ఆంధ్రదేశ చరిత్రము - V
కను సమర్పించి నిర్వివాద ప్రాంతములతో ఆంధ్రరాష్ట్రమును నిర్మింపుడని గోరిరి. అయితే శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులుగారు మద్రాసునగర నిర్మాణాభి వృద్ధులయందు తెలుగువారి ధనమెంతో వినియోగింపబడినందున ఆంధ్రరాష్ట్రమును విడదీయుటలో మద్రాసు నగరము విషయమునను, అందులో విలువగల ఆస్తి విషయమునను ఇంకనేక విషయములందును తెలుగు వారికి కొన్నికోట్ల రూపాయలు నష్టపరిహారము రావలసియుండుననియు, అది నిర్ణయించనిది ఆంధ్రరాష్ట్రమును నిర్మింప వీలులేదనియు పట్టుబట్టిరి. ఇది న్యాయమేనని ఆంధ్రుల కందరకు తోచినందువలన ఈ విషయమున గొప్ప ఆందోళనము బయలుదేరెను. ఆంధ్రరాష్ట్రము యొక్క ముఖ్యపట్టణము ఎక్కడ నుండవలెనను విషయమున గూడ తెలుగువారిలో అభిప్రాయ భేదములు కలిగెను. ఈ విషయములను గూర్చిన వాదోపవాదములు తీవ్రముగా చెలరేగెను. ఇట్టి పరిస్థితులలో భారత ప్రభుత్వమువారు ప్రస్తుతము ఆంధ్రరాష్ట్ర నిర్మాణమును నిలుపుదల చేసినట్లు 1950 వ సంవత్సరము జనవరి 18 వ తేదీన ప్రకటించిరి. ఇట్టి పరిస్థితులలో శ్రీ పొట్టి శ్రీరాములుగారు మద్రాసుతోకలిపి ఆంధ్ర రాష్ట్రనిర్మాణము కావింపవ లెనని పట్టుబట్టి ప్రాయోపవేశమును జేసిరి.
ఆయనకు ప్రాణాపాయస్థితి కలిగెను. 1952 డిసెంబరు 9 వ తేదీన మద్రాసు నగరమును మినహాయించి ఆంధ్ర రాష్ట్ర నిర్మాణము చేయుటకు అభ్యంతరము లేదని శ్రీ నెహ్రూగారు ప్రకటించియుండిరి. ఐనను శ్రీరాములు గారు తమ దీక్ష వదలక ప్రాణముల బాసిరి. దేశములో అశాంతి కలిగెను. అంతట డిశంబరు 19 వ తేదీన శ్రీ నెహ్రూగారు ఢిల్లీ లోకసభలో మద్రాసు నగరము గాక చెన్న రాష్ట్రములోని ప్రస్తుతపు తెలుగు ప్రాంతములను కలిపి ఆంధ్రరాష్ట్రముగా నిర్మించుటకు భారతదేశ ప్రభుత్వమువారు నిశ్చయించినారనియు దానినిగూర్చి అవసరమైన చర్యలు తీసికొనబడుచున్న వనియు తెలిపిరి. నూతన రాష్ట్ర నిర్మాణము చేయుటలో పరిష్కరింప వలసిన ఆర్థిక సమస్యలు మొదలైన వానిని విచారించుటకు రాజస్థాన ప్రధాన న్యాయమూర్తియగు వాంఛూ గారిని నియమించినట్లు నెహ్రూగారు ప్రకటనము చేసిరి.
అటుతరువాత ఆంధ్రరాష్ట్ర ముఖ్యపట్టణమును కర్నూలులో నెలకొల్పవలెననియు, హైకోర్టు గుంటూరులో నెలకొల్ప వలెననియు మద్రాసు శాసనసభలోని తెలుగు సభ్యులు నిర్ణయించిరి. దీని ఫలితముగా 1953 ఆక్టోబరు 1వ తేదీన ఆంధ్రరాష్ట్రము నిర్మింపబడి దానికి కర్నూలు ముఖ్యపట్టణ మయ్యెను. ఈ క్రొత్తరాష్ట్రమునకు మొదటి గవర్నరుగా శ్రీ సి. యమ్. త్రివేదిగారిని నియమించిరి. భారత దేశ స్వారాజ్యోద్యమమునందు తన సర్వస్వమును ధారపోసిన మహా త్యాగియు, దేశభక్తుడును కర్మవీరుడును, కార్యశూరుడును అగు శ్రీ టంగుటూరి ప్రకాశము పంతులుగారినే ఆంధ్ర రాష్ట్రమునకు మొదటి ముఖ్యమంత్రిగ నెన్ను కొనిరి. ఆయన ఒక సంవత్సరము పాటు ఆ పదవిలో నుండి నూతన ఆంధ్రరాష్ట్రమును సుస్థిరముగ జేసెను.
ఆంధ్రరాష్ట్ర నిర్మాణము రాష్ట్రముల పునర్విచారణ సమస్యను భాషాప్రయుక్తరాష్ట్ర నిర్మాణ సమస్యను పునరుజ్జీవింప జేసెను. భారత దేశములోని ఇంగ్లీషు వారి పరిపాలనముక్రింద నుండిన వివిధ రాజ్య భాగము లొక్కసారిగా నేర్పడినవి కావు. ఆయా ప్రాంతములు ఇంగ్లీషు వారి వశమైనప్పుడెల్ల అందు తమ పరిపాలనము నేర్పర్చుచు తరువాత వాని పరిసరప్రాంతములు తమ వశమైనప్పుడు పూర్వపు రాజ్యభాగముతో గలుపుచుండుటవలన ఒకే జాతి మతధర్మములు గలిగి ఒకే భాష మాట్లాడు వారిలో కొందరు ఒక పరగణాలోను, మరికొందరింకొక పరగణాలోను చేర్చబడుట తటస్థించెను. ఇట్లే కొందరు ఇంగ్లీషువారు స్వయముగా పరిపాలించు రాజ్య భాగములందును, మరికొంద రింగ్లీషువారికి సామంతులయిన స్వదేశ సంస్థానాధీశులు పరిపాలించు రాజ్య భాగములందును చేర్చబడిరి. ఇంగ్లీషువారు కేవలము పరిపాలనా సౌకర్యముల నాలోచించి వివిధ రాజధానుల నేర్పరచిరే కాని దేశములోని నైసర్గిక పరిస్థితులనుగాని, ప్రజల సంస్కృతిని గాని, వారు మాటలాడు భాషలుగాని ఆలోచించి అట్లు చేయలేదు. ఇట్లు అరవ, కన్నడ, మలయాళీ భాషల వారిని, తెలుగువారిని కలిపి చెన్న రాజధానిలో కలిపి పరిపాలించుచుండిరి. రాజధానులు పెద్దవైనప్పుడు వాటిని రెండుగ విభజించుట గాని