పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/577

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రదేశపు ఖనిజసంపద - I


వదలి వేయబడుచున్నవి. పలుగు రాతినాళములు అన్ని జిల్లాలలోను గలవు. వీటిని వాడినచో గూడూరు గ్లాసు పింగాణి పరిశ్రమలు పెంపొందగలవు. గ్లాసు కుపయోగించు 10 అడుగుల మందపు తెల్లటి ఇసుక పొర యొకటి గుంటూరుజిల్లాలో చీరాల సమీపమున 3, 8 అడుగుల లోతులో కలదు. ఇది 9 మైళ్ళ పొడవున, 2 ఫర్లాంగుల వెడల్పున వ్యాపించి యున్నది. ఇట్టి పొరలు సముద్ర తీరము పొడవుననున్న ఇసుకలో అనేకచోట్ల బయలుపడు అవకాశము కలదు. గ్లాసు పరిశ్రమలో టన్నుకు పావు టన్ను వాడబడు సోడా, చిత్తూరుజిల్లా కాళహస్తి తాలూకాలోను, కర్నూలుజిల్లాలో ముక్కమళ్ళ, సోమి దేవిపల్లె, కాళినేపల్లె వద్ద, అనంతపురం, గుంటూరు జిల్లాలలో కొన్నిచోట్ల చవుడుగ పొంగుచుండును. కాళహస్తి తాలూకాలో పొంగు సోడాను గాజుల పరిశ్రమలో వినియోగించుచున్నారు. ఈ ప్రాంతాలలో ఏటా ఎంత ఉప్పు లభించునది తెలిసికొనుట యవసరము. పలుగు రాతితో ఉక్కుకొలుములకు లోన పేర్చు ఇటుకలు,ప్రయోగశాలలలో (Laboratories) వాడు పాత్రలను చేయుదురు. దీనిపొడితో మెరుగు కాగితములు చేయుదురు.

గ్రాఫైట్ (Graphite) :- పెన్సిళ్ళ ములికికి, యంత్రములలో కందెనగను వాడెడు గ్రాఫైట్, లేక మెరుగు మట్టి నిధులు శ్రీకాకుళం జిల్లాలో సాలూరు, కేసర, విశాఖపట్టణం జిల్లాలో చర్లోపాలెం, కాశీపురం, తూర్పు గోదావరి జిల్లాలో కొత్తాడ, మరిన్ పాలెం, వెలగలపల్లె, ఊట్ల, కలత నౌరు, వేటకొండ మున్నగుచోట్ల, పశ్చిమ గోదావరి జిల్లాలో రెడ్డిబోదేరువద్ద, భోండలైట్, గ్రానైట్ నైసులలో నాళములుగ నున్నవి. వీటిలో కొన్ని నిధులను అప్పుడప్పుడు పనిచేయుచువచ్చిరి. వీటి అన్నిటికి సమీపముననుండు స్థలములలో ఖనిజమును సం కేంద్రించు సాధనము లేర్పరచి, గ్రాఫైట్ మూసలు మున్నగునవి చేయ పూనుకోవచ్చును.

బొగ్గు (Coal) :- గోదావరిలోయలో లింగాల, గవిరి దేవిపేట, బెడదనూరు, జంగారెడ్డిగూడెం ప్రాంతమున బోరింగులవలన గోండ్వన రాళ్ళల్లో పలుచని బొగ్గుపొరలు కొన్నిచోట్ల కని పెట్టబడినవి. కాని ఇచ్చట ఎంతబొగ్గున్నది నిరూపింపబడలేదు.' కృష్ణాజిల్లాలో కోనవద్ద ఒక ఊబ స్థలమునుండియు, గోదావరి డెల్టాలో అమలాపురం, జగ్గన్న పేట, కవితం, ర్యాలి మున్నగుచోట్లను, తాటిపాకవద్ద బావికై వేసిన ఒక 70 అడుగుల బోరింగు నుండియు, మీథేన్ (Methane) అను బొగ్గువాయువు వెడలుచున్నది. గోదావరిలోయలో 2 వేల అడుగుల బోరింగులతో బొగ్గుకై శోధించి, విరివిగా నున్నట్లు నిరూపించగలిగిన, అది పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడును.

బంగారము (Gold) :- బంగారు గనులు అనంతపురం జిల్లాలో రామగిరి, రామాపురం, వెంకటాంపల్లె, చిత్తూరు జిల్లా కంగుండి తాలూకాలో చిన్నపర్తికుంట, బిసనత్తమునొద్ద ధార్వాడ సంహతికి చెందిన క్లోరెట్ (Chlorite) హాన్ బ్లైండ్ విభాజీయ శిలలలో కలవు. బిసనత్తం, చిన్నపకుంటవద్ద కొన్ని రాళ్ళలో బంగారము చిన్నటన్నుకు (2,000 పౌనులు) సుమారు 4 పెన్ని వెయిట్లు (dwt), అనగా 8/15 తులం (16 చిన్నాలు, లేక 21⅛ నాల్లు) కలదు. ఈ ప్రాంతములు శ్రద్ధతో పరీక్షింపదగినవి. రాళ్ళశైథిల్యమువలన బంగారు రేణువులు విడివడి, తుంగభద్రా కృష్ణా నీటి ఉరవడిలో కొట్టుకొని వచ్చి, కొన్నిచోట్ల ఒండ్రులో నిమిడియున్నవి. ఈ ఒండ్రులో మనగజముకు 3 గ్రెయిన్లు అనగా అరచిన్నము లేక ⅔వాల్, బంగారమున్నచో, దీనిని లాభకరముగ తీయవచ్చును.

వజ్రములు (Diamonds):- ఆరవ శతాబ్దమునుండియు ఆంధ్రప్రదేశమునకు రత్నగర్భయని పేరు. ప్రపంచము లోని గొప్ప వజ్రములు ఎక్కువగ ఇచ్చట లభించినవే. కోహినూర్, హోప్ వజ్రములు దొరికిన కొల్లూరుగనుల వద్ద 1652 లో 60 వేలమంది పనిచేయుచుండిరట. పిట్ లేక రీజంటు వజ్రము పరిటాల గనులలో దొరికినది. గ్రానైట్ నైన్ ప్రాంతమగు అనంతపురం జిల్లా గుత్తి తాలూకా, కర్నూలుజిల్లా పత్తికొండ తాలూకాలో, వజ్రకరూరు, కొంగనపల్లె మున్నగుచోట్లను, కర్నూలు జిల్లాలో ముఖ్యముగ బంగనిపల్లె, రామల్లకోట, రామవరం పల్లెలు, గుంటూరుజిల్లాలో మల్లవరంవద్ద నున్న బంగనపల్లె గుండ్లపొర (conglomerate) లోను, కుందు, పెన్న, హింద్రి, తుంగభద్ర, కృష్ణానదులు గుండ్ల పొరలలో ననేకచోట్లను, వజ్రపుగను లున్నవి. భద్రాచలము