పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/439

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అల్లూరి సీతారామరాజు

యుండెనేమో ? పెద్దనయందలి గౌరవముచే నాగ్రామమున నాటికి నేటికిని అల్లసానివారికి నగ్రతాంబూల సన్మానము నిలచియున్నట్లు చెప్పుదురు. ఈ కవి వంశీయు లిప్పటికిని గొందరు జీవించియున్నారు.

వ. దు.


అల్లూరి సీతారామరాజు  :- భారతీయ తత్త్వదర్శ నాంశములను పూర్వజన్మ సంస్కారమున గ్రహించి, ఆంధ్రత్వము నిలువబెట్టుటకు పరిశ్రమించిన విరాగి, త్యాగి, పరోపకారపరాయణుడు, దీన జ నా వ ను డు అల్లూరి సీతారామరాజు. బ్రిటిషు ప్రభుత్వమువారి దమన నీతి నసహ్యించుకొని, దుష్టపరిపాలనమునకు ఎదురుతిరిగి, బ్రిటిషు ప్రభుత్వమును ముప్పుతిప్పలు పెట్టి మూడుచెరువుల నీరు తాగించిన యోధుడు అల్లూరి సీతారామరాజు.

ఇతని స్వగ్రామము పశ్చిమ గోదావరిజిల్లా, భీమవరముతాలూకాలోని మోగల్లు గ్రామము. క్షత్రియవంశమువాడు. తండ్రి పేరు వేంకట్రామరాజు. తల్లి పేరు నారాయణమ్మ. ఇతనికి తల్లిదండ్రులు పెట్టిన పేరు శ్రీరామరాజు. కాని యితడు వలచిన కన్య సీత యను యువతి అకాలమృత్యువు వాతబడుటచే, ఆమె జ్ఞాపకార్థము తన పేరును సీతారామరాజుగా మార్చుకొనెను.

శ్రీరామరాజు చిన్నతనమునుండియే ఎప్పుడును, ఏదో ఆలోచించుచు ఉండెడువాడు. చదువుసంధ్యలయందు దృష్టి లేకుండెడువాడు. ఇంగ్లీషు పాఠశాలలలో చెప్పెడు విద్య విద్య కాదనియే అతడు భావించుచుండెను. సీతా కన్య మరణానంతరము వివాహకార్యము తలపెట్టక, వైరాగ్యశీలియై, అడవులు పట్టి తపస్సు చేయసాగెను.

అతడు గోదావరీనదీతీరమందలి పాపికొండల గుహలలో ఏకాంతవాసము చేయుచుండెను. అప్పుడు అచ్చటి ఆటవికు అయిన సవరలతో అతనికి పరిచయము కలిగెను. సవరలు అతనికి సపర్యలు చేయుచు, తమగురువుగా నెంచి ఆతనిని మన్నింపసాగిరి.

సవరలు చేయునది బోడువ్యవసాయము. ప్రభుత్వాధికారులు లంచము లియ్యని సవరలభూములను లాగుకొని తాము ఏర్పాటుచేసిన ముఠాదారులకు సంక్రమింపజేసి ధనము గడింపసాగిరి. పండ్లు కోసినారనియు, కట్టెకొట్టినారనియు, వెట్టి చేయలేదనియు ఏవేవో నేరములు మోపి ఆయారణ్యకులను తహస్సీలుదారు, పోలీసు వారు బాధలు పెట్టుచుండిరి. ఈ ప్రభుత్వాధికారులకు క్రైస్తవమిషనరీలు తోడ్పదు చుండిరి. ముఠాదారులకును, సవరలకును విభేదములు ఏర్పడి తగవులు ప్రబలము కాసాగెను.

ఈ ఆటవికుల దుర్భర జీవనమును గమనించి సీతారామరాజు యమాయకులపక్షమున నిలచి ప్రభుత్వాధికారులతో వాదించసాగెను. ప్రభుత్వమునకు ఈ సీతారామరాజు కంటకుడయ్యెను. అంత ప్రభుత్వము సీతారామరాజును గూడ నిర్బంధములపాలు చేయుటకు సంకల్పించెను. సీతారామరాజు క్రమముగా ప్రతిఘటించి సవరలను సంస్కరించి యుద్ధ సన్నద్ధుల గావించెను. తమ పూజ్యగురువునకు ఎట్టి అపాయము జరుగకుండ సవరలు వేయికన్నులతో కని పెట్టుచు, అంగరక్షకభటులుగా నిలుచుండిరి. పోలీసుబలముతో సవరలకు ముఖాముఖి పోరాటము 1922లో ప్రారంభమయ్యేను. అడవిలోని దుంపలను తీయగూడదనియు, గొడ్లకు గడ్డిని కోయ గూడదనియు, దొరతనము వారుఆజ్ఞలను కావించిరి. 'ఆకలి మంట లొక్కసారి విజృంభించుటచే సవరలు గండ్ర గొడ్డండ్లతో అరణ్యములోని చెట్లను నరుకుటకు కడంగిరి. ఇదియే పోరాటమునకు కారణము.

సాధు సీతారామరాజు బోధనానుసారము సవరలు సాయుధ విప్లవమునకు సంసిద్ధు లగుచున్నారని పోలీసు సిబ్బందితో అధికారులు గ్రామములపయి దండెత్తిరి.