పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/606

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర లక్షణ గ్రంథములు


ములు వరుసగా కలవు. ఈ గ్రంధమునకు ద్వితింత్రిణీ సీతారామకవి 'కవిజనమండనము' అను వ్యాఖ్యను రచించెను. ఇతడు అహోబలపండితుని తరువాతివాడని విమర్శకుల అభిప్రాయము. ఈద్వితింత్రిణీ సీతారామకవి వ్రాసిన టీక బాలవ్యాకరణకర్తకు నూతన వ్యాకరణ రచనము నందు ఉపయోగించియుండునని సోదాహరణముగా వఝల చిన సీతారామస్వామిశాస్త్రి గారు నిర్ణయించిరి. వికృతి వివేకకర్తయైన అథర్వణుడు ఆంధ్రవ్యాకరణ శాస్త్ర ద్వితీయాచార్యుడు ఈతడు వ్రాసిన మరియొక గ్రంథము "త్రిలింగ శబ్దానుశాసనము" ఇది కారికావళి కన్న చిన్నదియగుటచేత దీనిని రచించిన పిమ్మట బహుళాంశములుగల కారికలను ఇతడు రచించెను. సుమారు 24 కారికలతో చింతామణి ప్రతిపాది తాంశములను 'ఉక్తానుక్త దురుక్త చింతనపురస్సరము'గా సమర్థించునట్టి అథర్వణకారికావళి, (వికృతివివేకము) ఆంధ్ర భాషా వ్యాకరణములకు తలమానికము వంటిది. అథర్వణుడు నన్నయకు సమకాలికుడని కొందరును, క్రీ. శ. 13వ శతాబ్దివాడని కొందరును నిర్ణయించిరి.

ఆంధ్రభాషాభూషణము : ఇది మూలఘటిక కేతనకవి ప్రణీతము. ఏకాశ్వాస పద్యకావ్యముగా ఇది రచింపబడినది. ఇందు 189 పద్యములు కలవు. కేతనకవి మహాకవి యగు తిక్కనకు సమకాలికుడు. కనుక పదు మూడవ శతాబ్దివాడు. ఇతనికి 'అభినవదండి' అను బిరుదముకలదు. దండి కవికృతమైన దశకుమార చరితమును ఆంధ్రీకరించుటచేత ఇతనికీ బిరుదము వచ్చెను. ఆంధ్ర వ్యాకరణమును తెనుగునందే రచించిన వారిలో ఇతడు ప్రథముడు. ప్రాచీనములైన చింతామణి వికృతివివేకములను కేతన చూచినట్టు లేదు. తానే తొలిసారిగా తెలుగువ్యాకరణమును రచించుచున్నట్లు గ్రంథాదిని తెలిపినాడు. ఇది స్వతంత్రమైన గ్రంథము. ఆంధ్రభాషాపదములు అయిదు విధములుగా ఇందు విభజింపబడినవి. 'తెనుగు' దేశ్యము, భిన్నము లని కేతన యభిప్రాయము. కాని తత్సమము తప్ప ఇతరములయిన నాలుగును కలిసి అచ్చ తెనుగుగునని అంగీకగించినాడు. నన్నయభట్టి యాదులందువలె విపులార్థ సంగ్రహముగాని, చక్కని వ్యాకరణ పరిభాషగాని ఇందు లేదు. లక్ష్యజ్ఞానము కలుగుటకుమాత్రము ఉపయోగించును. పద్య కావ్య మగుట చేత కంఠస్థము చేయుటకు అనువైన గ్రంథము.

అహోబల పండితీయము : ఈ గ్రంథమునకు "కవి శిరో భూషణము", "అహోబల పండితీయము" అని రెండు నామధేయములు కలవు. ఇది నన్నయభట్టారకుని చింతామణికి విపులమయిన (భాష్యమువంటి) సంస్కృత వ్యాఖ్యానము, నన్నయ యొక్క సూత్రములకు లొంగని కవిప్రయోగములను అథర్వణకారికలతో సమన్వయించి లక్ష్యసాధన చేయుచు, కేతనాదులను అచ్చటచ్చట ఖండించుచు, బహుళాంశములను చర్చాపూర్వకముగా ప్రతి పాదించుచు, అహోబలపతి ఈ వ్యాఖ్యానమును రచించెను. సంస్కృతమునందు పాణిన్యాచార్యుడు సూత్రములను, వరరుచి వార్తికములను, పతంజలి మహర్షి భాష్యమును రచించినట్లు, తెనుగు వ్యాకరణమును సంస్కృత భాషయందు సూత్రములుగా నన్నయభట్టారకుడును, వార్తికములుగా అథర్వణాచార్యుడును, భాష్యముగా అహోబలపండితుడును రచించిరి. కావున పాణిన్యాదుల వలె వీరును దెనుగు వ్యాకరణమునకు "మునిత్రయము" అనబడుచున్నారు.

అహోబలపండితుడు, ఎలకూచి బాలసరస్వతి, అప్ప కవి మున్నగు లాక్షణికులకున్న తరువాతివాడు. ఇందు ఆంధ్ర వ్యాకరణాంశములు సంస్కృతభాషయందు ఉదాత్తముగా చర్చింపబడినవి. ఈ గ్రంథము ఆంధ్ర భాషకు శిరోభూషణము వంటిది. ఆర్వాచీన వ్యాకర్తల కిది మిక్కిలి ఉపయోగపడినది.

ఆంధ్రకౌముది: గణపవరపు వేంకటపతికవి ప్రణీత మయిన "సర్వలక్షణ శిరోమణి"లోని వ్యాకరణాంశములను తెలుపునట్టి సీసమాలికకు “ఆంధ్రకౌముది" అని పేరు. ఆంధ్ర కౌముది ప్రత్యేక గ్రంథముగా ఆంధ్ర సాహిత్య పరిషత్తు (కాకినాడ) వారిచే ప్రకటింపబడినది. ఇది వేయి చరణములుగల సీసమాలిక ఇందు తద్భివ, తత్సమాది పదభేదములు, సంస్కృత సంజ్ఞాప్రకరణము,విభక్తి స్వరూపములు, అవ్యయ స్త్రీ ప్రత్యయ సమాస స్వరూపములు, తద్ధిశ శిజంతములు. క్విబంతములు, పూర్వ ప్రయోగములు, త్రిశూలబంధ పంచచామరము మున్నగు వంశములు గలవు. గ్రంథకర్త ప్రాచీన వ్యాకరణములను