పుట:శ్రీ సుందరకాండ.pdf/30

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ

                    58
వాయుమార్గమున వడివడి వరుగిడు
కపి కేసరి తీక్షణ వీక్షణములు
మండుచు కనబడె కొండ నెత్తమున
వెలుగు జంట కొఱవుల చందంబున.
                  59
గోరోచన రుచిమీఱి, గుండ్రముగ,
వెలుగు హరీంద్రుని పెద్ద కన్ను గవ,
ఒక చో నప్పుడె ఉదయంబందిన
సూర్యచంద్రులన శోభిలుచుండెను.
                  60
ఎఱ్ఱని ముక్కును ఎఱ్ఱని మోరయు,
అగ్గలించె నన్యోన్యచ్ఛాయల,
సంధ్యా సావాసముతో రంజిలు
సూర్యమండలము శోభల చాల్పున.
                 61
వంక లేనటుల పై పయి కెగయగ
చాచిన వాలము చక్కన కనబడె,
కపి కేసరి స్వాగతమునకై దివి,
ఎత్తినట్టి దేవేంద్రు ధ్వజమువలె.
                 62
తెల్లనికోరల దీప్తు లెగయ, చ
క్రాకారముగా తోకచుట్టుకొన ,
మారుతి కనబడె మార్తాండుడు గుడి
కట్టి కూరుచున్నట్టుల దీటుగ.
                63
ధౌతతామ్ర రక్తములయి బలిసిన
పిరుదులతో కపివీరుం డొప్పెను,
చీల్చిన గైరిక శిలల జంటతో
గుబ్బతిల్లు పెనుకొండ చందమున,

19