ఆంధ్రప్రదేశము - 1
ఆంధ్రప్రదేశము : I ఆంధ్ర : ఆంధ్ర దేశము 14° మొదలు 20° డిగ్రీలు ఉత్తర అక్షాంశములమధ్యను,
77° మొదలు 85° డిగ్రీలు తూర్పు రేఖాంశములమధ్యను వ్యాపించి ఉన్నది. ఇంతకుపూర్వము మదరాసు రాష్ట్రములో ఉండి, 1953 లో ప్రత్యేక ఆంధ్రరాష్ట్రముగా ఏర్పాటు కాబడిన నూతనాంధ్ర దేశము 63,417 చ. మైళ్ల వైశాల్యముతోను, 20,507,801 జనాభాతోను నిండి ఉన్నవి. వైదామ్ కొలత ననుసరించి ఇది మధ్యరకపు వైశాల్యముగల భూభాగము అగును.
ఉనికి, సహజస్థితి, భూ విభాగము : ఆంధ్ర దేశము హిందూస్థానము యొక్క దక్షిణ ప్రాంతము యొక్క మధ్య భాగములో తూర్పుతీరానికి ఆనుకొని ఉన్నది. పశ్చిమాన ఈ భూఖండము దక్కను పీఠభూమిలోనికి చొచ్చుకొని ఉండి, తూర్పు కనుమల నేడు విచ్ఛిన్న పర్వత శ్రేణుల కాలవాలమై ఉన్నది. స్థూలదృష్టిలో ఈ దేశము (i) తీరప్రాంత మైదానము, (ii) తూర్పుకనుమల సమోన్నత మైదానము (iii) దక్కను పీఠభూమికి సంబంధించిన ఉన్నతప్రదేశము అను మూడు ప్రాంతాలుగా ఉన్నప్పటికి భూగోళ శాస్త్రజ్ఞులు వారి దశసూత్ర విభాగము ననుసరించి ఆంధ్రదేశమును ఈ క్రింద నుదహరించిన ఆరు సహజ భౌతిక ప్రాంతాలుగా నిర్ణయించుచున్నారు. (1) కృష్ణా - గోదావరి డెల్టా ప్రాంతము. (2) తీరప్రాంత మైదానము. (3) తూర్పుకనుమల ఉత్తరప్రాంతము. ఇది గోదావరి - వంశధారానదులమధ్య నున్నది. (4) తూర్పు కనుమల - దక్షిణప్రాంతము ఇందులో నల్లమలల నెడు కొండలు - వెలికొండ, పాలకొండ పర్వతాలు ఉన్నవి. (5) పశ్చిమ పీఠభూమి. (6) నూగూరు- భద్రాచల ప్రాంతము అను ఈ ఆరు భాగాలు ఈ రాష్ట్రముయొక్క భౌతికస్థితిని తెలుపుచున్నవి. ఆంధ్రదేశములో కృష్ణా గోదావరీనదులు ప్రజలకు జీవనాధారము లనుటలో నతిశయోక్తి లేదు. వీటి రెంటినీ కలుపుచు కొల్లేరుసరస్సు ఉన్నది, ఈ సరస్సు తమ్మిలేరు మొదలైన జలవాహినుల నుండి జలముస్వీకరించి ఉప్పుటేరుద్వారా సముద్రము లోనికి వ్యాపించి ఉన్నది. ఈ రెండు నదుల యొక్క సంపూర్ణాభివృద్ధి మీదనే ఆంధ్రదేశము యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. తూర్పుకనుమల కొండలు ఎత్తు తక్కువ, మధ్యమధ్య మైదానాలున్నవి. నిమగిరి కొండలు 5,000 అడుగుల ఎత్తువరకు ఉన్నవి. దేవగిరి, మహేంద్రగిరి శిఖరాలు, దక్షిణములో నల్లమల, ఎర్రమల కొండలు, మంటికొండ, భైరవికొండ శిఖరాలు ముఖ్యమైనవి. పీఠభూమి ప్రాంతము సముద్రమునకు 1,500 మొదలు 1800 అడుగులవరకు ఎత్తున ఉన్నది.
వర్షపాతము : శీతోష్ణస్థితి : ఆంధ్రదేశములోని శీతోష్ణస్థితి, వర్షపాతము బంగాళాఖాతములోని ఋతుపవనముల ప్రభావముననుసరించి మారుచుండును. తీరప్రాంతము ఉభయ మాన్ సూనులనుండి వర్షమును పొందుచున్నను, ఎండకాలపు నైరృతి పవనాలనుండి అత్యధిక వర్షమును పొందుచున్నది. డెల్టా ప్రదేశాలయందు వర్షము ఎక్కువ. పశ్చిమానికి వెళ్ళిన కొద్ది వర్షము తగ్గిపోవుచుండును. దక్కను పీఠభూమిలో ఉన్న రాయలసీమ ప్రాంతము పశ్చిమ కనుమల యొక్క వర్షచ్ఛాయలో (Rain shadow) ఉండుటవల్ల క్షామానికి గురి అవుచున్నది. మేనెలలో ఎండకాలము ఉచ్ఛదశ నందుకొనును. డిశంబరులో చలి ముదురును. విశాఖలో 92°, నెల్లూరులో 104.6°, కడపలో 105.9°, గుంటూరులో 115°, విజయవాడలో 120°, భద్రాచలములో 125° వరకు ఉష్ణోగ్రత పోవును. జనవరిలో అల్పఉష్ణము విశాఖలో 68°, నెల్లూరులో 67°, కడపలో 65.2° ఉండును. వరి పండుటకు వీలైన ఉష్ణోగ్రత జూన్, జులై మాసాలలో కోస్తా ప్రాంతము అంతటను ఉండుటవల్ల అచట వరిపంట ఎక్కువగా ఉన్నది. వర్షము దక్షిణములో 35", నైరృతిలో 20" నుండి బయలుదేరి ఉత్తరములో 40" వరకును, ఈశాన్యములో 55" వరకును పెరుగును. నెల్లూరులో నవంబరులో 11-7" లును, కాకినాడలో జులై లో 6.4" లును, అక్టోబరులో 8.6" లును, విశాఖపట్టణములో అక్టోబరులో 8.9" లును వర్షము పడుచున్నది. దక్షిణ పీఠభూమిలో బళ్లారిలో సెప్టెంబరులో 4.8 " లును, కర్నూలులో 6.0" పడుచున్నది. దక్కను పీఠభూమిలో మొత్తముమీద 20″ వర్షముకన్న ఎక్కువ పడదు. దేశములో ఎక్కువభాగములో 25" మొదలు 30" వర్షము పడుటవలన తీరభాగములో పల్లపు వ్యవసాయమును, మధ్యభాగములో మెట్టవ్యవసాయమును ముఖ్య స్థానమును ఆక్రమించియున్నవి.