పుట:శ్రీ సుందరకాండ.pdf/310

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ


56
అట్లుగాక , ఇక్కట్లమారి ర
క్కసులు కసరి వెక్కసముగా హిం
సించిన, నేనె త్యజింతు ప్రాణములు,
వృధయగు నీ పని, వ్యధ మిగులును హరి !
57
ఈ నిశాచరుల సేనల చంపగ
చాలు దీవు కపిసత్తమ ! చూడుము ! .
రాక్షస సంహారమునకు పుట్టిన
రామునికీర్తి పరాస్తమగు నపుడు.
58
అదియుగాక ఈ యసురఘాతకులు
నను కొని చని మానవులు మెసలని ర
హస్యదేశమున ఆకట్టినచో,
తెలియదు దాశరథులకు నా యునికి.
59
నా చెఱ తీర్చుటకై చేసిన నీ
యత్నము లన్నియు వ్యర్థమగు నపుడు ;
కాన నీవు రాఘవు తోడ్కొని లం
కకు వచ్చుటయే కర్తవ్య మిపుడు.
60
అరసి చూడుము, మహాత్ముని రాముని
మనుగడయును, లక్ష్మణసహోదరుల
బ్రతుకును, మీ కపిరాజు జీవితం
బు, నిపుడు నాతో ముడివడి యున్నవి.
61
మామక రక్షణమతులు రాఘవులు,
వానరులును నా పట్ల నిరాశను
చెందిరేని, కపి శేఖర ! విడుతురు
వారు ప్రాణంబులు వీరోచితముగ.

297