పుట:శ్రీ సుందరకాండ.pdf/322

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ


                    56
రమ్యమాల్యములు, రత్నహారములు,
పృథివీ రాజ్యము, ప్రియ కళత్రమును
స్వేచ్ఛగా విసర్జించిన లక్ష్మణ
పుత్రునికన్న సుమిత్ర ధన్యయగు,
                   57
తల్లి దండ్రులను తనిపి, అడవులకు
నడచు అన్నవెంబడి వచ్చె, నఖిల
సుఖములు విడిచి, విశుద్ధుం; డన్నకు
అనుకూలుడు పావనశీలు డతడు.
                   58-59
సింహపు మూపుల శృంగారముతో,
దీర్ఘబాహువులు తేజరిల్లు ప్రియ
దర్శనుడు, మహోదారుడు, సుఖములు
కోర, డన్న కనుకూలుం డాతడు.
                   60
వృద్ధ జనుల సేవించును, శుభ సం
పల్లక్షణములకెల్ల నాస్పదుడు,
గంభీరుడు, లక్ష్మణు, డర్చించును
నన్ను తల్లివలె, నాథుని పితవలె.
                   61
రాజసుతుడు, సర్వప్రియుండు, నా
మామగారికి సమానుడు, పరిమిత
భాషి, అపరిమిత పౌరుషరాశి నా
కన్న ప్రియుడు రాఘవునకు ఆతడు.
                   62
రాముం డేకార్యమునకు పనిచిన
సాధ్యాసాధ్య విచారణ సలుపక,
నిర్వహించు దానిని; రఘునందను
డతని చూచుకొని పితనే మఱచును.

309