పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/422

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆలంపురము


మర్దని, నటరాజు, నాగరాజు, విఘ్నేశ్వరుడు, నరసింహుడు, భైరవులు, ఆంజనేయుడు, నంది, గౌరీ శంకరమూర్తులు, వివిధాకృతులతో కాన వచ్చుచున్నవి. ఇవిగాక, కామాక్షి, పరశురామ, వేంకటేశ్వర, చెన్న కేశవ, పాండురంగ, గోపాలకృష్ణ, శ్రీరామ, దత్తాత్రేయ, దుర్గామూర్తులు కూడ పూజింప బడుచున్నవి. ఇచట శైవ, వైష్ణవ, శాక్తేయ, సౌర, గాణాపత్య, స్కాందాది మతశాఖలకు సంబంధించిన అన్ని దేవతా మూర్తులును ఉండుట గమనింపవలసిన విషయము.

ఇచట బాలబ్రహ్మ, కుమారబ్రహ్మ, అర్క బ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, తారకబ్రహ్మ, గరుడ బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, పద్మ బ్రహ్మ లను నవబ్రహ్మాలయములు కలవు. అన్నియు శివలింగములే. వీటిలో బాల బ్రహ్మేశ్వరుడు క్షేత్రస్వామి. ఈ దేవునకు శివరాత్రి సమయమున బ్రహ్మోత్సవ రథోత్సవములతో తిరునాళ్ళు జరుగును. ఇందలి ప్రధాన దేవీమూర్తి జోగులాంబ -అష్టాదశ దేవీ పీఠములలో చేరిన ఈ దేవత జోగాంబ యని ఆనందకందమునందును, యోగేశ్వరి యని రసరత్నాక రమునందును, 'విశృంఖలా' యని లలితా సహస్రనామ భాస్కరరాయ భాష్యమునను ప్రస్తుతింపబడినది. నవరాత్రులలో నీమెకు రథోత్సవాదులు జరుగును.

బ్రహ్మేశ్వరాలయమున కెదురుగ నంది ప్రక్కనఉన్న చిన్న గుడిలో 'నగ్నకబంధము' భూదేవి యను పేర వంధ్యాస్త్రీలచే సేవింపబడుచున్నది. ఈమూర్తి షోడశీతంత్రమున చెప్పబడిన "ఛిన్నమస్తాదేవి" కాదు. ఇట్టి మూర్తు లీ తీరమున నాలుగున్నవి. మహేంజోదారో త్రవ్వకాలలో ఇట్టిమూర్తి బయటపడిన దట.

వాస్తు పద్ధతి  :- ఇచటి ఆలయ నిర్మాణ పద్ధతి దాక్షిణాత్య సంప్రదాయమునకు చెందినది కాదు. కొన్ని దేవా లయములు దీర్ఘచతురస్రములుగను, కొన్ని చతురస్రములుగను ఉండి రథాకృతిలో కట్టబడిన గర్భాలయములు, వాటిముందు ముఖమంటపములు కలిగియున్నవి. ద్వారబంధముపై కొన్నిటికి గజలక్ష్మి, కొన్నిటికి ఆయా

నాగబంధము - ఆలంపురము

గర్భాలయ మూర్తులను సూచించు చిహ్నములున్నవి. ఇరుప్రక్కల ద్వారపాలకులతోబాటు మకర కచ్ఛపములపై ఆరోహించిన గంగా యమునామూర్తు లుండును. ముఖమంటపము పైకప్పునకు సాధారణముగా నాగరాజుగాని, వికసిత పద్మముగాని ఉండును. కొన్నిటిపై దశావతారములు, అష్టదిక్పాలకుల విగ్రహములు చెక్క బడియున్నవి. ఇందలి గోపుర నిర్మాణము విశిష్టమైనది.గోపురము లన్నియు చదరములై నాలుగు మూలలలో ఆమలకములను, శిఖరమున గొప్ప ఆమలక గోళమును కలిగియున్నవి. బాదామీ, పట్టదకల్లు మొదలయిన స్థలములలో నిర్మింపబడిన వానివలె నీ యాలయములును చాళుక్య వాస్తు పద్ధతిలో నిర్మింపబడియున్నవి. వీనిపై అజంతా ప్రభావము విశేషముగ కలదని శిల్ప శాస్త్రజ్ఞుల అభిప్రాయము.