పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/419

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అలంపురము

యగుటకంటె అకవిగానుండుటయే మేలనియు, కుకవి యగుట మరణప్రాయమే యనియు భామహుడు వచించెను. భరతుడు పదిదోషములను పేర్కొనెను. అవి -'అర్థహీన, ఏకార్థ, గూఢార్థ, అర్థాంతర, విసంధి, శబ్ద చ్యుతి (శబ్దహీన), విషమ, భిన్నార్థ, అభిష్టుతార్థ, న్యాయాద పేత' అనునవి. దండి పదిదోషములను, భామహుడు పదునొకండు దోషములను చెప్పిరి. దోషములు సాధారణముగా పదగతములు, వాక్యగతములు, పదార్థ గతములు, వాక్యార్థగతములు, ఛందోవ్యాకరణగతములు, రసగతములు, దేశ కాలగతములు అయి యుండును. అర్థదోషముల భేదములను మమ్మటుడు, తరువాతి గ్రంథకర్తలు వామన మతానుసారముగా నంగీకరించిరి. మమ్మటుడు కావ్యప్రకాశములో, అలంకార దోషములనుకూడ చెప్పి అన్ని దోషములను అరికట్ట జాలము గనుక ఘోరములయిన దోషములను నిరోధింపవలె ననియు, అన్నింటిలోను ఘోరాతిఘోరములయిన రసదోషములను కవి ప్రయత్నాతిశయముచే దొరలకుండ చేయవలె ననియు. విశదీకరించెను. కావ్యమును నిర్దోపముగా కూర్చుట అసంభవమని విశ్వనాథు డనెను. 'దోషదృష్టి పరముగా మనస్సును అతిగా ప్రవర్తింప చేయకూడదు. దోషైక దృక్కులకు దోషము లేని చోటకూడ దోషము కనిపించును' అని కుమారిలుడు తేటపరచెను.

క.ల.శా

అలంపురము  :- అలంపురము తుంగభద్రాతీరమున ఉన్న ప్రాచీన పట్టణము. ఇది రాయచూరు జిల్లాలోని ఒక తాలూకా కేంద్రము. ఇందలి జనసంఖ్య 7000. ఇప్పుడీ గ్రామ మంతయు శిథిలావశేషములతో నిండి యున్నది. విశాలమైనకోట, పురాణ ప్రసిద్ధములైన నవబ్రహ్మాలయములు, మనోహర శిల్పఖండములు, అనేక శిలాశాసనములు మనకిప్పటికినీ కనబడుచు నాటి వైభవమును స్మరణకు తెచ్చుచున్నది.

చరిత్ర  : ఈ ప్రాంతము చాల ప్రాచీనమైనది. ఇచటికి సమీపమున ఉన్న గొందిమళ్ళ, చాగటూరు శివారులలో కెయిరనులు (cairns) అనబడు ప్రాగైతిహాసిక యుగపు సమాధులు విశేషముగా నున్నవి. అవి శిలాయుగమునకు చెందినవి. వాటిని త్రవ్వించి పరిశోధనలు జరిపినచో క్రొత్తవి శేషములు బయటికివచ్చును.

అలంపురమను పేరెట్లువచ్చెనో ఇందలి కోటను దేవాలయములను ఎవరు ఎప్పుడు నిర్మించిరో తెలుపగల ఆధారములు లభింపలేదు. పురములోని దేవద్రోణి తీర్థమున కోటగోడకు వేయబడిన విజయాదిత్య సత్యాశ్రయుని శాసనమునుబట్టి కోట 7 వ శతాబ్దము తరువాత కట్టబడెననియు, స్వర్గ బ్రహ్మాలయ ద్వారపాలకుని మీదగల వినయాదిత్య సత్యాశ్రయుని లేఖనమునుబట్టి ఆలయములు 7 వ శతాబ్దమునకు ముందు నిర్మింపబడి యుండెననియు గట్టిగా చెప్పవచ్చును.

స్థలపురాణములో, హేమలాపురమనియు, శాసనములలో హతంపుర మనియు నిది పేర్కొనబడినది. 11 వ శతాబ్దపు శాసనములలో అలంపురము పేరు కానవచ్చును. నిఖిలభారత ఆయుర్వేద విద్యాపీఠము (లాహోరు) వారు ప్రకటించిన "ఆనందకందం" అను వైద్యగ్రంథమున అలంపురము ప్రస్తావింపబడినది. ఆ గ్రంథకాల నిర్ణయమున అభిప్రాయ భేదములు కలవు. భారత ప్రభుత్వ-ఆర్ష శాఖవారి 1937 వ వార్షిక నివేదికలోని గురిజాల ప్రాకృత శాసనమందు 'హలంపురస్వామి' ఒకడు అచటి బౌద్ధ స్తూపమునకు దానముచేసిన విషయము కలదు. ఆ హలంపురము ఈ అలంపురమేయైనచో 3 - 4 శతాబ్దములనాటికే అలంపురము ప్రసిద్ధినంది యుండవలెను.

పరిసరములలోనున్న తక్కపిల, ఉండవెల్లి, శాతన కోట గ్రామనామము లీప్రాంతము యొక్క ప్రాచీనతను అస్పష్టముగ తెలుపుచున్నవి. అలంపురపు శిలాలేఖనములను బట్టి, వాస్తు శిల్పములనుబట్టి ఆలయములు 6-7 శతాబ్దములలో బాదామీ చాళుక్యుల కాలమున నిర్మింపబడి యుండునని ఊహింపవచ్చును.

ఈ ప్రాంతములు వరుసగా బాదామీ చాళుక్య, రాష్ట్రకూట, కల్యాణీ చాళుక్య, కాలచుర్య, కాకతీయ,విజయనగర రాజులచే పాలింపబడినవని శాసనములు చెప్పుచున్నవి. తరువాత కుతుబుషాహీ, మొగలు పాదుషాలకు లోబడి బిజ్జులవారు కొంతకాలము పాలించినారు. ఆంధ్రానర్ఘరాఘవ కావ్యకర్తయగు బిజ్జుల చినతిమ్మ భూపాలుడు అబుల్ హసన్ కుతుబ్ షా సామంతుడై అలం