పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/536

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రదేశ చరిత్రము _ III


హరిహరుని మరణానంతరము విరూపాక్ష రాయలు I ను (క్రీ. శ. 1404-1405), బుక్క రాయలు II ను (క్రీ. శ. 1405-1406) కొద్దికాలము పాలించిరి, తదనంతరము దేవరాయలు I ( క్రీ. శ. 1406-1422) క్రీ.శ. 1406 లో పట్టాభిషిక్తు డయ్యెను. ఫిరోజ్ షా ఏటేట విజయనగరము పై దండెత్తుచునే యుండెను.

కొండవీటి రెడ్డి రాజులు సుల్తానుపక్షమున దేవరాయలతో పోరుచుండిరి. దేవరాయల మిత్రుడు కాటయ వేమారెడ్డి యుద్ధమున హతుడయ్యెను, క్రీ. వ. 1419 లో దేవరాయలు పానుగల్లు దుర్గమును పట్టుకొనెను. దేవరాయలు చనిపోగా, పుత్రుడు రామచంద్రరాయలు (క్రీ. శ. 1422) కొన్ని నెలలు పాలించెను. తరువాత, తమ్ముడు విజయరాయలు (క్రీ.శ. 1422-1426) రాజ్యమునకు వచ్చెను. బహమనీ సుల్తాను అహమదుషా విజయనగరము పై దండెత్తి అమాయిక ప్రజలను హింసించి, చంపెను. మృతిచెందిన జనులు 20,000 లకు మించగనే ఆనందోత్సవములను జేయుచుండెను, దేవా యతనములను పాడుచేయించుచుండెను. క్రీ.శ. 1426 లో దేవరాయలు II, అదివరకు తండ్రితో పాలించి రాజ్యమునకు వచ్చెను. ఇతనినే ప్రౌఢదేవరాయలందురు.

ప్రౌఢదేవరాయలు క్రీ. శ. 1422- 1446) కొండవీటి రెడ్డి రాజ్యమును గెలిచి, రాజమహేంద్రవరపు రెడ్డి రాజ్యమును బలపరచెను. కేరళమునకుబోయి క్విలాన్ ను, ఇతర రాజులను గెలిచెను. ఇతని రాజ్యము గుల్బర్గానుండి సింహళము వరకును, ఒరిస్సానుండి మళయాళమువరకును విస్తృతిగాంచెను. దేవరాయలు సైన్యములో తురకలను చేర్చికొని, తన సైనికులకు విలువిద్యలో ప్రావీణ్యము గరపెను. ఇతడు రాయచూరుపై దండెత్తి పుత్ర మరణము వలన వెనుదిరిగెను. ఇతనితరువాత వచ్చిన రాజులు విజయరాయలు II క్రీ. శ. (1446 - 1447), మల్లి కార్జునరాయలు (క్రీ. శ. 1447- 1465) బలహీనులగుటచే ఈయదను జూచుకొని బహమనీ అలాయుద్దీను II, కపిలేశ్వర గజపతియు విజయనగరముపై దండెత్తిరి. విజయనగర సామంతులు సాళువ నరసింహరాయలు, అతని సేనాపతి తుళువ ఈశ్వరరాయలు ప్రబలులై యుండిరి. మల్లి కార్జునరాయల అనంతరము విరూపాక్షి రాయలు II (క్రీ. శ. 1465-1485) రాజయ్యెను. ఇతడు విషయలోలుడు. తురకలు గోవా మున్నగు రేవులను వశపరచుకొనిరి. చంద్రగిరి అధిపతి సాళువ నరసింహరాయలు కపిలేశ్వరుని మరణానంతరము గోదావరి వరకుగల భూమిని జయించి ఓడ్రులను తరిమెను. పురుషోత్తమ గజపతితో కలిసి మహమ్మదు III (క్రీ.శ. 1478 - 1481) లో యుద్ధము చేసెను. విరూపాక్ష రాయల అనంతరము ప్రౌఢరాయలు రాజయ్యెను. (క్రీ.శ.1485) క్రీ.శ. 1486 లో ప్రౌఢరాయలను పదభ్రష్టునిజేసి సాళువ నరసింహరాయలు విజయనగర సింహాసన మాక్రమించెను.

II. సాళువవంశము (క్రీ. శ. 1486-1505) : నరసింహ రాయలు (క్రీ. శ. 1486-1491) బలవంతులయిన సామంతుల తిరుగుబాటుల నణచెను. క్రీ.శ. 1489 లో పురు షోత్తమగజపతి గుండ్లకమ్మవరకు వచ్చి ఉదయగిరిని ముట్టడించి గెలిచెను. నరసింహరాయలు తుళువదేశము, హనొవర్, భట్కల్, బకనూరు, మంగుళూరు రేవులను సాధించి, అశ్వముల దిగుమతి సాగించెను. తమిళదేశమును జయించెను. క్రీ. శ. 1491 లో నరసింహరాయల మరణా నంతరము పెద్దకొడుకు తిమ్మభూపతి రాజ్యమునకు వచ్చెను. కాని కొద్దికాలములోనే ఇతడు హత్యగావింప బడెను. తరువాత చిన్న కొడుకు ఇమ్మడి నరసింహరాయలు (క్రీ. శ. 1491-1505) రాజయ్యెను. తుళువ నరసనాయకుడు రాజసంరక్షకుడుగ తానే రాజ్యము చేసెను.

III. తుళువవంశము  : నరసనాయకుడు (క్రీ. శ. 1491-1503) రాయచూరులోయను గెలిచెను. క్రీ.శ. 1496లో రాజ్యమున తిరుగుబాటులు నడచుటకై కన్యాకుమారి వరకు విజయయాత్ర సాగించెను. శ్రీరంగపట్టణపు నంజరాజును గెలిచి క్రీ. శ. 1497 లో పడమటితీరమున గోకర్ణమువరకు గెలిచెను. ప్రతాపరుద్ర గజపతితో యుద్ధము చేసెను. నరసనాయకుడు సాళువ నరసింహ రాయలు ప్రారంభించిన రాజ్యవిస్తృతిని కొనసాగించి పుత్రుడు కృష్ణరాయల యొక్క సర్వతోముఖముగ ఉత్కృష్టమైన యుగమునకు పునాదులు నిర్మించెను. క్రీ. శ. 1503 లో తుళువ నరసనాయకుడు చనిపోగా కుమారుడు ఇమ్మడి నరసనాయకుడు (వీరనరసింహ రాయలు) రాజసంరక్షకు డయ్యెను. క్రీ.శ. 1505 లో రాజు సాళువ ఇమ్మడి నర