పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/591

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రప్రదేశము - I


ముగా ఈ డెల్టా ప్రణాళికలు ఫలవంతము అయినవి. ఈ కాలువలలో ప్రయాణసౌకర్యాలు కూడ కలిసివచ్చును. సంవత్సరములో 10 నెలల పాటు వీటిమీద స్వల్ప ధరగల సరకుల రవాణా సాధ్యమగుచున్నది. ఇటువంటి ప్రయాణ ప్రాముఖ్యముగల కాలువలలో బకింగ్ హాంకాలువ ఒకటి చాల ముఖ్యమైనది. దీని మొత్తము పొడవు 258 మైళ్లు. తూర్పు తీరములో రైలుమార్గానికి దగ్గరగా పోవుచుండును. దీనిమీద 134 లక్షల రూపాయలు విలువగల వస్తువులు ప్రయాణము చేయుచున్నవి. ఇవిగాక పశ్చిమాంధ్రములో తుంగభద్రాప్రాజెక్టు చాల ఉపయోగముచేసే ప్రణాళిక. ఇందులో 2,94,000 ఎకరాలు సాగుకావలయును. గోదావరికి కట్టదలచిన రామపాదసాగరము 24 లక్షల ఎకరాలకు నీరు అందించును. నాగార్జునసాగరము అనే నందికొండప్రాజెక్టు మధ్యాంధ్రములోని గుంటూరు, నెల్లూరు, జిల్లాలలో నీటిపారుదలను కలిగించును. ఇవిగాక, పులిచింతల, వంశధార మొదలైన చిన్న చిన్న ప్రణాళికలున్నవి. దక్కను పీఠభూమి అంతటను బావులు, చెరువులు ప్రసిద్ధికెక్కిన వ్యవసాయ కేంద్రాలు.

వ్యవసాయము  : ఆంధ్రదేశములోని 404.9 లక్షల ఎకరాలలో 153.1 లక్షల ఎకరాలు సాగుబడి క్రింద ఉన్నవి. 34.4 లక్షల ఎకరాలు సాగుక్రిందికి రావలసి ఉన్నవి. ఇందులో 45 లక్షల ఎకరాలకు నీటివసతి ఉన్నది. ఆంధ్రదేశములో ఆహారధాన్యాల ఉత్పత్తికి నూటికి 80 వంతులుపైగా భూమిని ఉపయోగించెదరు. అందులో ధాన్యానికి 42,87,146 ఎకరాలు అత్యధిక స్థానమును పొందిఉన్నవి. 1951 లో వ్యవసాయము క్రిందనున్న భూమి ఉత్పత్తి ఈ క్రింది విధముగా ఉన్నది.

Caption text
పంట పేరు ఎకరాలు ఉత్పత్తి(టన్నులు)
1. వరి 42,87,146 27,63,850
2. చోళము 25,76,324 5,22,360
3. వేరుసెనగ 22,85,436 8,58,810
4. కొర్ర 10,23,136 1,30,610
5. కుంబు 8,94,086 2,00,960
6. పప్పుదినుసులు 8,26,752 58,303
7. రాగి 5,92,767 2,31,057
8. ప్రత్తి 5,85,812 72,387
9. ఇతరధాన్యములు 4,40,,200 73,012
10. పొగాకు 3,35,240 1,10,337
11. పెసలు 3,55,546 34,360
12. మిరప కాయలు 2,69,265 1,06,550

వరి చాల ముఖ్యమైన పంట. ఇది కృష్ణా గోదావరి డెల్టాలలో ప్రధానముగా పండింపబడుచున్నది. కాని దేశము అంతటను కొద్దిగానో, గొప్పగానో పండించు చున్నారు. ఎకరమునకు 1800 పౌనుల పంట పండును. వరిగాక సజ్జ, లేక గంటి, చోడి లేక రాగి ముఖ్యమయినవి. ఇవిగాక అరికెలు, సామలు, వరిగెలు, ఉండలు అనే తిండిగింజలు ఉన్నవి. తరువాత పప్పుదినుసులు. ఇందులో కందులు, పెసలు, సెనగలు, మినుములు, జనుములు ఉన్నవి. అనుములు, అలచందలు, మిటికెలు ఈ జాతిలోవే. నూనెగింజలలో వేరుసెనగకు ఎక్కువ స్థానము ఉన్నది. నువ్వులు, అవిసెలు, ప్రత్తిగింజలు నూనెకు మాత్రమేగాకుండ క్రొత్తగా ఏర్పడిన డాల్డా పరిశ్రమకు దోహదము ఇచ్చుచున్నవి. ప్రత్తి పీఠభూమి మీదను, మధ్యాంధ్రములోను వ్యాపించియున్నది. పొగాకు వ్యాపారపు పంటలలో చాల ముఖ్యమయినది. గుంటూరు, కృష్ణా జిల్లాలలో ఇది విశేషముగా పండింపబడి విదేశాలకు ఎగుమతి అగుచుండును. పంచదార, చెరకు ఆంధ్రదేశము అంతటను వ్యాపించియున్నది. చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాలలో దీనికి ప్రత్యేకస్థానము ఉన్నది.

పశుసంపద : ఆంధ్రదేశములో పశుసంపద విస్తారముగా ఉన్నది. ఎద్దులు 25 లక్షలు, ఆవులు 20 లక్షలు, దున్నపోతులు 7 లక్షలు, బర్రెలు 17 లక్షలు, గొర్రెలు 48 లక్షలు, మేకలు 25 లక్షలు ఉన్నవి. మధ్యాంధ్ర దేశములో ఉన్న గడ్డిప్రాంతాలు ఈ పశువుల గ్రాసమునకు అవకాశము ఏర్పాటుచేయబడినది. సరియైన ఆహార పుష్టి లేక పశువులు బలహీనముగా ఉన్నవి. ఒక కోటి పది లక్షల ఎకరాల భూమి పశువులకు గడ్డిభూములుగా ఉన్నవి. ఆంధ్రదేశములో ఒంగోలుజాతి పశువులు ప్రసిద్ధి కెక్కినవి. పాలకు, వ్యవసాయమునకు పేరుపడ్డవి. 2500 పౌనుల పాలు ఇచ్చుచున్నవి. పశువులు ప్రతి వ్యవసాయదారునికి అవసరముగా ఉండుచున్నవి.