పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/496

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర జానపదగేయ వాఙ్మయము

మరణించువరకు, ఆయన ప్రిన్సిపాలుగా పనిచేసిరి. తరువాత, ఉపాధ్యాయులుగా పనిచేయుచుండిన శ్రీ చిల్లరిగె శ్రీనివాసరావు కొంత కాలము పనిచేసి 1925 లోనో 1926లో నో రాజీనామా ఇచ్చిరి. తరువాత ఈ సంస్థ కొంతకాలము సరిగా పనిచేయలేదు. శ్రీ రామకోటీశ్వరరావు కొంత కాలము ఈ సంస్థను నడపిరి. కాని ఆయనకూడ త్వరలోనే రాజీనామా ఇచ్చిరి. ఆ కళాశాల యొక్క ప్రథమదశలో శ్రీ హనుమంతరావుగారు బ్రతికి ఉన్న రోజులలో అనగా 1916 వ సంవత్సర ప్రాంతమున ప్రొఫెసర్ ఛటర్జీ ఆధ్వర్యవమున చిత్రలేఖన విభాగ మొకటి ఏర్పరచబడెను. ఆయన బెంగాలీ పద్ధతికి చెందిన చిత్రలేఖనములో ఉత్తమవిద్యార్థులను పెక్కు మందిని తయారు చేసిరి. శ్రీ ఛెటర్జీ మూడు సంవత్సరములు పనిచేసిరి. ఆ తరువాత శ్రీరమేశ్ చక్రవర్తి ఆయన స్థానములో రెండు సంవత్సరములు పనిచేసిరి. శ్రీ కౌతా రామ మోహన శాస్త్రి, భారత లక్ష్మీబ్యాంకు నడపించుచున్న శ్రీ బి. వెంకటరత్నం, చిత్రలేఖన కళాశాలను స్థాపించిన శ్రీ గుర్రం మల్లయ్య, శ్రీ బెజవాడ గోపాలరెడ్డి, ఈ కళాశాలలోని విద్యార్థులే. ఈ కళాశాలతో కొంత సంబంధము కలిగి చెప్పుకోదగిన మరొకవ్యక్తి కురుగంటి సీతారామయ్య. ఈయన సంస్కృతాంధ్రభాషలలో ప్రసిద్ధ పండితుడు. ' చిట్టచివరకు రాజకీయవాతావరణము ప్రశాంతత చెందినది. కాని కళాశాల మాత్రము మూయబడినది. స్వాతంత్య్రము ప్రకటించబడినది. ఆంగ్లేయులు భారతదేశము విడిచిపోయిరి. ఒక విద్యాసంస్థను యుద్ధచిహ్నముగాగాని, యుద్ధ కేంద్రముగాగాని నడపించుటలో సమంజసత్వము లేదు. ఈ లోపుగా విద్యాభివృద్ధికై జీవితమంతయు పాటుబడిన కొందరు మిత్రులు ఈ కళాశాలను ప్రథమతరగతి కళాశాలగా నడపింతుమని అడిగిరి. ఇది ఒక్కటే కళాశాల ఆస్తిని, సొమ్మును, సంరక్షించుటకు సరియైన మార్గ మనిపించినది. ఇదైనను ఒక చిన్న కార్యముగా పరిగణింపబడరాదు. ఈ సంస్థను విశ్వవిద్యాలయము త్రొక్కు పాత బాటలోనే. ఆ పద్ధతులలోనే నడిపించుటకు ఇష్టములేనివారిలో నేను ముఖ్యుడను. కాని నేను చివరకు ఈ అభ్యంతరము మానితిని. ఇప్పుడు ఈ కళాశాల ఆంధ్ర విశ్వవిద్యాలయముతో అనుబంధము కలిగి, ప్రతి సంవత్సరము వేల విద్యార్థులకు శిక్షణము ఇచ్చుచు పురోగమించుచున్నది. భారత దేశములో చదువుకొన్న వారిసంఖ్య 16½%. వీరిలో 6% మాత్రమే శుభ్రముగా చదివి వ్రాయగలరు. అందులో 4% మాత్రమే చదువుటయందును, వ్రాయుటయందును ఉత్సాహము కలవారు. 96% జనమునకు ఉన్నత పాఠశాలలను, కళాశాలలను. పుస్తకములను, పరికరములను, ఉపాధ్యాయులను, తదితర సామగ్రిని సమకూర్పవలెను. ఈ భావి విద్యాభివృద్ధి నిర్మాణమునకు ఈ కళాశాల తగినవిధముగా ఉపకరించునని నేను భావించుచున్నాను. వీలయిన సహాయము లన్నియు కూడగట్టుకొని ఈ కళాశాల అభ్యుదయముతో ప్రయోజనకరమైన సంస్థగా మన స్వరాజ్యములో నేడు సేవ జేయుచున్నది.

భో. ప.

ఆంధ్ర జానపద గేయ వాఙ్మయయము  :- పద్యముకన్న పదమే ముందు పుట్టినదనియు, ఆ పదము (గేయము) కూడ నాగరకతా ప్రారంభమున మానవుడు సంతోష సమయమున చిందులు వేయుచు కూన రాగముల నాలపించుచు లయాన్వితముగా మనోభావముల వెలార్చుటచే, ఉద్భవించిన దనియు, సాహిత్య తత్త్వజ్ఞుల అభిప్రాయము. కొందరు పండితులు పనిపాటలుచేయు మానవులు తమ కష్టము కనబడకుండుటకై అప్రయత్నముగా నేవో మాటలు లయా న్వితముగా గేయరూపమున బహిర్గత మొనర్చిరని తెల్పిరి. ఇం దేది సిద్ధాంతమయినను కవిత్వము ఉల్లాసము నకును కష్ట నివారణమునకును పుట్టినదని భావింపవచ్చును. భారతదేశమున పూర్వమును, ఇప్పుడును జనపదములే కనుక ఇట్టి గేయములకు పుట్టినిండ్లును జనపదములే యగును. జానపదు లందే ప్రచారమున నుండుటచే ఇట్టి గేయములకు జానపద గేయము అని సర్వసాధారణ మగు పేరు కలిగినది. జనపద, జానపద శబ్దములు క్రమముగా దేశవిభాగము నకును అందుండు ప్రజలకును మన ప్రాచీన వాఙ్మయమున వాడబడినవి. జానపద గేయములనే పల్లెపాట లనుటకూడ కలదు. ఔ త్తరాహులు వీటిని లోకగీతము లందురు. ఇంగ్లీషులో వీటినే ఫోక్ సాంగ్సు అందురు. ఇది జర్మను భాషా