పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/516

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రదేశ చరిత్రము - I


ఆ కాలమున పెక్కు బౌద్ధమత శాఖీయు లుండిరి. పూర్వ శైల, అపర శైల, బహుశ్రుతీయ, మహిళాసక ప్రభృతి శాఖల వారుండిరి. బౌద్ధారామములను నిర్మించిన వారిలో భదంతానందుడు ముఖ్యుడు. కృష్ణానది లోయ ప్రాంతమున బౌద్ధ శిల్పములు, కట్టడములు వెలయుటకు ఇక్ష్వాకుల పాలనమే కారణ మయినది.

వీరపురుష దత్తుని కుమారుడు, మహారాజ వాసిష్ఠీ పుత్ర బాహుబల శాంతమూలుడు. ఈతడు 11 సంవత్సరములు పాలించెను (క్రీ.శ. 250-260) రాజవంశపు స్త్రీలు ఇతనికాలమునకూడ బౌద్ధమతమునందు అభిరుచిని శ్రద్ధను చూపిరి. అతని తల్లి భట్టిదేవి 'దేవీవిహారము' అనుదానిని పూర్తి చేసెను. రాజుసోదరి కందబాలశ్రీ భిశువులను సత్కరించెను. నాగార్జునకొండ బౌద్ధ క్షేత్రములను చూచుటకు కాశ్మీర, గాంధార, చైనా దేశములనుండి పలువురు వచ్చెడివారు. అప్పటి ప్రజాజీవితమును తెలిసికొనుటకు నాగార్జునకొండ శిల్పము లెంతయు నుపకరించును. మూడవరాజగు శాంతమూలుని తర్వాత ఇక్ష్వాకుల ప్రతిభ తగ్గెను. వారు బౌద్ధమతమునకు చేసిన సేవ చరిత్రలో చిరస్థాయి అయినది. ఇక్ష్వాకుల పతనమునకు కారణమ బౌద్ధమత సంస్కృతికి విరుద్ధముగానున్న రాజవంశముల ఉద్ధతియే. పల్లవులు, బృహత్ఫలాయనులు శాలంకాయనులు, విష్ణుకుండినులు, ఆనందగోత్రులు వైదిక మతాభిమానులు.

పల్లవులు  :- ఇక్ష్వాకుల వెంటనే ఆధిపత్యము వహించినవారు పల్లవులు, క్రీ. శ. మూడవ శతాబ్దము మొదలు కొని తొమ్మిదవ శతాబ్దము వరకు కృష్ణా కావేరీ నదుల మధ్యభాగమును వీరు పాలించిరి. పల్లవులెవరో నిర్థారణచేయు విషయమున భిన్నాభిప్రాయములు గలవు. ఎట్లున్నను వీరు శక యవన పహ్లవులు అను విదేశ జాతి లోనివారనియు, ఉత్తర హిందూదేశమునుండి క్రమముగా దక్షిణమునకుసాగి ఇప్పటి గుంటూరు మండలములోని పల్నాడు ప్రాంతములో వీరు స్థిరనివాస మేర్పరచుకొనిరనియు కొందరు చెప్పుచున్నారు. ఈ అభిప్రాయము సమంజనముగా నున్నది.

పల్లవ వంశములో చారిత్రక పురుషుడుగా పరిగణింపదగినవాడు వీరకూర్చ మహారాజు. నాగవంశ్యుడును వనవాసి మహారాజును అగు విష్ణుస్కందుని కుమార్తెను ఇతడు వివాహమాడి రాజ్యమును బడసెను. ఈ మొదటి పల్లవ వంశమును గూర్చి మైదవోలు, హీరహడగల్లి, కందుకూరు ప్రాంతములలో దొరకిన ప్రాకృత శాసనముల వలన తెలియుచున్నది. తరువాత రాజులలో ముఖ్యుడయినవాడు మహారాజ శివస్కందవర్మ లేక విజయ స్కందవర్మ. ఇతని తండ్రి కంచి నగరమును రాజధానిగా జేసికొని అచటినుండి కృష్ణానదీ తీరమునుండి బళ్ళారి వరకు పాలించెను. మహారాజు శివస్కంద వర్మ అనేక యాగములు చేసెను. యువ మహారాజగు బుద్ధవర్మ యొక్క భార్య చారుదేవి నెల్లూరుమండలమున నారా యణస్వామి దేవాలయమునకు భూదానము చేసెను. పల్లవులు వైదిక మతాభిమానులు. కంచినగరము గొప్ప విద్యా కేంద్రముగా ప్రసిద్ధికెక్కెను. గుప్త చక్రవర్తి యగు సముద్రగుప్తుడు కావించిన దక్షిణ దిగ్విజయ యాత్రాకాలమున (కీ. శ. 346) విష్ణుగోపుడను పల్లవ రాజు పాలించుచుండెను. సముద్రగుప్తుని అలహాబాదు శాసనము ఇతనిని పేర్కొనినది.

తరువాత పాలించిన పల్లవరాజులను గురించి సంస్కృతములో లిఖింపబడిన శాసనములనుండి తెలియుచున్నది. కుమార విష్ణువు అనునతడు చోళులనుండి కంచి నగరమును స్వాధీనము చేసికొని పాలించెను. ఇతడు కదంబులతో పోరాడవలసివచ్చెను. క్రీ. శ. 6 వ సతాబ్ది ప్రారంభమున సింహవిష్ణువు అనునాతడు తరువాత పాలించిన పల్లవ మహారాజులకు మూలపురుషు డయ్యెను. పల్లవ చక్రవర్తులలో కొందరు శివుని, కొందరు విష్ణువును కొల్చెడివారు, యాగములు చేసెడివారు. కుమార విష్ణువు అనంతరము పాలించిన రాజులలో నందివర్మ అను రాజే త్రిలోచన పల్లవుడు అను ఒక అభిప్రాయము కలదు. ఈతనికి ముక్కంటి కాడువెట్టి అను పేరును కలదు. ఇతడు గర్భశత్రువు లగు చాళుక్యుల నెదిరించినవాడు, ఇతడు కరికాళచోళునితోకూడ యుద్ధము చేసెను. విజయాదిత్యుడను చాళుక్యుడు త్రిలోచన పల్లవునితో యుద్ధము చేసెను. ఆ యుద్ధమున విజయాదిత్యుడు చంపబడెను. అతని భార్య గర్భవతియై కడపమండలములోని ముదివేము అగ్రహారమున, విష్ణుభట్ట సోమయాజి ఇంట దాగి