పుట:శ్రీ సుందరకాండ.pdf/352

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ


6-7
కాయము పెంచి స్వకీయ మహిమచే,
దండ చఱచె హరి, దద్దరిల్లె లం
కాపురి, పక్షులు గలగల రాలెను,
కావలివారలు కళవళ మందిరి.
8
జయము ! రాఘవుని శస్త్రాస్త్రములకు,
జయము ! లక్ష్మణస్వామి బాహులకు,
జయము ! రామవాత్సల్య లాలితుం
డగు సుగ్రీవ మహానుభావునకు.
9
ధర్మకర్మ పరతంత్ర చరితుడగు
కోసలేంద్రునకు దాసదాసుడను,
వైరి హంతకుడ, మారుతాత్మజుడ,
హనుమంతుడ విఖ్యాతనామకుడ.
10
పదివందల రావణు లెదిర్చినను
మోకరించి పడమొత్తుదు రణమున
పిడుగురాళ్ళతో సుడివడ కొట్టుదు
కండలు పెరుకుదు కాళ్ళగోళ్ళతో.
11
లంకగడ్డ మూలము లగల్చి, సీ
తకెఱగి, అభివాదములు సలిపి,రా
క్షసలోక సమక్షంబున నేగెద,
ఇష్టార్థము ఫలియింప సమృద్ధిగ.
12
అని యార్చుచు చైత్యప్రాసాదము
మీద నిలిచి సామీరి అసురులకు
భీతిగొలుప నిర్ఘాతపాత ని
స్సాణ ఘోరముగ ఝంకారించెను.

339