పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/594

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రప్రదేశము - II


కాలము. రాత్రిళ్ళు చలి ఎక్కువగా నున్నను పగలు మాత్రము సమశీతలముగా నుండి హాయిగా నుండును. గోదావరీ మండలములో 86° ఫా. లకును, కృష్ణా మండలములో 93° ఫా. లకును ఉష్ణము మించదు. ఫిబ్రవరి నెలనాటికి క్రమముగా వేడి ఎక్కువగును.

సముద్రమునకు దూరముగా ఖండాంతరమున నుండుటచే దైనిక ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు ఎక్కువగా నుండును. దినములో అధిక అల్పోష్ణోగ్రతల మధ్య వ్యత్యాసము దక్షిణప్రాంతములలో 20°. ఫా. వరకును, ఈశాన్య ప్రాంతములలో 30° ఫా. వరకును ఉండును. తెలంగాణము ఉష్ణమండలములో నుండుటచే సంవత్సరమునకు 8, 9 మాసములు వేడిగానుండును. అందుచే ఈ ప్రాంతమున వాయుమండలము పల్చగానుండి ఒత్తిడి తక్కువగానుండును. శీతకాలములో నీమండలము, ఉత్తర హిందూస్థామునకంటే వెచ్చగా నుండును. అందుచే ఉత్తర హిందూస్థానములో ఎక్కువగాను, తెలంగాణములో అంతకంటె తక్కువగాను 30 అంగుళములవరకును వాయుపీడనము ఉండును. తెలంగాణములో ప్రాంతీయ పీడనము ఆగ్నేయమునుండి ఈశాన్యముదిశలో ఎక్కువగా నుండును. అందుచే గంటకు 5 మైళ్ళలోపు వేగముతో చిన్నగాలులు ఎప్పుడును ఈశాన్యమునుండియు, తూర్చు నుండియు, తెలంగాణపు ఆగ్నేయభాగమునకు వీచును. వర్ష కాలములో నీ పరిస్థితులు తలక్రిందు లగును. ఈ కాలములో గాలులు ఋతుపవనముల ప్రాబల్యమువలన బలముగా వీచును. సామాన్యముగా వీటి వేగము గంటకు 15, 20 మైళ్ళవరకు ఉండును. వేసవిలో అధిక పీడన మండలము అంతముకాగా, అల్పపీడన మండలము ప్రారంభదశలో నుండుటవలన దేశమంతటను వాయుపీడనములో వ్యత్యాసములు చాల తక్కువగా నుండి గాలులు వీచవు.

గోదావరీనదీ ప్రాంతములలో సంవత్సరమునకు 40 అం. కృష్ణానదీ ప్రాంతములలో ముఖ్యముగా మహబూబ్ నగరుజిల్లా పశ్చిమభాగమున, 20 అం. వర్షము పడును. ఎక్కువ వేడిగాను, తేమగాను ఉండుటయు, బంగాళాఖాతమునుండి వచ్చు తుఫానుగాలులు గోదావరి లోయలగుండా నీ ప్రాంతమునకు వ్యాపించుటవలన ఉత్తరమున వర్ష మెక్కువ. 30 అం. కు పైన వర్షము పడు ఉత్తరభాగములను, అంతకంటే తక్కువ వర్షము పడు దక్షిణభాగములను గోలకొండ జలగ్రహ క్షేత్రము (Water shed) వేరుచేయుచున్నది. ఉత్తరమున అధిక వర్షము జులై నెలలోను, దక్షిణమునను, పశ్చిమమున అధిక వర్షము సెప్టెంబరులోను పడును.

శీతోష్ణస్థితులనుబట్టియు, నై సర్గిక స్వరూపమును బట్టియు తెలంగాణమును రెండుగా విడదీయవచ్చునని పైన పేర్కొన్న విషయములవలన విశదమగును. (1) ఉత్తర, ఈశాన్య ప్రాంతములు ముఖ్యముగా గోదావరీనదీ పరిసరములు, (2) దక్షిణ, ఆగ్నేయ ప్రాంతములు ముఖ్యముగా కృష్ణానదీ పరిసరములు.

మొదటి విభాగములో, 40 నుండి 45 అం. వర్షము పడును. ఇక్కడ అడవులు ఎక్కువ. వరి సాగు ఎక్కువగా జరుగును. అడవులు నిర్మూలించబడుటవలనను, వర్షపాత మెక్కువగా నుండుటవలనను ఈ భాగమున నేలలో సారము చాలవరకు క్షీణించినది. ఇక్కడ ఖరీఫ్ పంట ప్రధానమయినది. రెండవ విభాగములో రబ్బీ పంట ప్రధానము.

నల్ల రేగడి నేలలు, ఎర్ర నేలలు, ఇసుక నేలలు, తెలంగాణములో కనుపించు ముఖ్యమయిన నేలలు. హైదరాబాదులో పశ్చిమజిల్లాలనుండి నదులవలన తేబడిన నల్ల రేగడి మట్టి కృష్ణా గోదావరీతీరములందు ఇరుప్రక్కలను కనుపించును. ఈ నేలలు, వృక్షజాలమునకు కావలసిన ఖనిజములను కలిగి ఎక్కువసారవంతమయినవి. ఇంతకంటె తక్కువ సారవంతమయిన నేలలు తెలంగాణము పశ్చిమ సరిహద్దులోను, ఆదిలాబాదు జిల్లా ఉత్తర సరిహద్దులలోను ఉన్నవి. నల్ల రేగడి నేలలు చాల సారవంతమగుటవలన ప్రత్తి, గోధుమ విరివిగా పండును. సాగుచేయుటకు వీలున్నచోట్ల వరి, చెరకుకూడ పండును. మిక్కిలి ఎరుపు నుండి గోధుమరంగువరకు మార్పులు గల ఎర్రనేలలు, మెదక్, నిజామాబాదు జిల్లాలలో కలవు. పండ్లతోటలకు, నూనెగింజలను, అపరాలను పండించుటకు చాల తగినవి. ఆదిలాబాదు జిల్లా దక్షిణ ప్రాంతములోను, నిజామాబాదులో చాల భాగములోను, కరీంనగరు, మెదకు, నల్లగొండ, వరంగల్లు, ఖమ్మం, హైదరాబాదు, మహబూబ్