పుట:శ్రీ సుందరకాండ.pdf/311

ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 37


62
వానరేంద్ర ! నా ప్రాణవల్లభుని
తక్క మఱొక్కని తాకను సత్యము;
అస్ఖలితంబగు అస్మదీయ పా
తివ్రత్యముతో దీక్ష పట్టితిని.
63
నన్ను పట్టి స్యందనమున నిడి, పఱ
తెంచునపుడు, పరదేహము తగిలెను,
ఏమి చేయుదు, అనీశ, ననాథను,
పరబలాత్కృత నవశను నే నపుడు.
64
ఎప్పటికైన శమించునె నా వెత !
రావణుని పది శిరములు నేలబడి,
అతని బలంబులు హతమై, నప్పుడు
ననుకొని చను టొప్పును రాఘవునకు.
65
రణదుర్జయుడగు రాముని శౌర్యము
వింటిని వీనుల, కంటిని కన్నుల,
నాగదేవ గంధర్వ రాక్షసుల
నెవ్వడు నాతని, కెనగా డనిమొన.
66
గాలి తోడయిన కీలిపోల్కి, ల
క్ష్మణుడు తోడుగా, రణమున చాపము ,
నెక్కడి దైత్యుల చక్కాడు మహేం
ద్రప్రతాపు నెదురన్ నిలుతు రెవరు ?
67
దురమున లక్ష్మణుతోడ, దిగ్గజము
వలె రాక్షసులను పడత్రొక్కుచు, బా
ణాగ్నులు రేగ, యుగాంత భానుడగు
రాము నెదురు వారలు కల రెవ్వరు ?

298