పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/433

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అల్బేనియా

మయిన విజ్ఞానమును కృతజ్ఞతతో స్వీకరించితిని, నాకు తోచిన తప్పులను నిర్భయముగా దిద్దితిని. నన్ను అనుసరించు ఉత్తర కాలికుల ఉపయోగము కొరకు నా పరిశోధనా ఫలితమును వ్రాత రూపమున రక్షించి యుంచితిని.

ఒకప్పుడు అంగీకరింబడిన సిద్ధాంతమునకు వ్యతిరేకముగా భూమి గుండ్రముగా నున్నదని ఊహింపబడినది. మహమ్మదు యొక్క ఆస్థానమందున్న మహమ్మదీయ ఖగోళ శాస్త్రజ్ఞులు మధ్యాహ్న రేఖ యొక్క వృత్తాంశమును (arc of the meridian) కొలుచుటకు ప్రయత్నించిరి. కాని క్లిష్టమైన త్రికోణమితి శాస్త్ర పద్ధతితో పూర్వమునందలి తప్పులను సరిదిద్ది భూమి యొక్క వ్యాసార్థమును, వ్యాసమును, పరిథిని కొలిచి, దిఙ్మండలము యొక్క లోతును ఆధారము చేసికొని ఖగోళము యొక్క పూర్తి విస్తీర్ణమును, ఘనఫలమును (Volume) నిర్ణయించు గౌరవము అల్బెరూనికే దక్కెను. పంజాబులో ఉన్న నందానా అను శిఖరము యొక్క ఉచ్చ్రితిని (Altitude) ఆధారము చేసికొని ఈ గణనలు (Calculations) నిర్ణయింపబడినవి. అల్బెరూని నిర్ణయించిన భూమి వ్యాసార్థము నేటి గణనలకంటె డెబ్బదిమైళ్ళచే తక్కునగుచున్న దనుట స్పష్టము. నేటి ఖగోళ శాస్త్రజ్ఞులకు లభ్యమగు కొలతపరికరముల సాయములేకుండ అల్బెరూని ఈ నిర్ణయము చేయగలుగుట ఆశ్చర్యకరము.

“కానూన్ మసూద్" అను గ్రంథమునందలి మూడవ భాగమునందు త్రికోణమితి శాస్త్రమునకు సంబంధించిన ఆకృతులు, త్రిజ్య, (Sine) జ్య, (cosine) స్పర్శరేఖ మొదలగునవి ప్రతిపాదింపబడినవి. ఇతడు భారతదేశములో ఉద్భవించిన కొన్ని సిద్ధాంతముల నాధారముగా గొనియున్నట్లు కనిపించును. ఐనను యథాక్రమమయిన ఆధునిక రూపమును వాటి కొసగినవా డితడే. వర్తుల స్తంభాకారము కలిగిన (astrolaba) అను దూరనిర్ణయ సాధనమును ఇతడే కనిపెట్టెను. ఈ పరికరము యొక్క సహాయముతో నక్షత్రాదులను (Heavenly bodies) పరిశీలింపగలుగుట యేగాక, దూరమునందలి వస్తువుల యొక్క ఎత్తును, దూరమునుకూడ అల్బెరూని నిర్ణయింపగల్గెను. ఘనమూలము, నిష్పత్తి (ratio), అనుపాతము (Proportion), సంధ్యాకాలము, గ్రహణములు తెలిసికొను పద్ధతి కూడ అల్బెరూని కనిపెట్టెను. తోకచుక్కలు ఉత్పాతములు మున్నగు అనేక విషయముల జ్ఞానమునందు ఇతడు నిష్ణాతుడు. వీటిలో ఒక్కొక్క విషయమే పరిశోధకుని యావజ్జీవమును హరింపదగి యున్నది.

అల్బెరూని అన్ని కాలములకు చెందిన అత్యుత్తమ శాస్త్రజ్ఞులలో నొకడుగా నిస్సందేహముగా పరిగణింపబడదగిన వాడు. మరియు భారతీయ విజ్ఞానమునందత డొనర్చిన పరిశోధనములు, ప్రదర్శించిన విపుల దూరదృష్టి, పరాభిప్రాయ సహిష్ణుత, మున్నగువాటిచే భారతదేశమునకును, నాటి ముస్లిము రాజ్యములకును మధ్య అతడు దృఢమైన సంబంధానుబంధములను కల్పించినవాడు నై యున్నాడు.

హెచ్. కె. షె.

అల్బేనియా  :- ఇది ఐరోపా ఖండము యొక్క ఆగ్నేయభాగములో బాల్కన్ ద్వీపకల్పమునందు ఏడ్రియాటిక్ సముద్రతీరముననున్న రాజ్యము. దీనికి పశ్చిమమున ఏడ్రియాటిక్ సముద్రమును, పూర్వోత్తరభాగములలో యుగోస్లేవియాయు, దక్షిణమున గ్రీసును ఉన్నవి. దీని వైశాల్యము 10,629 చ. మై. జనసంఖ్య 13 లక్షలు. ఇది పర్వతమయమగు దేశము. సముద్రతీరమున మాత్రము సారవంతమయిన సన్నని మైదాన మున్నది.ఉత్తరదిశయందు గల పర్వతములు సుమారు 8 వేల అడుగుల ఎత్తుగలవి. ఉత్తరభాగములో "డ్రిన్" అనునదియు దక్షిణమున “వొయుట్సా" అనునదియు, ప్రవహించును. “ష్కుంబి” అను మరియొక నది అల్బేనియా నట్టనడుమ భాగములో ప్రవహించుచు, దేశమును రెండు భాగములుగా విభజించుచున్నది. ఉత్తరార్ధములో “ ఘెగ్" భాష మాట్లాడువారు, దక్షిణార్థములో “టోస్క్" అను భాష మాట్లాడువారు నివసించుచున్నారు.

అల్బేనియా పర్వతమయమగు దేశము అగుటవలన ముఖ్యనగరములను కలుపు కొలదిపాటి రోడ్లు తప్ప వేరు రాకపోకల సౌకర్యములు లేవు. డురాజో, వలోనా, సారాం డే, అనునవి ఏడ్రియాటిక్ తీరమున ముఖ్యమయిన రేవుపట్టణములు. రాజధాని “స్కూటారి". అది ముప్పది వేలజనాభాగల నగరము. కోరిట్సా, ఎల్బాసాని, ఆర్గిరో