పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/413

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అలంకారశాస్త్ర చరిత్ర


భరతుడు 'విభావానుభావ వ్యభిచారి సంయోగాత్ రస నిష్పత్తిః' అని రససూత్రమును రచియించెను. దీనికి నలుగురు వ్యాఖ్యాతలు భిన్న భిన్న మార్గములతో వ్యాఖ్యానము చేసిరి. వీరిలో భట్టలోల్లటుడు, శ్రీశంకుకుడు, భట్టనాయకుడు అను మువ్వురి మతములను మనము అభినవగుప్తుని వ్యాఖ్యానమువలన తెలిసికొనవలసినదే కాని వారు రచించిన గ్రంథములు లభించుటలేదు. ఈ సూత్ర వ్యాఖ్యాతలలో నాలుగవవాడైన ఆచార్య అభినవ గుప్త పాదుడు ముఖ్యుడు. అతడు రసమునకు అభివ్యక్తి వాదమును లేవదీసెను.

ఈ వాదమును ఆధారముగా చేసికొని అతడు తక్కిన ముగ్గురి యొక్క 'ఉత్పత్తివాదము, అనుమితివాదము. భుక్తివాదము' ఆను సిద్ధాంతములను ఖండించెను. 'విభావాను భావసాత్విక వ్యభిచారి భావములతో పరిపుష్టమైన రత్యాది స్థాయి భావములే రసరూపముగ అభివ్యక్తిని పొందును అని ఇతని సిద్ధాంతము. లోకములో రస శబ్దము, మధుర ఆమ్లాదులకు కూడ వాడబడును. అవి రుచులు. కావ్యరసముకూడ రస్యమానమే కనుక దానికి రసశబ్ద వ్యవహారము కలిగినది. స్థాయిభావము రసాభి వ్యక్తి పర్యంతము స్థిరముగా నిలచునది. దానికి ఆలంబన, ఉద్దీపన విభావములు, సాత్విక భావములు, అనుభావములు, వ్యభిచారి భావములు పరిపోషకములుగా ఉండును. ప్రతి రసమునకు ఒక స్థాయిభావము వేరుగా నుండును. రసానుభవము సహృదయునకు మాత్రమే కలుగును. 'శృంగారము, హాస్యము, కరుణము, రౌద్రము వీరము, భయానకము, భీభత్సము, అద్భుతము,' అని ఎనిమిది రసములను మాత్రమే ప్రాచీనులు అంగీకరించి నారు. కాని ఆ తరువాత శాంతరసము వాటితో చేర్చబడి రసములు తొమ్మిది అయినవి. అది కావ్యమైన రామాయణము నందు కరుణరసము ప్రధానముగ సమగ్ర రూపములో అభివ్య క్తమగును. 'శాంతరసమును తొమ్మిదవ రసముగా చేర్చవలెనా లేదా' అను విషయమును గూర్చియు, రసముల సంఖ్యను గూర్చియు ఆలంకారికులలో భిన్నాభి ప్రాయములు కలవు. రసము సామాజిక నిష్ఠమేకాని నటగతముకాదు. నటుడు శిక్షాభ్యాసము వలన భయ కోపాది భావములను అభినయించుచున్నప్పుడు ఆయా భావముల సంస్కారము సామాజికులకే కలుగును.

భోజుడు తన శృంగార ప్రకాశములో శృంగార మొకటే రసమని విపులముగా చర్చించి నిర్ణయించినాడు. ఆనందమయము బ్రహ్మాస్వాద తుల్యమునైన రసము ఆత్మకు నిరతిశయానందమును కలిగించును. అది ఒక శృంగారమే అని భోజుని మతము. స్త్రీ పురుషుల అనురాగాత్మకమగు లౌకిక శృంగారమును భోజుడు పరిగణింపలేదు. ఆత్మకు కలుగు నిరతిశయమైన శాశ్వతా నందమే శృంగారమని అతడు చెప్పెను. ఈ రసానందము ఇతరు లంగీకరించిన నవవిధ రసములలో సమానమేగనుక అన్ని రసములవలన కలుగు ఫలము ఒకటేయని అతడు భావించెను. కొందరు అద్భుతము ఒక్కటే రసమని అనిరి. భవభూతి కరుణ మొక్కటే రసమని నుడివెను.

అలంకారవాదము  : కావ్యము సౌందర్య మయము. అలంకారములు అనగా కావ్యసౌందర్య వర్థకములు అని భామహునిమతము . రూపకాది - అలంకారములు బాహ్యములే యగును. కావ్యశోభాకరములయిన ధర్మములు అలంకారము లని దండి నిర్వచించెను. వామనుడు తన కావ్యాలంకార సూత్రవృత్తిలో అలంకారములకు ఉచిత స్థానము నిచ్చెను. కావ్యముయొక్క ఉపాధేయతయే అలంకారముమీద ఆధారపడును అని ఆతని మతము. (కావ్యగ్రాహి అలంకారాత్). వామనుని అలంకార నిర్వచనము మిగుల సమంజసముగా కనిపించుచున్నది. "సౌందర్యమే అలంకారము" అని అతని లక్షణము. 'అలంక్రియతే అనేన' అను వ్యుత్పత్తినిబట్టి అలంకార శబ్దము అనుప్రాస - ఉపమాదులయందు వర్తించును. అలంకారముల శబ్ధార్థములయొక్క అస్థిర ధర్మములు, కావ్యశోభాతిశయ కారములు; రసోవస్కా రకములు అని విశ్వనాథుని లక్షణము. "చారుత్వ హేతుః అలంకారః" అని ప్రతాపరుద్రీయము.

కవి సౌందర్యోపాసకుడు. కవి నిర్మితియగు కావ్యము సౌందర్యరాశియగును, అలంకారశాస్త్రములో కావ్యము సౌందర్యవతి యగు సుందరితో పోల్చబడినది. అందు అలంకారములు విద్యమానమగు సౌందర్యమును వృద్ధి పరచును. కొందరు ఆలంకారికులు అలంకారములు