పుట:శ్రీ సుందరకాండ.pdf/34

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ

                82
కపిదోర్దండాఘాతల పిగిలిన
మబ్బులు మెరసెను మలక వన్నెలను,
పాల తెలుపులై , నీలిచాయలయి,
పచ్చి పసుపులై , పండు కెంపులయి.
                83
గాలిలో నటుల తేలియాడు పటు
వేగశాలి కపివీరుని చూచుచు,
పువ్వుల వానలు బోరున కురిసిరి
తనిసి దేవ గంధర్వ చారణులు.
              84
రామభద్రు కార్యత్వర నేగు మ
హావానరు నిష్టార్థసిద్ధికయి,
తాపము కొలుపడు తపనుడు, పవనుడు
ఇవతాళించును హితముగ ఇరుగడ.
                85
అలయక ఆగక ఆకసమున బడి
చనుచున్న మహౌ జస్విని చూచుచు
తనిసిరి ఋషిసత్తములు, దేవతలు
పొగడిరి, గంధర్వులు కొనియాడిరి.
               86
ఆకాశమున నిరాయాసముగా
పయనించు మహావానరు చూచుచు,
యక్ష పన్నగులు రాక్షస విబుధులు
హర్షించిరి ఉత్కర్షులై తలరి.
                 87
తారాపథమున బారలు సాచుచు
వేగవేగముగ సాగు హరిని గని,
ఇక్ష్వాకుల స్నేహితుడు సముద్రుడు
చింతించెను తన చిత్తమునం దిటు.

23