పుట:శ్రీ సుందరకాండ.pdf/269

ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ

సుందరకాండ

సర్గ 34


                        1
దుఃఖము వెంబడి దుఃఖము తఱుమగ
కుములుచున్న ఆయమ పలుకులు విని,
సీత నూఱడించెను హనుమంతుడు
చల్లనిమాటల సాంత్వన మొదవగ.
                       2
నేను రాముని వినీతదూతను, పు
రంధ్రీ ! కుశలము రామున కచ్చట,
అతడు పంప వచ్చితి నీ క్షేమము
తెలియగోరి సందేశము గైకొని,
                       3
బ్రహ్మాస్త్రం బెవ్వనికి అధీనము,
వేదవిదులలో విశ్రుతు డెవ్వడు,
ఆ దాశరథి మహాభాగుడు నీ
క్షేమస్థితి నడిగెను సుమంగలీ !
                       4
మహిత తేజస్వి, మానధనుడు, శ్రీ
రామసేవాభరణము లక్మణుడు,
శోకమున తపించుచు దేవీ ! తల
వాలిచి నీ కభివాదము సలిపెను.

258