పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/524

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రదేశ చరిత్రము . II


కనుకనే ఈతని ధర్మములను కొన్నిటిని అతడు స్థిరపరచెను. కామచోడుడు, అతనికొడుకు త్రిభువనమల్లుడు 1137 నుండి 1151 వరకు రాజ్యమేలిరి. ఉభయులు కలిసి కొణిదెన గ్రామమున ధర్మములు చేసిరి. వీరి శాసనములనుబట్టి కమ్మనాడు, గుండికర్రు, మొట్టవాడి వీరిపాలన మందుండెను. వీరు వేంగి రాజ్యమునకు లోబడి పాలించు చుండిరి. పశ్చిమ చాళుక్య రాజులను వేంగినుండి పారదోలిరి. వెలనాటి చోళులతో సఖ్యముగా నుండిరి. వీరి కాలమునుండి కాకతీయులు (రుద్రదేవ, గణపతిరాజులు) దేశముపై దండెత్తి ఆక్రమించుకొనిరి. బల్లి చోడుని కాలమున (1211-22) కొణిదెన తెలుగు చోళుల అధికారము తగ్గెను. ఇట్లే వెల్నాటిచోళుల అధికారముకూడ తగ్గెను. గణపతిదేవుడు వేగిదేశమును క్రమముగా స్వాధీన పరచుకొనెను.

పొత్తపి (కడవ) తెలుగుచోళులు :- వీరు కడపజిల్లా పుల్లంపేట తాలూకాలోని టంగుటూరు వద్దనున్నపొత్తపి రాజధానిగా తెలుగు చోళవంశములోని వేరొకశాఖ 200 సం. లు రేనాటిని పాలించిరి. వీరు పశ్చిమ చాళుక్యులకు, తరువాత చోళులకు సామంతులుగ నుండిరి. 13 వ శతాబ్ద ప్రారంభమున కాకతీయులచే జయింపబడి సామంతులయిరి. కరికాలవంశమునకు చెందిన తెలుగు బిజ్జన మనుమడు మల్ల దేవుడు పొత్తపిని పాలించెను. వాని వంశములోని బెట్టరస 1121 నుండి 1125 వరకు పాలించెను. విక్రమచోళుని విజయమునకై నందలూరువద్ద దానశాసనము ఇచ్చెను. ఈతని కాలమున అత్యనచోళుడు రేనాడులో కొంతభాగము నేలుచుండెను. ఈతడుపశ్చిమ చాళుక్యులకు సామంతుడు. ఈతనిక్రింద సామంతుడొకడు ముదివేము అగ్రహారమును 108 మహాజనులకు దానమిచ్చెను. సిద్ధరస కొడుకు విమలా దిత్యుడు 1125 లో నందలూరులోను, శ్రీ కాళహస్తిలోను చాల దాన శాసనములను ఇచ్చెను. ఈతడు విక్రమచోళుని మహా మండలేశ్వరుడు. ఈతని శాసనములు అరవభాషలో కొన్నిగలవు. 1130 లో మల్లిదేవు ములికె (300 గ్రామములు), సిందనాడి (1000 గ్రామములు) దేశములను వల్లూరు రాజధానిగా పాలించెను. ఈతడు పశ్చిమచాళుక్య సోమేశ్వరుని సామంతుడు. ఈతడు తెలుగు పల్లవులను జయించి పాకనాడులోని కొంతభాగము నేలెను. ఈతని మనుమడు మల్లిదేవు 1159 లో పాలించెను. ఈతడు నెల్లూరు తెలుగు చోడరాజగు నల్లసిద్ధిచే ఓడింపబడి (1159) వానికి సామంతుడుగా రాజ్యమేలెను. కొంత తరువాత రాజగు ఓపిలిసిద్ధి 1224 లో కమ్మనాటిని జయించి, కాకతిగణపతి అనుగ్రహమున కొణిదెన రాజధానిగా 6000 దేశమును పాలించెను (1280 వరకు). గణపతి దేవుని జయమునకై కొణిదెన శంకరేశ్వరునికి మొగలి చెరువు గ్రామమును దానమిచ్చెను. గణపతిదేవుడు తన ప్రతినిధిగా ఓపిలిసిద్ధిని ‘పొత్తపి, పాకనాడు, కమ్మనాడు, వెలనాడులపై నియమించెను. అరవ లిపిలో పాండ్య రాజగు సుందరపాండ్యుని (1216-38) శాసనములు నందలూరు, వేపాక, అత్తిరాల, పొత్తపినాడులలో దొరకుటచేత ఈ ఓపిలిసిద్ధి అతని సామంతుడయ్యెనని తోచును. ఈతని తరువాత భీమదేవుడు కాకతిగణపతి సామంతుడుగ పాలించెను (1235). కాకతీయ రాజ్యానంతరము (1325) విజయనగర రాజులకు లోబడి ఆ తరువాత గజపతి రాజులకు లోబడి 15 వ శతాబ్దాంతమువరకు ఈ వంశపు రాజులు పశ్చి మాంధ్రదేశమును పాలించుచు దైవబ్రాహ్మణ భక్తి కలిగి వారికి అనేక భూదానములను చేయుచు కీర్తి గడించిరి.

నెల్లూరు తెలుగు చోళులు (1100-1350): తెలుగు చోళవంశమున ఈ శాఖమిక్కిలి ప్రసిద్ధి గాంచెను. 12 గురు రాజులు 250 సం. లు ఏలిరి. వారి రాజ్యము ఒకప్పుడు ఆంధ్రలోని చాలభాగమును హోయసల తెలుగుపల్లవ, చోళరాజ్యములలో కొంతభాగము కలిగి యుండెను. వీరు ప్రథమమున చోళ చక్రవర్తులకును, తరువాత కాకతీయులకును సామంతులుగా నుండిరి. కాని వీరు 13 వ శతాబ్దమున చాల ఉచ్ఛదశయందుండిరి. వీరి చరిత్ర చాల భాగము వీరి శిలాతామ్ర శాసనము లవల్లను, వాఙ్మయమువల్లను తెలియును. తెలుగు, సంస్కృతము, అరవము, గ్రంథ. కన్నడ భాషలయందును లిపుల యందును శాసనముల నిచ్చిరి. మరియు ఆకాలపు చోళ, హోయసల, కాకతీయ, వెలనాటి చోళరాజుల శాసనములు, వాఙ్మయముకూడ వీరి చరిత్రమును మనకు బాగుగా తెలుపును.