పుట:శ్రీ సుందరకాండ.pdf/514

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ

                    32
మఱలివచ్చు సంభ్రమమున కాయము
పెంచుచున్న ననుకాంచి, తా మఱల
పలుకసాగె వరవర్ణిని జానకి,
తేటమొగము కన్నీటను తడియగ.
                    33
కంఠము పెకలక గదగదమనుచున్‌
శ్రుతులు సన్నగిల శోకాహతయై
ఎగసిపోవు నన్నీక్షించుచు వి
భ్రాంతిని పొరలుచు పలికెను నాతో.
                    34
సింహ సంహను లజేయులు నగు శ్రీ
రామలక్ష్మణుల, ప్రాణమిత్రుడగు
సుగ్రీవుని, సచివాగ్రణు లందఱ,
క్షేమము నేనడిగితి నని చెప్పుము.
                   35-36
నీ భాగ్యము మంచిది మహాకపీ!
సేవింతువు రాజీవాక్షుని నా
విభుని రాఘవుని, విక్రమశాలిని
మరది లక్ష్మణ కుమారుని నిత్యము.
                   37-38
అంతనె నే నిట్లంటిని దేవీ!
నా బుజముల పయినన్‌ వేంచేయము,
చూపెద నిప్పుడె సుగ్రీవుని, ల
క్ష్మణ కుమారు, నీ స్వామిని రాముని.
                     39
నా మాటలు విని రామచంద్ర! బదు
లాడెను దేవి “మహాకపి! ధర్మము
కానేరదు, స్వాధీననై యిపుడు
నీ వీపునబడి నేను గమించుట.”

501