పుట:శ్రీ సుందరకాండ.pdf/270

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ


                     5
అపుడు, జంట సింహములను బోలిన
రామలక్ష్మణులు క్షేమవార్త లం
పించిరనుచు పులకించి పొంగి వై
దేహి హనుమతో తియ్యగ నిట్లనె.
                    6
బ్రతికియున్నచో పడయవచ్చు సుఖ
మెప్పుడైన నూఱేండ్ల లో ననెడి,
లోకుల సామెత తాకె నన్నిపుడు
భావి శుభోదయ ఫలసూచకముగ.
                    7
కపివరేణ్యు డటు కలిసినయంతనె
సీతకు హృదయము ప్రీతితో తడిసె,
వారిరువురు విశ్వాసముతో ప్రా
రంభించిరి ప్రియ సంభాషణములు.
                    8
మండు శోకమున మ్రగ్గి మసలు వై
దేహి మాటలను దీనావస్థను,
విని కని హనుమయు వెన్నవలె కరగి,
మెల్లమెల్లగ సమీపింప దొడగె.
                    9
ఎంతయెంత కపి అంతికమాయెను
అంతయంత సతి అనుమానించెను,
కామరూపి రాక్షసుడు రావణుడు
వంచన చేయగవచ్చె మఱలనని.
                   10
ఎంత చెడ్డపని యిది యిస్సీ ! నా
వృత్తము నీ పాపిష్ఠికి చెప్పితి,
రూపుమార్చి చేరువ కేతెంచెడు,
వీడు రావణుడె, పీడాగ్రహ మిది.

259