పుట:శ్రీ సుందరకాండ.pdf/508

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ

                  11
నా ప్రియసఖి జానకి, ఎచ్చట కన
బడె నన్నచటి కవశ్యము చేర్చుడు;
సీత జాడ తెలిసిన పిమ్మట, క్షణ
మాలసింపగాజాల నే నిచట.
                  12
పిరికిది, మిక్కిలిబేల, కృశోదరి,
నా ప్రాణేశ్వరి ఏ ప్రకార మా
భీకర ముఖులగు రాకాసులలో
ఆపద్భయమున అంగలార్చునో!
                  13
చిమ్మచీకటుల చిక్కు తప్పుకొని
కడపటి మబ్బుల తొడుగుల ఇరికిన
శారద చంద్రుని చాయ ఛన్నమై,
మాయబోలు నా ప్రేయసి వదనము.
                  14
ఏమనె? వై దేహి మహాకపి! అం
తయును చెప్పుము యథాతథముగ, రో
గార్తు డనువయిన ఔషధమునువలె
త్రావి బ్రతుకుదును నీ వాగమృతము.
                  15
మధురభాషిణి సుమంగళ వేషిణి
నా ప్రేయని జానకి ఏమనియెనొ
నా వియోగతపనలలో ఉడుకుచు,
చెప్పుము హరికులశేఖర! నాతో.

495