పుట:శ్రీ సుందరకాండ.pdf/33

ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 1

                   76
వెడలుపు పదియామడలు, పొడవు ము
ప్పది యామడలుగ వ్యాపించిన కపి
మేని నీడ బింబించె నందముగ
క్రింద మహార్ణవ కీలాలంబుల.
                   77
వాయుమార్గమున వడిధావించెడి
హనుమంతుని వెనుకనె చనునీడలు,
లవణార్ణవ సలిలంబుల తేలెను
శ్వేతాభ్ర ఘనశ్రేణి విధంబున .
                  78
అతి తేజస్వి, అనంతకాయుడు మ
హాకపి నిగిడి నిరాలంబ మయిన
వాయుమార్గమున పరుగిడుచుండెను:
పక్షంబులుగల పర్వతంబువలె.
                 79
బహు బలిష్ఠమగు వానర యూధప
మే దెస నారోహించె రయోద్ధతి,
ఆయా దెసను మహావారాన్నిధి
కుదిసి సుళ్ళుపడి, క్రుంగి దొప్పగిలె.
                80
పక్షుల గుంపున వ్రాలిన గరుడుని
కరణి, మేఘముల కలచి లాగు సుడి
గాడుపు కై వడి, కపివీరుడు వడి
పఱచుచుండె నంబరవీధింబడి.
                81
మసలెడి మబ్బుల ముసుగులలోపల
చాటగుచును బాహాటం బగుచును,
ఆకసమున నడయాడెను మారుతి;
దాగుడుమూతల రాగిలు శశివలె.

22