పుట:శ్రీ సుందరకాండ.pdf/483

ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 62

                 7-8
సీతజాడ తెలిసినదను పొంగున,
అంగదు మాటల ఆదరువున, వన
పాలకుల నడచి, పండ్లు తినిరి, తే
నెలు త్రాగిరి, మత్తిలగ వానరులు.
                9
బారులు తీరిచి కూరుచుండి, ఆ
కుల దొప్పలు చేతులను పట్టుకొని,
తేనె పోసికొని పానము చేసిరి,
చించి పార వేసిరి తుద కన్నియు.
               10
తేనె తిక్క యెత్తిన కపులొక కొం
దఱు కయ్యాలకు తారసిలిరి; కొం
దఱు తేనె పెఱలు విఱిచి కొట్టుకొన
సాగిరి తెగబడి త్రాగిన మత్తున .
               11
కొందఱు మ్రాకుల క్రింద పాదులను,
కొందఱు కొమ్మల సందుల, కొందఱు
రాలిన ఆకుల రాసులపై , ఒడ
లెఱుగక వ్రాలి శయించిరి తూగుచు.
               12
కుత్తుక బంటిగ క్రోలి మధువు, ఉ
న్మత్తు లగుచు కై పెత్తి కాఱుకూ
తలకు దిగిరి, మాటలు మితిమీఱగ,
కొట్టుకొనిరి ఒక్కొకరు కలియబడి.
                 13
సింహనాదములు చేసిరి కొందఱు,
అఱచిరి కొందఱు ఆపరాని తమి,
మధువు త్రాగి మైమఱచిన కొందఱు,
నేలమీదబడి నిద్దురపోయిరి.

470