పుట:శ్రీ సుందరకాండ.pdf/37

ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 1

                100
కరుణాళుడు రాఘవుడు, ప్రవాస వి
షాదిని మైథిలి, సామీరి యితడు;
వీరి వెతలు భావించి, నగాగ్రణి !
మీదికి రమ్మిది మిత్రుల ధర్మము.
                101
సాగరుడాడిన సాధూక్తులు విని,
పైకి లేచె మైనాకుడు; తోడ్తో
తోయధి జలములు త్రుళ్ళి సుళ్ళువడి
తరులును తీగెలు తరలి వెంటరాన్.
                102
దీప్త కిరణముల దినమణి యెట్టుల
కాలమేఘములు చీలిచి బయలగు,
అటు లగాధతోయధి జలంబులను
భేదించుచు గిరి మీదికి వచ్చెను.
               103
సాగరు నాదేశము మన్నించుచు,
నీటిలోపల మునింగియుండియును
లేచివచ్చెను మహాచలంబు తన
కనక శిఖరములు కనబడ మెఱయుచు.
               104
పన్నగ కిన్నరులున్న హిరణ్మయ
శృంగము లపు డీక్షింపగ నాయెను,
అరుణకిరణమాల్యముల పోలి ఉ
ప్పరమును రాయుచు కెరలుచున్నగతి,
               105
శైల శిఖరములు స్వర్ణచ్ఛాయలు
వెదజల్ల నెడాపెడ నుజ్వలముగ,
ఇనుప పొలము పోలిన ఆకాశము
పసిడి పంటలన్, మిసమిసలాడెను.

26