పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/423

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అలాస్కా

శిల్ప విశేషములు :_ ఆలయ ద్వారబంధముల మీదను, వివిధాకృతులతో తీర్చబడిన స్తంభములమీదను, దూలము పైకప్పులమీదను, ఆలయ కుడ్యములమీదను సిద్ధహస్తులైన శిల్పులు మనోహర శిల్పమును వెలయింప జేసినారు. గరుడ, స్వర్గ, విశ్వబ్రహ్మాలయములలో శిల్పలక్ష్మి తాండవము చేసినది. ఇనుకరాతిపై చెక్కబడిన లతా రీతులు, దేవతామూర్తులు, పూర్ణకుంభములు, వివిధ జంతు పక్షి రూపములు, తోరణప్రాయములుగు చెక్కిన గంధర్వ మిథునములు, విచిత్ర భంగిమములతో ఒప్పిన మానవసింహ ముఖములు, దర్శనీయములై చూపరులను ఆకర్షించుచున్నవి. ఇందలి_స్తంభరచన ప్రత్యేక మైనది. స్తంభములు, దిగువభాగమునను పై భాగమునను పూర్ణకుంభ ములను, మధ్యభాగమున అర్ధపద్మమును కలిగియున్నవి. గాలి, వెలుతురు వచ్చుటకై అమర్చబడిన రాతి కిటికీలపై స్వస్తికాది ముద్రలు, లతలు సుందరముగా చెక్క బడినవి. చాళుక్యులు శివ కేశవులకు భేదము పాటింపని వారగుట చేత ఆలయ కుడ్యములపై శైవ వైష్ణవ గాథలు చెక్కబడినవి. లింగోద్భవ, త్రిపురాసుర సంహార, వామనావతార, రత్నాసురసంహార, కిరాతార్జునీయ, గజేంద్ర మోక్షణగాథలు మనోహరముగ తీర్చబడినవి. విమతీయుల క్రూర కృత్యములచే కుడ్యశిల్పము చాలవరకు పాడై పోయినది.

వస్తుప్రదర్శనశాల  : హైదరాబాదు ప్రభుత్వ - ఆర్ష శాఖవారు ఈ ఆలయములను శ్రద్ధతో రక్షించి ఇచట దొరకిన శిల్పఖండములతో నొక పురావస్తు సంగ్రహా లయమును స్థాపించినారు. అందుగల నాగరాజు, నటరాజు, మహిషాసురమర్దని, ప్రదోషమూర్తి, సూర్యుడు, లకులీశ్వరుడు, కార్తికేయుడు, నగ్నక బంధము, భైరవ మూర్తులు మనోజ్ఞ ములయినవి.

స్కాంద పురాణమునందును, నిత్యనాథసిద్ధుని రస రత్నాకరమునందును, పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్రయందును, శేషారాధ్యుని పర్వత పురాణమునను ఈ బ్రహ్మేశ్వర క్షేత్రవర్ణనము విశేషముగ కలదు.

ఇట్లు అన్ని విధముల ప్రసిద్ధిపొంది తైర్థికులకు, శిల్పులకు, చారిత్రకులకు యాత్రాస్థలమై సంస్కృతీ కేంద్రమై విలసిల్లిన అలంపురము ద్రోణాచలం - సికింద్రాబాదు రైలుమార్గమున కర్నూలు ప్రక్కన నున్నది.

గ, రా.శ.

అలాస్కా  :- అమెరికా సంయు క్త రాష్ట్రములలో రాజకీయముగా అలాస్కా ఒక భాగముగ పరిగణింపబడు చున్నది. ఉత్తర అమెరికా పశ్చిమోత్తరపు తుది భాగమున 54°-40° ఉ. నుండి 71°-50° ఉ. అక్షాంశములలోను, 141° నుండి 169° పశ్చిమ రేఖాంశములలోను అలాస్కా వ్యాపించి ఉన్నది. దీని పైశాల్యము 5,86,400 చదరపు మైళ్ళు. అల్యూషను దీవులలో ఉన్న అనాటిగ్ నక్ ద్వీపము అలాస్కాకు దక్షిణపుకొన. ఇచ్చటినుండి అలాస్కాకు ఉత్తరపుకొన అయిన బరోకు 1400 మైళ్ళదూరమున్నది. ఈ దేశమునందలి ముప్పాతిక వంతు భూ భాగము ఉత్తర సమశీతోష్ణ మండలములో నున్నది. అలస్కా యొక్క తీరప్రాంతపు పొడవు 26,000 మైళ్ళు. అలాస్కాలోని భూమి సమతలముగ లేదు. ఇందు దాదాపు 20,000 చ. మైళ్ళు హిమానీ నదములచే (glaciers) కప్పబడును. వాటిలో మిక్కిలి పెద్దది మలాస్ఫినా అనునది. అది 18,008 అడుగుల ఎత్తైన మౌంటు సెంటు ఇలియాసు అను పర్వతము యొక్క పాదభాగమున ఉన్నది.

నైసర్గిక లక్షణములు, శీతోష్ణస్థితి :- అలాస్కా చాల విశాలమైన దేశము. అక్కడి శీతోష్ణస్థితి అడుగడుగునకు మారుచుండును.

దక్షిణ అలాస్కా  :- ఇది బ్రిటిషు కొలంబియాకు సమాంతరముగా నున్నది. దీనిని బ్రిటిషు కొలంబియాలో కలుపుచున్న దీవులకు అలెగ్జాండరు ద్వీపసముదాయ మని పేరు. దక్షిణ అలాస్కాలో సుమారు 10,000 అడుగుల ఎత్తైన పర్వత శిఖరములు కలవు. ఇందు సమతల ప్రదేశము చాల తక్కువ. అపుడపుడు శీతకాలములో చలి ఎక్కువ గను, వేసవిలో ఎండలు తక్కువగను ఉండినను, మొత్తము మీద ఇచ్చట సమశీతోష్ణస్థితి ఉండును. ఈ ప్రదేశమునందు వర్షపాతము చాల ఎక్కువ. వివిధ ప్రాంతములలో ఈ క్రింది విధముగ వర్షించును; వారను దీవియొక్క దక్షిణాగ్రమున సుమారు 200 అంగుళములు, తెచ్చికాన్లో 150 అంగుళములు, జూనియన్ లో 84 అంగుళములు, యాకుటాటాలో 180 అంగుళములు. ఈ ప్రదేశమునకు ఉత్తరపు చివరయందు వాన బొత్తిగా తగ్గిపోవుచున్నది.