పుట:శ్రీ సుందరకాండ.pdf/240

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ




                   42
శాపనార్థములు చాలింపుడు, సాం
త్వన భాషల సీతను యాచింపుడు;
ఇదె మనకందఱ కిపు, డగత్యమని
చింతించెద నా చిత్తము లోపల.
                   43
ఈ స్వప్నార్థము ఎవరి విషయమో
ఆ దుఃఖితయగు వైదేహి చెఱల్
తీఱిపోవు,సిద్ధించు నా సతి అ
భీష్టార్థములు ఇచటనె శీఘ్రము.
                   44
బాధించితి మీవఱ కాసతి నని
అరమర తడయక యాచింపుడు, రా
క్షసకుల భయ మాసన్నంబయినది;
రాముని శస్త్రాస్త్ర ప్రహరణముల.
                   45
జాలిగుండెగల జానకి దేవత
వంటిది, రాక్షస భామినులను కా
పాడ చాలినది; ప్రాంజలికి అధీ
నులు కారె మహాత్ములు లోకంబున.
                   46
అసిత విశాలములయిన కనులతో
శోభిలు జానకి శుభాంగములను
పరికింపగ కనబడ వనార్య ల
క్షణము లేమియును సంశయింపకుడు.
                   47
దేవి విమానము క్రేవల చేరిన
యపు డగపడె, ఆయమ మేని పసిమి
వన్నెమాత్ర మొకవాసి తఱిగె, దుః
ఖము లోర్వగలది కాని కతంబున.

229