పుట:శ్రీ సుందరకాండ.pdf/135

ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 13

                5
ఇచట రావణుని యింటనున్నదని,
గృధ్రవీరకులవృద్ధు, రాజ సం
పాతి చెప్ప విని వచ్చితి, గాలిం
చితి లంకంతయు, సీత లేదిచట.
               6
జనకుడు సాకిన సదమలచరిత, వి
దేహరాజసుత, దిక్కుమాలి; రా
క్షసుని కావరము కక్కసించ బల
వంతపు బలిగా వసమఱిపోవునొ ?
                7
సీత నపహరించిన దశకంఠుడు
రామబాణభయరభసంబున, వడి
వడి నాకసమున పరుగులెత్తగా,
దారినడుమ సతి జాఱిపొకాలెనొ?
               8
అథవా! ఋషులు, మహాత్ములు, సిద్ధులు,
సేవించెడి తారావీధిని బడి,
వచ్చుచు పారావారము నారసి,
గుండెచెదరి పడియుండునొ నీళ్ళను ?
              9
చేతుల రెంటను చిక్కబట్టి, బిగి
తొడలనడుమ నొత్తుచు రావణుడిటు
తెచ్చుచుండగా, తీవ్రపీడ కో
ర్వక ప్రాణంబులు వదలియుండునో ?
              10
అంతకంతకు విహాయస వీధిని
పయికి పైకెగసి పరుగులెత్తగా,
పెనగులాడుచు తపించి, తెగించి, కసి
దూకబోలు పతి తోయధిలోపల.

124