పుట:శ్రీ సుందరకాండ.pdf/80

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ

                   5
సూదికొమ్ముటంచుల వృషభమువలె,
ఎత్తునెత్తముల హిమనగంబు వలె
పొన్నుకట్లరదముల ద్విరదమువలె,
చెలువారెను సమశృంగంబుల శశి.
                    6
మంచు బురద కసుమాలము జాఱగ,
గ్రహ శోభావహ గత కలంకియై
సుప్రకాశ రోచుల శుభాంకుడయి,
బాసిల్లెను భగవానుడు సోముడు.
                    7
గిరి శిఖరము నెక్కిన సింహము వలె,
కదనము కదిసిన మదగజంబు వలె,
రాజ్యము గెలిచిన రాజన్యుని వలె
వెలసెను పూర్ణ కళలతో చంద్రుడు.
                  8
చంద్రోదయ శుచి జాఱెను చీకటి,
పెరిగె నసురులకు పిశితాశనరుచి,
మణగె మగువలకు ప్రణయదోషములు
స్వర్గభోగమనజాలె ప్రదోషము.
                  9
వీణలు మ్రోగెను వీనుల విందుగ,
ప్రియులతోడ నిదురించిరి పడతులు,
తిరుగవెడలె రాత్రించరజాతము
భయరౌద్రంబులు పయికొన నెల్లెడ.
                 10
మత్తెక్కిన దుర్మదుల సంకులము,
వీర శ్రీ శోభితుల సంభ్రమము,
రథ తురంగ మార్భటసంరంభము,
పిక్కటిల్లు పురవీధులు కనె హరి.

69