పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/601

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రభాషా చరిత్రము


సంస్కృతము ననుసరించుట, అందలి వాఙ్మయమును అనువదించుట అనునవియే. నన్నయ సూచించిన వ్యాకరణ విధానమునుగూడ తరువాతివారు అనుసరించి దానిని విశాల మొనరించిరి. 19 వ శతాబ్దితో ఈ భాష కొక క్రొత్తమార్గ మేర్పడు పరిస్థితి సంభవించెను.

ఆంగ్ల పరిపాలనము దేశములో స్థిరపడుట, ఆంగ్లేయ విద్వాంసులు కొందరు మనభాష నాదరించుట, మన దేశములోని బుద్ధిమంతు లందరును ఆంగ్లమునే చదువు చుండుట భారతదేశమునందలి భిన్న దేశభాషలను మాటాడువారి కందరికిని సంబంధము మరలమరల కలుగుటకు అనువుగా దేశమునందు రైలు ప్రయాణములకు సౌకర్యము లేర్పడుట, విద్యా ప్రణాళిక ననుసరించి ఐహిక విద్య నెల్లరును విరివిగా నేర్చుట, అచ్చుపుస్తకములు బయలు వెడలుట, వార్తాపత్రికలు ప్రచారములోనికి వచ్చుట, ప్రజాసాహిత్యము, ప్రజాభిప్రాయము అను వాటికి ప్రాముఖ్యము గలుగుట మొదలగునవి తక్కిన భారతీయ భాషలనువలెనే తెనుగుభాషనుగూడ మార్చినవి.

క్రీ. శ. 1817-55 వరకును సివిలు సర్వీసులో నుండిన సి. పి. బ్రౌను మచిలీ బందరులో స్థిరపడి తమ ధనమును, బుద్ధిని ఆంధ్రభాషా సంరక్షణకును, అభివృద్ధికిని మిక్కిలిగా వినియోగించెను. ఆతడు ఆనాడు దొరకిన తాటాకు వ్రాత ప్రతులు నన్నిటిని సంపాదించి సంరంక్షించెను. తెనుగులోని మహాకావ్యములను భిన్నమార్గములలో నుండిన వ్రాత ప్రతులనుండి ఉద్ధరించి, ప్రామాణికమైన ప్రతులను సిద్ధపరచి అచ్చువేయించుపద్ధతి నతడు తెనుగున నెలకొల్పెను. తెనుగున కొక నూత్న మార్గమున నేటి అకారాది కోశమువంటి దాని నొకటి తయారుచేయించెను. వాఙ్మయ చరిత్ర, కవుల కాలమును కనుగొను పద్ధతి మొదలగువాటి నేర్పరచెను. నేటి తెలుగు వ్యాకరణ రచనా పద్ధతికి దారిచూపెను.

1800 సంవత్సరమునుండియు మనభాష ఆంగ్లభాషా వాఙ్మయ సాహచర్యమువ పెరుగ దొడగెను. దానివలన ఆంగ్ల పదములు, ఆంగ్ల వాక్యరచన, ఆంగ్ల వ్యాకరణ విధానము, ఆంగ్ల శాస్త్రమర్యాదలు, ఆంగ్ల వాఙ్మయ ప్రక్రియలు తెనుగున జొచ్చి విశాలముగా వ్యాపించెను. ఈ మార్గమును స్థాపించి ప్రచురించుటలో శ్రీ కందుకూరి వీరేశలింగముగారు ప్రధారులు. ఇతనిని ఈ యుగ ప్రవర్తకునిగా పేర్కొనవచ్చును. ఈ యుగమున తెనుగు భాషా వికాసమునకు సంస్కృతభాషా సాహాయ్యము మాత్రమేగాక, ఆంగ్లభాషా సాహాయ్యమును, ఇతర భారతదేశ భాషల విషయములును ఉపకరించెను.

భాషాపరిణామ విషయమున ప్రబలమైన సహాయము వ్యాకరణము. నన్నయనాటి వ్యాకరణ విభజనము కేవలము సంస్కృతము ననుసరించియే జరిగినది. తెనుగు భాష యొక్క స్వభావము సంస్కృతము కంటె చాల భిన్నము, అది మిక్కిలి సరళము, తిన్న నైనది. సులభమయిన మార్గముతో కూడినది. విశాలమై పెరిగిన పద్ధతులతో గూడిన సంస్కృత వ్యాకరణ మర్యాదలను తెనుగున కతికించుచు నన్నయమార్గము 19 వ శతాబ్దివరకును నడచినది. ఆ తరువాత ఆంగ్లవ్యాకరణ మర్యాద ఆనాటి వ్యాకరణ రచనకు అంటుకట్టుటచేత నేటి తెనుగు వ్యాకరణములు చాలవరకు ఆంగ్లవ్యాకరణ మర్యాదను గూడ ననుసరించుచున్నవి. వ్యాకరణ విషయమున నుండవలసిన ప్రధాన భావములు అనేకములు మారిపోయినవి.

తెలుగునందలి పదజాలము చాలవరకు మార్పు నొందినది. నన్నయ తన భారతమును రచియించుటకు ముందు తెలుగు చాల నల్పసంఖ్యాకములయిన పదములతో గూడియుండెను ఈ పదములు ద్రావిడములు అనగా తెనుగునకు స్వాభావికములై మొదటినుండియు నందు ఉత్పన్నములయినవియే. ఈ పదములన్నియు నేటి తమిళ, కర్ణాట, మలయాళ భాషలలోని ఆదిమ పదజాలముతో అభిన్నములు. ఒక్క పదమే అన్ని భాషలలోను నేడును ఒక్క రూపముననే, ఒక్క యర్థముననే వాడబడుచున్నది. కొన్ని కొంచెము మాత్రము మారి పూర్వ కాలమున ఈ రూపము లన్నియు ఒక్క దానినుండి ఏర్పడిన వేయని తెలియదగినట్లు కనుపట్టుచుండును. మొదట తెనుగులో నుండిన పదజాలమంతయు నిట్టిదే. నన్నయ తన భారత రచనకు తగిన పదములు తెనుగున లేకుండుటచేత ఆనాటి వాడుక ననుసరించి సంస్కృతపదములనే తెనుగు విభక్తులను చేర్చి సంస్కృతమునందలి యర్థముననే వాడెను. ఏవేని కొన్ని పదములు అర్థమునను, రూపము -