పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/457

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అశ్వశాస్త్రము


యేటను, నల్లగుఱ్ఱమునకైన అది పదునేడవ యేటను, యూపస్తంభమువంటి రేఖగాని, చైత్యాకార రేఖగాని యున్నచో ఆ హయము పదునెనిమిదవ వర్షమునను, కపిశవర్ణమైన “రేఖగలది పందొమ్మిదవ సంవత్సరమునను మరణించును. చక్ర రేఖ, వజ్రరేఖ, అర్ధచంద్ర రేఖలు కూడ హయమున కరిష్ట సూచకములే. శ్రీవృక్షము, స్వస్తికము, నంద్యావర్త రేఖలు శుభప్రదములు.

అశ్వచేష్టలు శుభాశుభములు  :- మోర పై కెత్తి పెద్దగా సకిలించుట, గిట్టలతో నేలను త్రవ్వుట యను చేష్టలు యజమానునకు యుద్ధమున విజయమును సూచించును. పదేపదే మూత్రపురీషములను విడచుట, కన్నీరు గార్చుట, అపజయమునకు సూచకము, అకారణముగా తెల్లవారుజామున సకిలించుట పరులు దాడి వెడలి వచ్చుటను తెలుపును. తోకమీది గగుర్పాటు యజమానునికి ప్రవాసము కలుగు ననుటకు గుర్తు. ఎడమ కాలితో భూమిని త్రవ్వుట, దీనముగా చూచుచు సకిలించుట, తత్స్వామి పరాజయమును సూచించును. మోమున దుమ్ము చిమ్ముకొనుట, ఎండుగడ్డిని, పుల్లలను కరచుట, భయపడినట్లు సకిలించుట, తోక వెండ్రుకలను జల్లిగా విప్పుట యను చేష్టలు అశుభ సూచకములు. జూలు నిగిడ్చి, కుడికాలితో నేలతాచుట విజయ హేతువు.

ఏబదినాలుగు హయజాతులు  :- భారత దేశీయములగు హయములను అవి యుద్భవించిన ప్రాంతములనుబట్టి యేబదినాలుగు జాతులుగా విభజించినారు. వానివాని స్వరూపము, స్వభావము భిన్న భిన్నములై యుండును. వీనిలో కాంభోజ, బాహ్లిక, వనాయుజ, గాంధార, చాంపేయ, సైంధవ, తిత్తిల, పాటలీపుత్రక, యవన, కాశ్మీరాద్యశ్వములు శ్రేష్ఠములు, దాక్షిణాత్య హయములు ప్రశస్తములు కావు. కళింగాశ్వములు - స్థూల పాదములు, దీర్ఘకర్ణములు, వంకరమెడలు, అల్ప వేగములు గలవిగా చెప్పబడినవి. అట్లే త్రిలింగదేశజములైన గుఱ్ఱములు కోపము గలవిగాను, పందివలె ఘుర్ఘుర ధ్వని చేయునట్టివిగాను, పెద్ద వక్షస్థలము గలవిగాను, స్తబ్ధములై యల్ప వేగము గలవిగాను వర్ణింపబడినవి.

అశ్వారోహణము  : మంచి రూపము, మంచి సుళ్ళు, బలము మొదలైన యుత్తమగుణము లెన్నియున్నను హయము వేగహీన మగుచో నిరర్థకముగా భావింపబడును. కనుక అశ్వారోహకుడు వేగవంతమైన యశ్వమునే యేరుకొనవలెను. మిక్కిలి లావైనవాడు, ముక్కోపి, మూర్ఖుడు, భయముగలవాడు, తొందరపాటు గలవాడు, తల నిలుకడ లేనివాడు, కొట్టతగని చోట కొట్టువాడునైన యశ్వారోహకుడు నింద్యుడు. అట్టివానికి హయము వశవర్తియై మెలగదు. .. అశ్వారోహకుడు ఆయా జాతి గుఱ్ఱముల స్వభావాదులను లెస్సగా ఎరిగి యుండవలెను. బ్రాహ్మణజాతి గుఱ్ఱమును దానికి ప్రీతికరములగు తినుబండారములు పెట్టి లాలించియు, క్షత్రియజాతి గుఱ్ఱమును మేను నిమిరి బుజ్జగించియు, వైశ్యజాతి గుఱ్ఱమును నోటితో గద్దరించియు, శూద్రజాతి తురంగమును దండించియు నేర్పుతో తన యంకెకు తెచ్చుకొని నడుపవలెను. మాటిమాటికి సకిలించినను, భయముతో ముందడుగు వేయని యప్పుడును, త్రోవతొలగి నడుచు నపుడును, కోపముతో రుసరుసలాడునపుడును, మతిచెడినట్లు ప్రవర్తించినపుడును గుఱ్ఱమును దండింప వలెను. మిక్కిలిగా సకిలించునపుడు ముట్టిమీదను, తొట్రుపడునపుడు కణతలకడను, భయపడి నప్పుడు ఱోమ్మునను, దారి తొలగినపుడు తొడలపైనను పిక్కల పైనను, కోపగించినపుడు పొట్టమీదను, మతిచెడినట్లున్నపుడు చెవులమీదను కొట్టవలెను. ఆయా స్థానములను గుర్తింపక ఇష్టము వచ్చినట్లు బాదినచో గుఱ్ఱము మొద్దుబారి యనేక దోషముల కాకరమగును. ఎంతటి యుత్తమాశ్వ మయినను ఎప్పుడును స్వారిచేయక కట్టి యుంచినచో చెడిపోవును. అట్లని మితిమీరి తట్టు తెగ పరువు లెత్తించుటయు తగదు. మితము, హితము పాటించి అశ్వమును నడుపుకొనవలెను.

అశ్వధారలు  : విభ్రమము, ప్లుతము, పూర్ణకంఠము, త్వరితము, తాడితము ననునవి యైదు ముఖ్యములైన యశ్వగతులు. వీనినే ధారలనియు నందురు. ఇవియేగాక మయూరీగతి, హంసీగతి, తిత్తిరిగతి, చతుష్క గతి యని యశ్వగతులు మరికొన్నియు గలవు. తలను, మెడను, తోకను పై కెత్తి పరు గెత్తుటకు మయూరీగతి యని పేరు. ప్రక్కల నెగురవేయుచు, తలను కదల్చుచు పోవుటను హంసీగతి యందురు. తొందరగా నడచుచు తోకకదల్ప