ఆంధ్రదేశ చరిత్రము - V
అందులో కొన్ని జిల్లాలను ప్రక్క రాజధానిలో చేర్చుట కాని చేయుచుండిరేగాని ప్రజల సౌకర్యములు నాలోచించి ఈ
రాజ్యభాగముల నన్నిటిని పునర్నిర్మాణము గావించుట అవసరమని ఇంగ్లీషువారు తలచలేదు. రాజ్యాంగసంస్కరణములు జరిగినప్పుడు ప్రజలు ఆంగ్లేయాధి కారులకు తమ కోర్కెలనుగూర్చి చెప్పికొనిరి గాని రాష్ట్రముల పునర్నిర్మాణ సమస్య పరిష్కరింపబడలేదు. భారతీయులు స్వాతంత్య్రముకొరకు ఆంగ్లేయులతో పెనుగులాడుచున్న కాలమున భారతదేశములోని వివిధ ప్రాంతములందు నివసించుచు ఒకేభాష, ఒకేసంస్కృతి, ఒకేచరిత్ర కలిగియున్న ప్రజలను ఏకముచేసి వారి కొక ప్రత్యే రాష్ట్రకము నిర్మించవలెనను ఆశయమును ప్రచారము చేసిన యెడల వారిలో జాతీయభావము వర్థిల్లి విజాతీయ ప్రభువులను ప్రతిఘటించుటకు తోడ్పడగలదను నుద్దేశముతో మన జాతీయనాయకులు భాషాప్రయుక్త రాష్ట్ర నిర్మాణమును
గూర్చిన ఉద్యమము లేవదీసియుండిరి. ఆంధ్రోద్యమము వలన దేశాభిమానము వర్థిల్లి ఇంగ్లీషు ప్రభువులతో పోరాడుపట్ల ఆంధ్రులు గొప్ప ధైర్యసాహసములు పట్టుదల చూపినసంగతి జగద్విదితము. భారతదేశమునకు స్వాతంత్య్రము లభించిన పిమ్మట వివిధ రాష్ట్రములలోని ప్రజల క్షేమమేగాక, యావద్భారత దేశము యొక్క క్షేమ లాభములనుగూర్చియు జాతీయైక్యత నుగూర్చియు భారతదేశమునకు ప్రపంచ రాజ్యములం దుండవలసిన గౌరవ ప్రతిపత్తులను గూర్చియు ముఖ్యముగా ఆలోచించవలసిన అవసరము కలిగెను. వివిధ సంస్థానములు స్వతంత్ర భారతదేశములో లీనమైనందున భారతఖండాంతర్గతము లయిన వివిధ రాజ్యభాగములలోను, రాజధానులలోను, పరగణాలలోను వసించు ప్రజల క్షేమలాభములను, కష్టసుఖములను ఆలోచించి భారత రాజ్యభాగములను పునర్నిర్మాణము గావింపవలసిన అవసరము కలిగెను. పై సంగతు లన్నియు ఆలోచించియే కేవలము భాషాప్రయుక్త రాష్ట్రముల నిర్మాణముచేయుట మంచిది
కాదని థార్ కమీషను వారు అభిప్రాయపడిరి, భారత జాతీయ నాయకులలో చాలమంది కిట్లే తోచెను. ఆంధ్రరాష్ట్రము ప్రత్యేక కారణములవలన నిర్మాణముగావింప బడినదనియు, ఇకముందు కేవలము భాషాప్రయుక్త రాష్ట్రనిర్మాణము చేయుట పొసగదనియు భారత ప్రభుత్వమువారు ప్రకటించిరి. భారత రాజ్యాంగసమితిలోని ప్రజల క్షేమలాభములను, భారతజాతియొక్క సమష్టి క్షేమలాభములకు తోడ్పడగలందులకుగాను భారతదేశములోని వివిధ రాజ్యభాగములను పున
ర్నిర్మాణము చేయు విషయమునుగూర్చి నిష్పక్షపాత బుద్ధితోను, వాస్తవికదృష్టితోను పరిశీలించుటకు ఒక విచారణ సంఘమును భారతదేశ ప్రభుత్వమువారు నియమించదలచినట్లు 1953 డిశంబరు 22 వ తేదీన మన ప్రధానమంత్రి శ్రీ నెహ్రూగారు పార్ల మెంటులో చెప్పిరి. ఈ రాష్ట్రముల పునర్నిర్మాణ సమస్య యొక్క పరిస్థితులను దీనికి పునాదియైన దేశ చరిత్రను, ప్రస్తుత పరిస్థితులను దానికి సన్నిహిత సంబంధముగల అన్ని ముఖ్య విషయములను ఈ సంఘమువారు విచారించెదరనియు, ఈ పునర్నిర్మాణమును గూర్చి ఎవరే సూచనను గావించినను, దానిని విమర్శించెదరనియు రాష్ట్రముల పునర్నిర్మాణము చేయవలసిన విధానములను గూర్చిన నివేదికలను విచారణ సంఘముల వారు ప్రభుత్వము వారి ఆలోచన కొరకు పంపుదురనియు భారత ప్రభుత్వము వారు డిశంబరు 29 వ తేదీన తీర్మానించిరి.
విచారణసంఘమువారు ఫజుల్ ఆలీగారి నాయకత్వమున ఈ సమస్యను గూర్చి విచారణచేసి తమ నివేదికను 1955 సెప్టెంబరు 30 తేదీన భారతప్రభుత్వము వారి కంద జేసిరి. ఇది దేశమునందలి అన్ని పత్రిక లలోను ప్రకటింపబడి ప్రజలచేతను, రాష్ట్ర శాసనసభ్యుల చేతను చర్చింపబడెను. ప్రజాభిప్రాయమును జాగ్రత్తగా కనుగొని భారత దేశ ప్రభుత్వము వారు రాష్ట్రముల పునర్నిర్మాణము చేయుటకు ఒక చట్టము తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వముల అభిప్రాయములనుగూడ మరల సేకరించి దానిని పార్లమెంటులో ప్రవేశపెట్టి తీర్మానించినారు. ఆ చట్టము ప్రకారము భారతదేశములోని ప్రస్తుత రాజ్యభాగములు 1956 నవంబరు 1వ తేదీన పునర్నిర్మాణము గావింపబడెను. ప్రభుత్వమువారు రాజ్యాంగ పునర్నిర్మాణము బిల్లులో సూచించిన ప్రకారము హైద్రాబాదు రాష్ట్రము విచ్ఛిన్నముచేయబడెను, అందలి కన్నడ మహారాష్ట్ర భాగములు నూతన కర్ణాటక, మహారాష్ట్రములతో