పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/493

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రజాతీయ కళాశాల


రాజకీయాలనుండి ముస్లింజాతి తప్పుకొనుట, ప్రత్యేక ఓటింగు పద్ధతిలో మహమ్మదీయులకు ప్రాతినిధ్యము, స్త్రీలకు, బ్రాహ్మణేతరులకు, క్రైస్తవులకు ఓటింగుకు స్థానములు ప్రత్యేకించుట, మొదలగువాటిని గురించి నూత్న ఉత్సాహము ప్రదర్శింపబడినప్పటినుండికూడ విద్యావిధానములో ఏమార్పునులేదు. విద్యావిధానమున రాజకీయ శక్తులద్వారమున మన రాజకీయోద్దేశములకై .మార్పుకలిగించుటకు ప్రయత్నము చేయుచున్నారని ప్రజలపైని, కాంగ్రేసుపై ని ప్రభుత్వము నిందారోపణము చేయుచుండెడిది. కాని నిజముగా ప్రభుత్వమే రాజకీయ చర్యలద్వారా, రాజకీయోపాయముల ద్వారా, భారత జాతీయత యొక్క అభ్యుదయశక్తులు పురోగమించకుండ చేయుచుండెను. 8 కోట్ల జనసంఖ్య కలిగిన బెంగాలు, బీహారు, ఒరిస్సా రాష్ట్రములను (1) పశ్చిమ బెంగాలు (2) అస్సాముతో కూడిన తూర్పు బెంగాలు అని రెండు రాష్ట్రములుగ విభజించుటలోని ప్రభుత్వము యొక్క ఉద్దేశము, అత్యధికముగ ముస్లిం ప్రజలు కలిగిన రాష్ట్రమును భారతదేశములో సృష్టించవలెనని యే. ఎప్పుడో ఒకప్పుడు త్వరలో భారతదేశము ఒక సంయుక్త పద్ధతిని పునర్నిర్మించ బడునను సంగతి ప్రభుత్వమునకు తెలియును. సమాఖ్యలలో ఒండొంటితో కలసి ఉండు రాష్ట్రములు ఉండుటకు అవ కాశము కలదు. కావున ఒకేజాతి అన్ని రాష్ట్రములలో అధిక ప్రభావము కలిగి ఉండకూడదను భావము, భావిదృష్టియు, తెలివితేటలును గలవారికి కలుగక మానదు. అందువలననే తూర్పు బెంగాలు, అస్సాము కలిపి ముస్లిం ప్రజలు అత్యధిక సంఖ్యలో ఉండునట్లు ఒక రాష్ట్రము ఏర్పరుపబడినది.

ఇక ఉద్దేశముల క్రమవిధానమును పరిశీలింతము, విదేశీయునిదృష్టిలో రాజకీయముగ భారత దేశములో అత్యధిక సంఖ్యగల ఒకేజాతితోకూడిన రాష్ట్రములు ఉండకూడదు. అందు భావిసమాఖ్యను ఊహించి జన సంఖ్యా విభాగములను నిర్ణయించిరి. ఆవిధముగా బెంగాలు బీహారు, ఒరిస్సా రాష్ట్రములు (1) పశ్చిమ బెంగాలుగా (2) అస్సాముతో కూడిన తూర్పు బెంగాలుగా, విభజించబడెను. ఈ విభజనము విద్యలో, ఉద్యోగములో, రాజకీయ జీవితములో భారత దేశమునకు నాయకుడుగా ఉన్న బెంగాలీయుని వెన్నెముకకు పెద్ద దెబ్బ కలిగించవలెనను ఉద్దేశముతోడనే చేయబడినది. బెంగాలీయుని నాయకత్వము ఇకముందు ఉండకూడదని దాని ఉద్దేశము. అందు కనుగుణముగ ముస్లిం జనులు అత్యధికముగా ఉన్న రాష్ట్రము ఏర్పరుప బడినది. ఈ దూరదృష్టితో కూడిన ఈ కుటిలో పాయమునకు విరుగుడుగా బెంగాలీయుడు ప్రతిక్రియ చేయమొదలిడెను. అతడు భారత జాతీయతను బలహీనము చేయవలెనను బ్రిటిషు వారి పన్నుగడను నాశము చేయుటకు పూనుకొనెను. ఆంగ్లేయునికి, బెంగాలీయునకు మధ్య సిద్ధాంత సంబంధమైన పోరాటము జరిగినది. 1905 అక్టోబరు 16 వ తారీఖున ప్రారంభమయిన అ యుద్ధము వంగదేశమునందేగాక, భారతదేశమంతటను వ్యాపించినది. భారత దేశములో ప్రాథమిక, మాధ్యమిక ఉన్నతవిద్యలను ఏ విధముగా రూపొందించవలెను? భారతీయుడు ఒక సారస్వత పారిశ్రామికుడుగా మాత్రమే శిక్షణము పొందవలెనా? లేక తన కర, నేత్రముల యొక్క ప్రయోజనము అభివృద్ధి చేసికొని, ఇంద్రియములకు, శక్తులకు సరియైన శిక్షణ మొసగి సాంకేతిక విషయ శాస్త్రములు నేర్చుకొని యంత్రములను నిర్మించుట, బోయిలర్లను, ఇంజనులను, యంత్ర చక్రములను నిర్మించుట మున్నగు భారతదేశపు అవసరములను తయారుచేయుటయందును, వాటిని నడపుటయందును ప్రావీణ్యము సంపాదించు కొనవలెనా? ఈ కారణము చేతినే భారత దేశములోని విద్యావిధానము విస్తృతమై, సాహిత్య, శాస్త్రీయ, సాంకేతిక విషయ సంబంధమగు నట్లుగ సంస్కరింపవలసిన అగత్య మేర్పడినది.

ఈ ఉద్దేశముతోడనే మచిలీపట్నములోని ప్రజలు,'బిపిన్ చంద్రపాల్' చే బోధింపబడి, అరవిందఘోష్, సతీశ్ చంద్ర ముఖర్జీలచే ప్రచారము చేయబడిన బెంగాల్ ఉద్యమమును జాగ్రత్తగా పరిశీలించిరి. హైకోర్టు ఉద్యోగమునుండి విరమించిన గురుదాస్ బెనర్జీ వంటి న్యాయాధికారులు తమశక్తిని, తెలివిని, విరామకాలమును, జాతీయవిద్య స్థాపించుటకై వినియోగించి, ముఖ్యముగా తూర్పు బెంగాలులో ఇంచుమించు 24 జాతీయ ఉన్నత పాఠశాలలను స్థాపించిరి. బెంగాలులో తీవ్రముగ వ్యాపిం