పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/446

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అవనీంధ్రనాథఠాకురు


తోను, పరిచయమునుపొంది స్వీయ కళా విధానమును పెంపొందించుకొనెను. శిల్ప శైలియందు కొంత భేదము స్థూలదృష్టికి గోచరించినను, ఇప్పటినుండి మొత్తము మీద ఆతని రచనయందు చెప్పదగినంత మార్పేమియు లేదన వచ్చును.

ఠాకురు భిన్నములైన ద్రవ్యసాధనములతో అసంఖ్యాకము లయిన చిత్రములను చిత్రించెను. వాటిలో ఒక్కొక్క చిత్రము యొక్క ప్రత్యేక శైలి నైపుణ్యములను వివక్షించినచో అది చిత్రకళకు ఒక అమూల్య ఉపహారముగా పరిగణింపబడదగి యుండును.

1930 లో అవనీంద్రనాథుడు "అరేబియన్ రాత్రులు” అను చిత్రమాలికను ప్రారంభించెను. ఈ చిత్రమాల అతని సృజనాత్మకమయిన చిత్రకళా జీవితమునందలి చరమ దశాసూచకమై యున్నది. జపానీయకళాపారగుల పరిచయ మేర్పడిన కాలమునుండి ఠాకురుయొక చిత్రము లందలి ప్రసాధక గుణము అప్రధానమయ్యెను. కాని 'అరేబియన్ నైట్సు' అను మాలికాచిత్రములలో మరలప్రసాధక గుణము అతిశయించెను. దీనికి కారణ మతడు తద్రచనమున బుద్ధిపూర్వకముగా నొనర్చిన యత్నమే. ఇవ్విషయమున అతడు పొందిన జయము అపూర్వము.

చిత్రకారుడుగా డాక్టరు ఠాకూ రొనర్చిన కృషిని సమగ్రముగ ప్రశంసింప శక్యముకాదు. అతని కళ బహుముఖములతో, వివిధ రీతులతో సంకలిత మైయున్నది. 1896 వ సంవత్సర ప్రాంతమున ఠాకూరు ప్రారంభించిన చిత్రకళోద్యమము యొక్క ఆరంభావస్థయందు అతడు చిత్రించిన చిత్రములు పాశ్చాత్య చిత్రకళా ప్రభావమును నిరసించుటకును, దేశీయ కళాశైలి సాధనముగా ప్రాచీన భారతీయ చిత్రకళ నుద్ధరించుటకును, ఉద్దిష్టములయినవి. (భారతీయ చిత్రకళా ప్రవృత్తియందు) పాశ్చాత్య కళాధిపత్యమును సహింపని తిరుగుబాటుదారుగాను, భారతీయ చిత్రరచనయందలి అతి సూక్ష్మతత్త్వములను అత్యంత సామర్థ్యముతో నిరూపించుచు వ్యాఖ్యానించువాడుగను, అతడు రంగమున ప్రవేశించెను. అట్లనుటచే నతడు కేవలము ప్రాచీనకళారీతుల నుద్ధరించుటకై యత్నించె నని అనుకొనుట సరికాదు. అతడు అన్ని దేశములందలి చిత్రకళారీతులను, విధులను, కల్పనా సంప్రదాయములను సమీకరించుకొనగల ఒకానొక అద్భుతశక్తితో విశిష్టమైన ప్రతిభ కలవాడు. ప్రాచ్య - ఆసియాయందును పాశ్చాత్యదేశములందును గల కళాప్రవీణుల చిత్రరచనా క్రమమును సాదరముగా, యథేచ్ఛముగా అత డవలంబించెను. అతడు తన చిత్రసృష్టి యొక్క ఆరంభదశయందు ప్రాచ్య - పాశ్చాత్యదృక్పథములను రెండింటిని అనిర్వచనీయమైన సంయోగముతోను సమీకృతమైన మైత్రితోను ఉపయోగించెను.

డాక్టరు అవనీద్రనాథ ఠాకురు ఉపాధ్యాయుడుగా అసదృశుడు. మిక్కిలి పనివారయిన శిష్యులయెడ కన్నతల్లివలె అపరిమితమైన ఓపికను, కన్నతండ్రివలె వాత్సల్యమును, అనుకంపను అతడు చూపెను. సాధారణులయిన శిష్యుల యొక్క హృదయములందు లీనమైయున్న శక్తులను బహిర్గతము చేయుటయం దీతనికిగల శక్తిసామర్థ్యములు అద్భుతావహములు. తన శిష్యులపై తన రచనా విధానము నెన్నడు అతడు విధించియున్నవాడు కాడు.

అవనీంద్రనాథుడు చిత్రకళకు సంబంధించిన నూతనోద్యమమునకు నాయకుడుగా ఎడతెగని కృషి సల్పేను. తన అనుయాయులకును, సన్నిధాన వర్తులగు శిష్యులకును ఉత్సాహావేశములను కల్పించెను. వారి కాతడు ఉత్తమ హైందవ కళాచిత్రములను అవగతము చేసికొను విధానమునందును, నూత్నాలోచనలు కల ఆధునికుల భావ ప్రకృతులకును, అవసరములకును, పరిస్థితులకును అనువగు రీతిగా నూతనకళారీతులను పునర్ని యోజన మొనర్చు టకై, భావములను, ద్రవ్యములను, సంగ్రహించు విధానమునందును సాకల్యమైన శిక్షణ మొనగెను. 1906 వ సంవత్సరములో అవనీంద్రనాథుడు తన శిష్యుల కొసగిన ఉపవ్యాసమునందు చిత్రకళపై తనకుగల ఆశయములను ఇట్లావిష్కరించెను. “మీరొక సుందరమైన ప్రదేశ చిత్రమును వ్రాయు సంకల్పముతో ఒక ఉద్యానమునకుగాని, నదీ తీరమునకుగాని పోయి అచ్చటి మొక్కలను, పువ్వులను, జంతువులను రంగులతో చిత్రించుట నేనెరుగనిది కాదు. అట్టి సులభసాధనములతో సౌందర్యమును మీ యధీన మొనర్చుకొనుటకు మీ రొనర్చు యత్నములు నాకాశ్చర్యమును కలిగించుచున్నవి. సౌందర్యము బహిరుపాధుల నాశ్రయించునదికాదు. అది అత్యంతముగా