పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/537

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రదేశ చరిత్రము - III


సింహరాయలు చంపబడగా, తుళువ వీరనరసింహరాయలు (క్రీ. శ. 1505-1509) తుళువ వంశపు రాజయ్యెను. ఇతని పరిపాలన కాలమంతయు యుద్ధములతో గడచెను. ఆరవీటి రామరాయలు, పుత్రుడు తిమ్మరాయల రాజు సేవ వలన యూసఫ్ ఆదిల్ ఖాను తుంగభద్రానది దక్షిణతీరమును వశముచేసికొన ప్రయత్నించి విఫలు డయ్యెను. వీరనర సింహరాయలు పశ్చిమతీరమున స్థిరపడుచున్న పోర్చుగీసు వారితో మైత్రి నెరపి, తన సైన్యశిక్షణమునకు అల్ మైడా సహాయముకోరెను. క్రీ.శ. 1509 లో ఇతని మరణానంతరము శ్రీకృష్ణరాయలు సింహాసన మారోహించెను.

శ్రీకృష్ణదేవరాయలు (క్రీ. శ. 1509-29) రాజ్యమునకు వచ్చుసరికి అతని వయస్సు 25 సంవత్సరములు. అతడు సాటిలేని సకల కళాసమ్రాట్టు, అసమాన చక్రవర్తియు, అపజయ మెరుగని నిష్కళంక జీవియు నయిన శ్రీకృష్ణరాయల యశస్సువలననే విజయనగర నామథేయము శాశ్వతమయినదనుట నిక్కు వము. విదేశీయులు ఇతనినిగూర్చి ఎంతో సహజముగ వర్ణించి యున్నారు. ప్రజారంజకుడయిన శ్రీకృష్ణదేవరాయలు చక్కని శరీరదార్ధ్యము గలిగియుండెను. అతడు నిరుపమాన ధైర్యస్థైర్యములు గలవాడు. సైనికులచే ప్రేమింపబడినవాడు,

కృష్ణరాయలు తురుష్కులకు చక్కని పాఠము నేర్పెను. ఏపేట జరుపు దండయాత్రలు చాలించి ముస్లిములు బీదరుకు పారిపోయిరి. రాయలు ఆనతితో ఆల్బె క్వెర్క్, భట్క్ ల్ యొద్ద కోటగట్టించెను. గుల్ బర్గా పై దండెత్తి రాయలు మహమ్మదు II బహమనీ ఖైదునుండి విడిపించి, యవన రాజ్య స్థాపనాచార్య అను బిరుదందెను. (క్రీ. శ. 1511). పెనుగొండను, ఉమ్మత్తూరును శివసముద్రమును గెల్చి, జయింపబడిన రాజ్యభాగములకు సాళువగోవిందరాయలను రాజప్రతినిధిగ నిల్పెను. కొండవీడు, విజయవాడ, కొండపల్లి దుర్గములను గెలిచెను.కళింగములో పొట్నూరు సింహాద్రి వరకు జయించి, అచట జయ స్తంభమును నిలిపెను. సైన్యములు కటకము వరకు వెళ్ళగా, తాను రాజమహేంద్రవరము నకు తిరిగివచ్చెను. ప్రతాపరుద్ర గజపతి రాయలతో సంధి నెరపి కూతు నిచ్చి పెండ్లిచేసెను. రాయలు తాను గెల్చిన కృష్ణకు పడమటి దేశమును కనికరముతో గజపతి కిచ్చి వేసెను. పోర్చుగీసుల సాయముతో రాయలు క్రీ. శ. 1520 లొ రాయచూరు నాక్రమించి తురుష్కుల నోడించెను. క్రీ. శ. 1523 లో బీజపూరుపై దండెత్తి గుల్బర్గాను ముట్టడించెను. ఈ విజయ పరంపరల అనంతరము శ్రీకృష్ణ దేవరాయలు క్రీ. శ.1528 లొ తన ఆరేండ్ల కుమారుని రాజు చేసెను. మంత్రి తిమ్మరుసు బాలుని చంపించెనని అనుమానించి, రాయలు మంత్రిని ఆతని కుటుంబమును కారాగారమున నుంచెను. క్రీ.శ. 1529 లో తమ్ముడు అచ్యుతదేవరాయలకు రాజ్యము నొసంగి, కృష్ణరాయలు వార్థక్యము రాకముందే దివి కేగెను. దక్షిణావని నంతయు నొక్కటిగ పాలించిన ఈ విజయశాలి యొక్క రాజనీతిజ్ఞత స్వరచితమైన ఆముక్త మాల్యదలో రూపొందినది. కృతికర్తయు, కృతిభర్తయు నయిన కృష్ణదేవరాయలు కళలకు పట్టుగొమ్మ; కల్పవృక్షము. ఆంధ్రభోజుడు. ఈ రాజాధిరాజు ప్రపంచ మందంతటను గౌరవింపబడియున్నాడు. సార్వభౌముని యశశ్చంద్రికలు శాశ్వతముగ విశ్వమంతట నల్లుకొనినవి.

అచ్యుతదేవరాయలు (క్రీ. శ. 1530-42) కృష్ణరాయలకు సవతి తమ్ముడు. ఇతడు కృష్ణరాయలు మరణించినపుడు చంద్రగిరిలో నుండెను. కృష్ణరాయల అల్లుడు రామరాయలు అచ్యుత రాయలకు పోటీగ, కృష్ణరాయల 1½ సం. ల మగశిశువును రాజుగ ప్రకటించి అచ్యుతరాయలు రాజధాని చేరులోపల చంద్రగిరిలో తిరుపతిలో పట్టాభిషేకము చేసికొనెను. కృష్ణరాయల మృతివార్త వినగనే ఇస్మెల్ ఆదిల్ షా రాయచూరు లోయను ఆక్రమించెను. అచ్యుతరాయలు రాజధానికి చేరినతోడనే రామరాయలతో సంధి చేసికొనెను. ఆ పసి బాలుడు మృతుడయ్యెను. అచ్యుత రాయలు గజపతి దండయాత్ర నరికట్టెను. దక్షిణదేశమున సామంతుల తిరుగుబాటులు నణచి, అచ్యుతరాయలు పాండ్యరాజు పుత్రికను పరిణయమాడెను. క్రీ. శ. 1534 లో తురకల నుండి రాయచూరు లోయను గెలిచెను. క్రీ. శ. 1535లో రామరాయలు అచ్యుతరాయలను ఖైదుచేసి, ఆ మహారాజు తమ్ముని కుమారుడగు సదాశివరాయలను రాజుగ నిల్పెను. రాజధానిలో ఇట్లు కృష్ణరాయల మరణానంతరము రామరాయలు రాజులను మార్చుటచేతను, సామం