పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/418

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అలంకారశాస్త్ర చరిత్ర


నకు భిన్నముగానుండును. భామహుడు ఈ యర్థములోనే దీనిని ప్రయోగించెను. కావ్యమునందును వ్యవహారమునందలి పదములే ప్రయోగింపబడుచున్నను, కావ్యమునందు అవి విశిష్ట పద్ధతిలో వాడబడుచున్నవి. దీనినే వక్రత యందురు.

వక్రోక్తి కావ్యజీవితము అని నుడివినవాడు కుంతకుడు. ఈతని గ్రంథము 'వక్రోక్తి జీవితము'. వక్రోక్తి యనగా 'వై దగ్ధ్య భంగీ భణితిః' అని ఇతడు నిర్వచించెను. వక్రోక్తి కవియొక్క వాడ్నైపుణ్యముచే నేర్పడునని ఈతని యభిప్రాయము. స్వభావోక్తిని అలంకారమనిన వారిని ఈతడు పరిహసించేను. వక్రోక్తి అరువిధము లని ఇతడు నిరూపించెను. అవి వర్ణవిన్యాస, పదపూర్వార్ధ, ప్రత్యయ, వాక్య, ప్రకరణ, ప్రబంధ గతములు,

ధ్వనికారుడు 'సంభాషణ వైచిత్రియే వక్రోక్తి'యని చెప్పి అది అలంకారమని నుడివెను. వామనుడు వక్రోక్తి 'సాదృశ్య లక్షణ' యని నిరూపించెను. రుద్రటుడు వక్రోక్తి శబ్దాలం కారమనిచెప్పి అది కాకు వక్రోక్తి, శ్లేష వక్రోక్తి అని రెండువిధములుగ నుండుననెను. భోజుని సరస్వతీ కంఠాభరణములో వాఙ్మయమంతయు వక్రోక్తి, రసోక్తి, స్వభావోక్తి యని మూడు విధములనియు, రసోక్తి సహృదయ హృదయాకర్షకమనియు చెప్పబడినది, వక్రో క్తిని గురించి ఈ విధముగా చెప్పుటవలన అది విలక్షణమైన కావ్యస్వరూపమును తెలుపుచున్నదని భావించవలెను. సాధారణ ప్రసంగములలో వాడబడు పదములను గైకోను కావ్యమునం దైనను వక్రోక్తి కొరకు పదములను ఏరుకొను పద్ధతి ఇతర సామాన్య సంభాషణలోకన్న వేరుగానుండును.

కైశిక్యాది వృత్తులు  : ఇప్పుడు 'వృత్తి, ప్రవృత్తి' అను వాటినిగూర్చి చర్చించి వాటికి రీతులతో గల సంబంధ మును చర్చించుట చాల ఆవశ్యకము. 'భారతి, సాత్వతి, కైశికి, ఆరభటి అను నాలుగు వృత్తులను, వాటి అంగములను గూర్చి భరతుడు నాట్యశాస్త్రములో వివరించెను. అతడు వృత్తులు నాట్యమునకు తల్లులవంటివని చెప్పెను. కైశికివృత్తి శృంగార, హాస్యరసములలోను, సాత్వతి, వీర, రౌద్ర, అద్భుతములలోను అవశ్యముగా వాడవలె నని భరతుని మతము. రసార్ణవ సుధాకారుడు వృత్తులకు పైనియమములనే సూచించి, 'భారతీ' అను పదము 'భారీ' శబ్దమునుండియు, 'కైశికీ' అను పదము ' కేశ’ శబ్దమునుండియు ఉత్పన్నములయిన వని వాటికి పౌరాణిక వ్యుత్పత్తులను తెలిపెను. ఒక రసమునకు అనుగుణము అయిన శబ్దముల, అర్థముల ప్రయోగమును గూర్చి తెలిపి, ధ్వని కారుడు ఆవృత్తులే ఔచిత్యయుక్తములై వివిధములుగా తెలియనగు నని కూడా చెప్పెను. వృత్తియనగా వ్యవహారము అని యర్థము. రసానుగుణమై, ఔచిత్యవంతమయిన వ్యవహారముగల కైశిక్యాది వృత్తులు అర్థాశ్రయములనియు, ఉపనాగరికాదులు శబ్దాశ్రయము లనియు అభినవగుప్తుడు తెలిపెను. అతడు 'రసాదుల దృష్ట్యా వాడబడిన వృత్తులు నాట్యమునకు, కావ్యమునకు ఒక అపూర్వమయిన శోభను కలిగించును. ఆ రెంటికిని రసాదులు జీవితభూతములు. ఇతి వృత్తాదులు శరీర భూతములు' అని చెప్పెను. కనుక నాట్యమునకుగాని కావ్యమునకుగాని ఇతివృత్తము శరీరమని స్పష్టమగు చున్నది. కైశిక్యాదులు అర్ధవృత్తులని, ఉపనాగరికాదులు శబ్దవృత్తులనికూడ స్పష్టమైనది. భరతుడు కైశికీవృత్తిని స్త్రీలుమాత్రమే బాగుగా నటించగలరని అనెను. ఉద్భటుని మతములో వృత్తులు పరుష, ఉపనాగరిక, గ్రామ్య భేదముచే మూడు విధములు.

నాట్యశాస్త్రములో భరతుడు అవంతి, దాక్షిణాత్య, పాంచాలి, ఓడ్ర, మాగధి, అను ప్రవృత్తులను చెప్పి, ప్రవృత్తియనగా నానా దేశ వేష భాషా- ఆచారవా ర్తలను ప్రఖ్యావన చేయునది అని తెలిపెను. దాక్షిణాత్య ప్రవృత్తిలో అనేక నాట్యములు, గానము, సంగీతము కలవనియు ఆతడు వచించెను. కావ్య మీమాంసలో వేష విన్యాసక్రమము ప్రవృత్తి యనియు, విలాస విన్యాసక్రమము వృత్తి యనియు, వచన విన్యాసక్రమము రీతి యనియు ఈ మూడింటికిని గల విశేషమును అతి స్పష్టముగా తెలిపెను. సాగరనంది వైదర్భి, గౌడి, పాంచాలి, అను రీతులకు భారతీ వృత్తియు, పాంచాలికి సాత్వతియు, వైదర్భికి, కైశికి, గౌడికి ఆరభటియు, క్రమముగా అంగము లని చెప్పెను.

కావ్యదోషములు  : అలంకారశాస్త్ర గ్రంథములన్నిటిలోను, దోషములను గూర్చి చర్చ జరిగినది. కుకవి