించిరి. దూసివారు కల్లూరివారి నచ్చటచ్చట విమర్శించిరి. ప్రక్రియాంశములకు గుప్తార్థ ప్రకాశికయు, విశేష చర్చలకు దూసివారి వ్యాఖ్యయు, ఉపయోగించునవియై బాల వ్యాకరణమునకు వన్నె పెట్టినవి. వ్యాకరణ సూత్రములను వచన రూపమున వెలయించుట బాల వ్యాకరణ వైశిష్ట్యములలో నొకటి. చిన్నయసూరి బాల వ్యాకరణమునే కాక (1) సూత్రాంధ్ర వ్యాకరణము (2) ఆంధ్రశబ్ద శాసనము; (3) పద్యాంధ్ర వ్యాకరణము అనేడి మరి మూడు వ్యాకరణములను గూడ రచించెను, వీటిలో సూత్రాంధ్ర వ్యాకరణము సంస్కృత సూత్రములతో ఉన్నది. సూరిగారికి సమకాలికులగు శిష్టు కృష్ణ మూర్తి శాస్త్రిగారిచేత రచింపబడిన 'హరి కారికలు' అను సంస్కృత సూత్ర గ్రంథము ఈ కాలముననే వెలసినది. బాల వ్యాకరణమునకు ఈకారికలే మూలమని కొందరును, బాల వ్యాకరణమే హరికారికలకు మూలమని మరికొందరును భావించుచున్నారు.
ఆంధ్ర ధాతుమాల :- ఇది ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారిచేత ప్రకటింపబడినది. దీని కర్తను గురించి సంశయము గలదు. చిన్నయ సూరిగారు 'ధాతుమాల' అను గ్రంథమును రచించి యుండిరని మాత్రము పండితులు విశ్వసించుచున్నారు. అది ఇదియేయని చెప్పుట కాధారములు లేవు. ఈ గ్రంథమునందు గ్రామ్యధాతువులు సైతము
కలవు. పరమ లాక్షణికుడైన చిన్నయసూరి ఇట్టి గ్రంథమును రచించునా ? అని సంశయము. శ్రీ కట్టి సాంబమూర్తి శాస్త్రిగారు ఈ గ్రంథమునకు పీఠికను వ్రాయుచు అందులో చిన్నయసూరి కృత ధాతుమాలతో తరువాతి వారు కొన్ని గ్రామ్యములను చేర్చియుందురని యూహించిరి, వారి ఊహ సయుక్తికముగా నున్నది, ఏమైనను కర్తృ నిర్ణయ మింతవరకు జరుగలేదు. గ్రంథ మాంధ్ర భాషా జిజ్ఞాసువులకు ఉపయోగించుననుటయం దెంత మాత్రమును సంశయములేదు. అకారాద్యనుక్రమణిక తో