పుట:శ్రీ సుందరకాండ.pdf/317

ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 38


25
గాయములయి రక్తము కాఱిన నా
వక్షంబును రఘువల్లభు డారసి,
క్రుద్ధుండై ఎడకోడె త్రాచువలె
బుసలు చిమ్ముచున్ కసరి యిట్టులనె.
26
ఎవడు తెగించి ఒడ లెఱుగ కిచట నీ
ఱొమ్ము గీఱి గాయమ్ములు చేసెను?
అయిదుతలల కాలాహితోడ చె
ల్లాటల కెగబడె చేటుమూడి యిటు,
27
అనుచు విభుడు వాయసమునకై పరి
కించి చూడసాగెను నలువైపుల ;
అది నా కెదురుగ కదలక యుండెను
నెత్తురు జొత్తిలు కత్తిగోళ్ళతో.
28
ఆ వాయస నాయకుడు, మహేంద్రుని
వరసుతు డనియును, వాయువేగమున
భూసంచారంబునకు వెడలి, దిగి
వచ్చెనని తెలియవచ్చె విభున కెద.
29
అంత, మహాభుజు డాగ్రహోగ్రుడయి,
కనుచూపులు కనకన భ్రమియింపగ,
పారజూచి ఆ బలిపుష్టము నెడ
క్రూరమగు ప్రతీకారము తలచెను.
30
తా నాసీనుండైన చాప నొక
దర్భను బ్రహ్మాస్త్రముగా అభిమం
త్రించి వైచెను, జ్వలించుచు అది వా
యసమునంటి వెన్నాడెను వదలక ,

304