పుట:శ్రీ సుందరకాండ.pdf/44

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ

                 145
ఇంతలో హనుమ యెగసి చనుటగని,
సురలు సిద్ధులు ఋషులు గంధర్వులు
పలికిరి, సూర్యప్రభలతో వెలుగు
ఉరగమాతయగు సురసను కనుగొని.
               146
అనిల తనూజుడు హనుమంతుడు వా
రాశి దాటు నాకాశమార్గమున
క్షణమాత్రము విఘ్నము కావించుము,
ఊతలేని యీ ఉప్పరవీధిని.
               147
రక్కసి ఆకారముతో, ఆకస
మంట పెరిగి, పింగాక్షులు ఘూర్ణిల,
కోరలు సాచుచు, నోరు తెఱచుకొని,
కదలక నిలువుము కపి కట్టెదుటను.
              148
నీ సమక్షమున నిలిచి, యెదిర్చి, జ
యించి పోవునో ? ఎడదారినిబడి
దేవురించుచున్ తిరిగి పోవునో,
చూడవలతు మీ శూరుని బలమును.
              149
దేవతలిట్లు నుతించుచు పలుకగ,
నాగమాత చెలరేగిన బులుపున,
రక్కసి రూపున ఱంపిల్లుచు భీ
కరముగ లేచెను కడలికి నడుమను.
              150
వికృత వికారవిభీతిభూతమగు
రూపుతో సురస, యేపుమీఱి చను
హనుమ మార్గమున కడ్డకట్టగా
చుట్టుముట్టి నిష్ఠురముగ పలికెను.

33