పుట:శ్రీ సుందరకాండ.pdf/49

ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 1

               177
విధి నిర్మించిన వితత వితానమయి
విద్యాధరకుల విబుధ గణంబులు,
సంసేవించు విశాల మార్గమున
పక్షీంద్రునివలె పఱచె మహాకపి.
               178
అతివిశాలము, నిరాలంబనమగు
వాయు మార్గమును పట్టి గరుత్మం
తుని వలె చనుచుండెను హనుమంతుడు,
జీమూతములను చీలిచి చిమ్ముచు,
              179
కపియూధపు పటు గాఢ తాడనల
చెల్లాచెదరై నల్లని మబ్బులు
మిసమిస మెఱసెను పసుపుపచ్చలై
పండు కెంపులయి పాల తెలుపులయి.
             180
వెనుకముందెడా పెడగొట్టిన
శ్యామలాభ్రముల సందిలిసందుల
వానరు డగపడె వానాకాలపు
చంద్రు చందమున చాటయ బయలయి.
           181
అనిల తనూజుడు హనుమంతుండు, ని
రాలంబ నభం బంతయు తానయి,
ఖేచరులకు వీక్షించనయ్యె, వ్రే
లాడు ఱెక్కల కులాచలమట్టుల,
             182
ఆ లీలన్ దివి తేలియాడుచున్
ఎగసిపోయెడి కపీంద్రుని గని, సిం
హికయను రాక్షసి, ఇచ్ఛారూపిణి
తలపోసెను. మది తనువు పెంచి యిటు.

38