పుట:శ్రీ సుందరకాండ.pdf/82

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ

                 17
కనబడిరచ్చట హనుమకు పిమ్మట,
వారి కులసతులు పరిశుద్ధచరిత,
లభిరూపవతులు, అనురక్తలు తమ
పతులపట్ల మధుపానము పట్లను.
                 18
రేలంతయు తమ ప్రియుల కౌగిలిం
తల నలిగిన నెలత లగపడిరి, మే
నుల వన్నెలు సిగ్గులను ముసుగుపడ,
పువ్వులపొర్లిన గువ్వల గోమున.
                   19
మెలతలు కొందఱు మేడలమీదను
ప్రియుల కవుంగిట పెనగి సుఖింతురు,
ఆచారవ్రత లయిన శుభాస్యలు
భర్తల యిష్టము తీర్తురు ప్రియముగ.
                   20
కోకలు జాఱిన గుబ్బెతల శరీ
రము లగపడె అపరంజి చాయలను,
విరహతాపమున వెలవెల బోయిన
వెలదులు శశిరేఖలవలె తోచిరి.
                   21
ఇచ్చకు వచ్చిన నెచ్చెలికాండ్రను
పొంది సుఖించిన అందకత్తెలను,
స్వగృహంబుల నిజవల్లభుల సరస
ముచ్చట తీఱిన ముగుదల నరసెను.
                   22
చంద్రుని శోభలుచల్లు ముఖములను,
వంగిన ఱెప్పల వాలికకనులను,
తొలకరి మెఱుపులు చిలుకు మంచి ర
త్నాల సొమ్ములు సరాలు చూచె కపి.

71