పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/549

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రదేశ చరిత్రము . IV


ఆంధ్రదేశ చరిత్రము IV (1675 - 1900):- క్రీ. శ. 1675 నాటికి భారతదేశము నేలు మొగలాయి చక్రవర్తి అలంఘీరు పాదుషా లేక ఔరంగజేబు మిగుల బలవంతుడై దక్షిణాపథమునంతయు తన సామ్రాజ్యమున కలుపుకొన జూచుచుండెను. అప్పటికి గోదావరికి దక్షిణమున తూర్పు సముద్రతీరమువరకు గల విశాల దేశమును గోలకొండ సుల్తానుల పరిపాలించుచుండిరి. వీరి రాజప్రతినిధి శ్రీకాకుళము (చిక్కాకోలు)లో నుండెను. వీరి సేనాధిపతులు మద్రాసు చుట్టుపట్ల కర్ణాటకమని పిరువబడు దక్షిణమండలములనుగూడ క్రీ. శ. 1647 లో జయించి నప్పటినుండియు అక్కడి రాజులు, నాయకులు, పాళెగార్లు గోలకొండకు లోబడిరి. చెన్నపట్టణములో నొకకోట కట్టుకొని వ్యాపారము చేయుచున్న ఇంగ్లీషు వర్తక కంపెనీవారుకూడ గోలకొండ సుల్తానునకు కప్పముగట్టిరి. అనంతపుర మండలమును హండేరాజులు పరిపాలించు చుండిరి. కడప, కర్నూలు మండలములను నవాబులు పరిపాలించుచుండిరి. వీరందరును గోలకొండ రాజ్యమునకు సామంతులుగనే ఉండిరి.

క్రీ.శ. 1674 లో శివాజీ మహారాజు స్వతంత్ర మహారాష్ట్ర రాజ్యమును స్థాపనచేసి రాయగడ దుర్గమున పట్టాభి షిక్తుడై ఒక వంక బిజాపుర సుల్తాను రాజ్యమునకును ఇంకొకవంక మొగలాయి సామ్రాజ్యమునకును ప్రక్కలోని బల్లెమై విజృంభించెను.

క్రీ.శ. 1676 లో శివాజీ గోలకొండ సుల్తానుతో సంధిచేసికొని సైన్యములతో బయలు దేరి దక్షిణమున బిజాపురము వారి క్రింద జింజి మొదలగు జాగీరుల నేలుచున్న తన సవతితమ్ముడైన ఏకోజీ లేక వెంకోజీని ఓడించి అక్కడి దుర్గములను పట్టుకొని, బళ్ళారిని, కడపను కొల్లగొని, మొగలాయి సామ్రాజ్యము వారి ఒత్తిడిలేకుండ చేసెదనని, బిజాపురపు సుల్తానుతో నొక సంధిచేసికొనుటతో ఆతని రాజ్యము ఎక్కువగా బలవంత మయ్యెను. తన తండ్రి షాజహాను కాలముననే మొగలు సామ్రాజ్యమునకు లోబడి కప్పముగట్టుటకు అంగీకరించిన బిజాపూరు గోలకొండ సుల్తానులిట్లు శీవాజీతో కుట్రలు చేయుచుండుటవలన ఔరంగజేబున కాగ్రహము కలిగినను, ఆ సమయమున అతడు ఉత్తర భారతదేశమున ఆఫ్గన్

కొండజాతులను అణచుటలో నిమగ్నుడై యున్నందున దక్షిణాపథమువైపు తనదృష్టి నిమరల్పకపోయెను. శివాజీ క్రీ. శ. 1680 లో మరణించెను, ఔరంగజేబు దక్షిణాపథమునకువచ్చి అహమదు నగరమున విడిసి, క్రీ.శ. 1685 లో తన కొమారుని గోలకొండపైకి పంపగా వారొక తాత్కాలికసంధి చేసికొనిరి. ఔరంగ జేబు క్రీ. శ. 1686 లో బిజాపుర సుల్తానును, 1687 లో గోలకొండ సుల్తానును ఓడించెను. ఈ రెండు రాజ్యములు మొగలాయి రాజ్యములో కలిసిపోయినవి. అంతట ఔరంగ జేబు కృష్ణానదికి దక్షిణమునగల దేశమును గూడ జయించి తన రాజ్యమున జేర్చెను. ఆయన సేనాధిపతియగు గయాజుద్దీను కర్నూలును పట్టుకొనెను. బళ్ళారి, కడప మండలముల నేలు నవాబు, చక్రవర్తికి లోబడెను. కర్ణాటక ప్రాంతమంతయు మొగలాయి సామ్రాజ్యమున గలిసెను. ఈ దక్షిణ రాజ్యము నేలుటకు ఔరంగజేబు గయాజుద్దీను నే సుబేదారుగ నియమించెను. అప్పుడు దక్కను సుబేదారు క్రింద 22 పరగణాలుండెను. అందులో గోలకొండ ఒక రాష్ట్రము.

మొగలాయి సుబేదారుని ఫౌజుదారులను సేనాధివతులే వివిధ ప్రాంతములకు పరిపాలకులైరి, అయితే పూర్వము గోలకొండ సుల్తానుల క్రింద శిస్తులు వసూళ్ళు చేయుటకు గుత్తలు తీసికొనిన ప్రాతజమీందారులు శిస్తులియ్యక పేచీలు పెట్టుచున్నందున దేశములో కొన్ని చిల్లర యుద్ధములు చేయవలసి వచ్చుచుండెను.

ఔరంగజేబు చక్రవర్తి క్రీ. శ. 1707 లో చనిపోయెను. ఆయన కుమాళ్ళును మనుమలును అతని సింహాసనము నాక్రమించుటకు తగవులాడుకొన సాగిరి వివిధ ప్రాంతముల నేలు సుబేదారులును, సేనాధిపతులును బలవంతులై స్వతంత్రులు కాజొచ్చిరి.

క్రీ. శ. 1713 లో చక్రవర్తియైన ఫరుక్ షయ్యరు, మీర్ కమరుద్దీను ఆసఫ్ జా అను నొక మహమ్మదీయ ప్రభువునకు నిజాం ఉల్ ముల్కు అను బిరుదమునిచ్చి అతనిని దక్కను సుబేదారునిగ జేసెను. తరువాత నితడు మహమ్మదుషా చక్రవర్తి ఢిల్లీ దర్బారులో వజీరయ్యెను. కాని అక్కడి కుట్రలుచూచి క్రీ. శ. 1724 లో దక్షిణము