పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/575

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రదేశపు ఖనిజసంపద _ I


లోయలోను, సిమెంటు కుపయోగపడు సున్నపురాళ్ళు చాల గలవు. గుంటూరు జిల్లాలో మంగళగిరి మున్నగు చోట్ల త్రవ్వు కంకర సిమెంటు పరిశ్రమలో వాడబడు చున్నది. వీటి నాధారము చేసికొని ఆంధ్రలో సిమెంటు పరిశ్రమ ఎక్కువగా అభివృద్ధి కాగలదు. ఈ పరిశ్రమలో టన్నుకు 0.42 టన్నులు కావలసిన బొగ్గు సింగరేణి నుండిగాని, తూర్పు రాష్ట్రముల బొగ్గుగనుల నుండిగాని తెప్పించుకోవలసి వచ్చును.

సీమెంటులో 4 శాతముగల హరణోఠము (Gypsum) నెల్లూరు జిల్లాలో సుళ్ళూరుపేట వద్ద పులికాటు సరస్సు నానుకొని నూరుమైళ్ళ వైశాల్యముగల పల్లపు భూమిలో చాలమేరగలదు. ఇచ్చట దీనికై శోధించబడిన 20 చదరపు మైళ్ళలో ప్రతి అడుగు లోతునకు 10 వేల టన్నులు గలదని లెక్క వేయబడినది.

52 శాతముకన్న ఎక్కువ సున్నము ఉన్న గుల్లరాయి (Calcareous Tufa) అనంతపురం జిల్లాలో కోన రామేశ్వరస్వామి వద్ద 3 లక్షల టన్నులు, మెత్తని పొడి కర్నూలుజిల్లా బంగనపల్లె తాలూకాలో నందవరం, వల్కూరు, రామతీర్థం వద్ద 8.8 లక్షల టన్నులు కలదు. ఇది గ్లాసు, పింగాణి, ఖటికము (Calcium) రసాయన పరిశ్రమలలోను, ఇనుప కొలుములలో ధాతువును కరగించుటకును ఉపయోగపడును.

రాతినార (Asbestos) :- రాతీవారలో కైజొటైల్ (Chrysotile) అను మృదువగు రకము, ట్రిమొలైట్ (Tremolite) అను బిరుసగు రకమును గలవు. వీనిలో విద్యుత్తు, వేడి ప్రసరింపవు గనుకను, దీనిపై ఆమ్లములు పనిచేయవు గనుకను, క్రై జొటైల్ నిప్పు అంటనిబట్టలకు, ట్రిమొలైట్ నిప్పు అంటని రంగులు, సిమెంటు రేకులు, 'స్విచ్ బోర్డులు మున్నగువాటికి వాడబడు చున్నవి. ఆంధ్రలో క్రై జొటైల్ నిధులు మాత్రమే ఇంతవరకు కనుగొన బడినవి. ఇవి కడపజిల్లా పులివెందల తాలూకాలో లింగాలనుంచి బ్రాహ్మణపల్లె వరకున్న 7 మైళ్ళలో, చిన్నకుడాల, బ్రాహ్మణపల్లె పరిసరాలలోనే కనీసము 2,56,000 టన్నులు, కమలాపురం తాలూకాలో రాజుపాలెం వద్దను, కలవు. ఇవి వేంపల్లె సున్నపు రాళ్ళలో ట్రావ్ పొరల నానుకొని 7 అంగుళముల లోపు మందముగల నాళములుగ నేర్పడియున్నవి. నార నాళముల కడ్డముగ 0.3 అంగుళములోపు పొడవుగ నుండును. ఈనారనుండి బట్టలనేత పరిశోధించ దగినది' ఇది ఎక్కువభాగము ప్రాంతీయ సిమెంటు రంగు పరిశ్రమలలో నుపయోగపడగలదు.

ముగ్గురాయి (Barytes) :- మన దేశములో కెల్ల పెద్ద ముగ్గురాతి నిధులు అనంతపురం జిల్లాలో కొండపల్లె, నెరిజాముపల్లె, ముత్సుకోట, కడపజిల్లా పులివెందల తాలూకాలో కొత్తపల్లె, తాళ్ళపల్లె, నందిపల్లె, వేముల, కర్నూలు జిల్లా ద్రోణాచలం తాలూకాలో ఎర్రగుంట్ల, గట్టిమానికొండ, బలపాలపల్లె, బుక్కాపురం- బోయన పల్లె, రహిమాన్ పురం, రామాపురం, వలసల, హుస్సేన్ పురంవద్ద వేంపల్లె సున్నపురాళ్ళలోను, వాటిలో చొచ్చిన ట్రావ్ పొరలలోను, అడ్డదిడ్డముగ వ్యాపించిన నాళములుగ, పలుగురాతిలోకూడి పెద్ద నెర్రెలను (Fissures) నింపుచును ఉన్నవి. కొన్ని నిధులు 30 అడుగులు వరకు వెడల్పుండినను, నాళములు 7 అడుగుల మందము మించవు. వీటి వెడల్పు కొద్ది దూరములోనే హెచ్చు తగ్గులగుచు, ఇవి అంతమగుచుండును. ఇక్కడ లభించు ముగ్గురాయి 90 పాళ్లు లేత ఎరుపు వన్నెగలిగి యుండును. తెల్లని ముగ్గురాయి రంగులకును, వన్నె గలది నూనె (Petroleum) బావులలోను విరివిగా వాడ బడుచున్నది. మంచు తెలుపు ముగ్గురాయి బేరియం (Barium) రసాయనముల కుపయోగపడును, ఆంధ్రలో ముగ్గురాయి రంగు, బేరియం రసాయన పరిశ్రమలను పోషించగలదు.

ఖనిజరంగులు (Ochres) :- ఎర్రసుద్ద (Red Ochre) నిధులు తెల్లసుద్ద, పచ్చసుద్ధ (Yellow Ochre) లో గూడి కడపజిల్లాలో నందలూరు, కర్నూలు జిల్లాలో బేతంచర్ల వద్ద సుద్దరాళ్ళలో కలవు. ఎఱ్ఱసుద్ధ విశాఖపట్టణం జిల్లాలో అరకులోయలోను, గోదావరిజిల్లాలో కొవ్వూరు, రాజమహేంద్రవరం ప్రాంతమునకూడదొరకును. మెత్తని ఎర్రలోహా మ్లజనిదము (RedOxide) కడపజిల్లాలో చాబలి వద్ద, కర్నూలు జిల్లాలో రామల్లకోట, వెల్దుర్తి ప్రాంతములోను ఇనుపరాళ్ళతో కూడియున్నది. పచ్చ సుద్ధ నిధులు కర్నూలుజిల్లాలో ఉయ్యాలవాడ వద్ద 3¾ లక్షల టన్నులు